దక్షిణాదికి కన్నడనాడే వారధి

20 Apr, 2018 07:34 IST|Sakshi

యడ్డి సీఎం కావడం ఖాయం 

బీజేపీ అధినేత అమిత్‌షా

దొడ్డబళ్లాపురం: కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ గెలుపు దక్షిణ భారతదేశంలో పాగా వేయడానికి నాంది కావాలి, దేశానికి బీజేపీ అత్యవసరం.. అని పార్టీ అధినేత అమిత్‌ షా అన్నారు. గురువారం సాయంత్రం దేవనహళ్లి పట్టణంలోని అనంత విద్యానికేతన పాఠశాల ఆవరణలో శక్తి కేంద్రం సభ పేరుతో ఏర్పాటుచేసిన బీజేపీ కార్యకర్తల సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఒకప్పుడు ఒక మునిసిపాలిటీ గెలిస్తే చాలు అనుకున్న బీజేపీ  నేడు 20 రాష్ట్రాలలో అధికారంలో ఉందని తెలిపారు. ఇదంతా బూత్‌స్థాయి క్యాకర్తల శ్రమ ఫలితమేనన్నారు. బెంగళూరు యువత దేశ ప్రగతిలో కీలకపాత్ర పోషిస్తున్నారని ప్రశంసించారు. యూపీఏ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రానికి కేవలం రూ.88 వేల కోట్లు నిధులు ఇచ్చేవారని, అయితే కేంద్ర ఎన్డీయే ప్రభుత్వం రూ.3 లక్షల కోట్లను మంజూరు చేసిందని చెప్పారు. కానీ ఆ నిధులను చాలావరకూ రాష్ట్ర కాంగ్రెస్‌ నాయకులు జేబుల్లో వేసుకున్నారన్నారు.

విజయఢంకా తథ్యం
ఈ ఎన్నికల్లో బీజేపీ విజయఢంకా మోగించడం ఖాయమని, యడ్యూరప్ప ముఖ్యమంత్రి కావడం తథ్యమని అమిత్‌ జోస్యం చెప్పారు. కాంగ్రెస్‌హయాంలో జరిగిన హిందూ యువకుల హత్యకు కారణం ఎంతటివారయినా వదిలే ప్రసక్తే లేదని, పాతాళంలో దాక్కున్నా వెదికి మరీ శిక్షిస్తామని అమిత్‌షా శపథం చేశారు.రాష్ట్రంలో శాంతిభద్రతలు గతంలో ఎన్నడూ లేనంతగా దిగజారాయన్నారు. మంత్రులయిన కేజే జార్జ్, డీకే శివకుమార్‌ మరికొందరు అవినీతి మెడల్స్‌ మెడలో వేసుకుని తిరుగుతున్నారని ఎద్దేవా చేసారు. ప్రధాని నరేంద్రమోదీ పాలనను ప్రపంచమే పొగుడుతుంటే ఇక్కడి పార్టీలు ఆయనకు వస్తున్న కీర్తిని సహించలేకపోతున్నాయని విమర్శించారు. అందుకే ప్రతి సంఘటనకూ మోదీని బాధ్యుడిని చేస్తూ వేలెత్తి చూపిస్తున్నాయన్నారు. సమావేశంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు యడ్యూరప్ప, కేంద్రమంత్రి సదానందగౌడ, రాష్ట్ర నేతలు హాజరయ్యారు.

మరిన్ని వార్తలు