ప్రధాని కార్యాలయం నుంచే అవినీతి..

13 Jan, 2018 12:53 IST|Sakshi

బీజేపీని వ్యతిరేకిస్తే సీబీఐతో దాడులా?: నారాయణ

సాక్షి, విజయవాడ : కేంద్ర ప్రభుత్వం అవినీతి రాజకీయాలకు పాల్పడుతోందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ వ్యాఖ్యానించారు. ప్రధాని కార్యాలయం నుంచే ఈ అవినీతి నడుస్తోందని ఆయన అన్నారు. విజయవాడ దాసరి భవన్‌లో శనివారం సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణతో కలిసి నారాయణ మీడియా సమావేశంలో మాట్లాడారు. చట్టాలను తమకు అనుకూలంగా మార్చేందుకు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. బీజేపీని వ్యతిరేకించేవారిపై సీబీఐతో దాడులు చేయిస్తున్నారన్నారు. 

ప్రధాని కార్యాలయానికి ముడుపులు ఇవ్వలేక అరుణాచల్‌ ప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి ఆత్మహత్య చేసుకున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం నియంతలా వ్యవహరిస్తోందని నారాయణ విమర్శించారు. సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌లపై ఒత్తిడి తీసుకురావడం అప్రజాస్వామికం అన్నారు. సీబీఐ స్పెషల్‌ జడ్జి లోయా మరణంపై విచారణ జరపాలని ఆయన డిమాండ్‌ చేశారు. మెడికల్‌ కుంభకోణంపై ప్రధానమంత్రి స్పందించాలని ఆయన డిమాండ్‌ చేశారు. 

సీపీన రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ...రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఏమి ఇస్తుందో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజలకు వివరించాలన్నారు. ఏపీపై కేంద్రం చిన్నచూపు చూస్తోందన‍్న ఆయన.. పోలవరం ప్రాజెక్ట్‌ కు ఇచ్చే నిధులపై స్పష్టత ఇవ్వాలన్నారు. ముఖ్యమంత్రి.. ప్రత్యేక ప్యాకేజీ నిధులు ఎంతవరకూ సాధించారని రామకృష్ణ సూటిగా ప్రశ్నించారు. రాజధాని నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు నుంచి నిధులు ఇప్పిస్తామని చెప్పడం సిగ్గుచేటు అన్నారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు రాబట్టేందుకు భవిష్యత్‌లో ఉద్యమాలు చేస్తామన్నారు.


 

మరిన్ని వార్తలు