‘టికెట్‌ ఇవ్వకపోతే బీజేపీకి గుడ్‌బై చెబుతా’

23 Apr, 2019 12:55 IST|Sakshi

న్యూఢిల్లీ : ఒక వేళ ఈ ఎన్నికల్లో తనకు టికెట్‌ ఇవ్వకపోతే.. బీజేపీకి గుడ్‌బై చెబుతానంటున్నారు ఆ పార్టీ సిట్టింగ్‌ ఎంపీ ఉదిత్‌ రాజ్‌. ఈ క్రమంలో ఆయన చేసిన ట్వీట్‌ ప్రస్తుతం సంచలన సృష్టిస్తోంది. 2014 ఎన్నికల సమయంలో ఉదిత్‌ రాజ్‌ తన ఇండియన్‌ జస్టిస్‌ పార్టీని బీజేపీలో విలీనం చేసిన సంగతి తెలిసిందే. అనంతరం ఆయన బీజేపీ తరఫున వాయువ్య ఢిల్లీ పార్లమెంట్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఈ సారి మాత్రం ఆయనకు టికెట్‌ దక్కకపోవచ్చనే ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఉదిత్‌ రాజ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

‘నాకు పార్టీ వీడే ఆలోచన లేదు. ఒక వేళ నాకు గనక టికెట్‌ ఇవ్వకపోతే.. పార్టీనే నన్ను బలవంతంగా బయటకు పంపినట్లు అవుతుంది. ఎందుకంటే టికెట్‌ ఇవ్వకపోతే నేను ఒక్క క్షణం కూడా పార్టీలో ఉండన’ని ఉదిత్‌ రాజ్‌ స్పష్టం చేశారు. తన నియోజకవర్గ అభివృద్ధి కోసం తాను ఎంతో శ్రమించానని.. ఈ విషయం పార్టీకి కూడా తెలుసన్నారు. ఈ సారి ఎన్నికల్లో బీజేపీ తనకు టికెట్‌ కేటాయింకపోవచ్చంటూ రాహుల్‌ గాంధీ, అరవింద్‌ కేజ్రీవాల్‌ నాలుగు నెలల క్రితమే తనను హెచ్చరించారన్నారు. ఈ విషయం గురించి వారిద్దరితో కూడా చర్చించినట్లు ఉదిత్‌ రాజ్‌ తెలిపారు.

అంతేకాక ‘నాకు టికెట్‌ కేటాయింపు గురించి అమిత్‌ షాతో మాట్లాడటానికి ప్రయత్నించాను. మెసేజ్‌ కూడా చేశాను. కానీ ఆయన స్పందించలేదు. మనోజ్‌ తివారీ మాత్రం నాకు టికెట్‌ వస్తుందని చెప్పారు. అరుణ్‌ జైట్లీతో కూడా మాట్లాడాను. ఇప్పటికి కూడా బీజేపీ దళితులను మోసం చేయదనే నమ్ముతున్నాను’ అన్నారు. ప్రస్తుతానికి ఉదిత్‌ రాజ్‌ వ్యాఖ్యలు ఢిల్లీలో దుమారం రేపుతున్నాయి.

మరిన్ని వార్తలు