బీజేపీ టార్గెట్‌ 180.. ఆ నలుగురిపైనే భారం!

25 Nov, 2019 10:51 IST|Sakshi

ముంబై : బలపరీక్షలో తన ప్రభుత్వాన్ని నెగ్గించుకునేందుకు బీజేపీ సర్వశక్తులూ ఒడ్డుతోంది. బంపర్‌ మెజారిటీతో దేవేంద్ర ఫడ్నవిస్‌ ప్రభుత్వాన్ని గట్టెక్కించేందుకు పెద్ద ఎత్తున ఆపరేషన్‌ ఆకర్షకు తెరలేపినట్టు తెలుస్తోంది. మీడియా కంటపడకుండా గుట్టుచప్పుడు కాకుండా ఈ వ్యవహారం సాగుతున్నట్టు సమాచారం.

288 మంది ఎమ్మెల్యేలు ఉన్న మహారాష్ట్ర అసెంబ్లీలో మెజారిటీ మార్క్‌ 145. కానీ, బీజేపీ 170 నుంచి 180 మంది ఎమ్మెల్యేల మద్దతుతో బలపరీక్షలో సత్తా చాటాలని భావిస్తోంది. ఇందుకోసం ప్రధానంగా నలుగురు నేతలపై ఆధారపడుతోంది. ఇటీవలికాలంలో బీజేపీలో చేరిన నారాయణ్‌ రాణె, రాధాకృష్ణ విఖె పాటిల్, గణేశ్‌ నాయక్, బాబన్‌రావు లోనికర్‌లకు ‘ఆపరేషన్‌ ఆకర్ష’ బాధ్యతలు అప్పగించినట్టు తెలుస్తోంది. వీరిలో నారాయణ్‌ రాణె, విఖె పాటిల్‌ గతంలో కాంగ్రెస్‌లో కీలకంగా వ్యవహరించారు. ప్రస్తుత కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల్లో చాలామందితో వీరికి ప్రత్యక్ష సంబంధాలున్నాయి. ఇక, గణేశ్‌ నాయక్, బాబన్‌రావు ఎన్సీపీ మాజీ  నేతలు. ప్రస్తుత ఎన్సీపీ ఎమ్మెల్యేలతో వీరికి మంచి సంబంధాలున్నాయి. వీరి ద్వారా పలువురు కాంగ్రెస్‌, ఎన్సీపీ ఎమ్మెల్యేలకు బీజేపీ గాలం వేస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఈ నలుగురు నేతలు పలువురు ఎన్సీపీ, కాంగ్రెస్‌, శివసేన ఎమ్మెల్యేలతో టచ్‌లోకి వచ్చారని అంటున్నారు.

బీజేపీకి 105 మంది ఎమ్మెల్యేలు ఉండగా.. 15 మంది స్వతంత్ర ఎమ్మెల్యేల మద్దతు కూడా ఉన్నట్టు చెప్తోంది. ఈ 15మంది స్వతంత్రుల్లో 11మంది ఇప్పటికే మద్దతు లేఖలు ఇచ్చారు. ఇక, ఇటీవల చేతులు కలిపిన అజిత్‌ పవార్‌ 27 నుంచి 30 మంది ఎమ్మెల్యేలను తనవెంట తీసుకొచ్చే అవకాశముందని బీజేపీ ఆశలు పెట్టుకుంది. ఇదే జరిగితే 143 నుంచి 146 మంది మద్దతు బీజేపీకి దక్కినట్టు అవుతుంది. సీక్రెట్‌ బ్యాలెట్‌ ద్వారా జరిగే స్పీకర్‌ ఎన్నికలో తమ నేతను సభాపతిగా ఎన్నుకుంటే.. సగం బలపరీక్ష నెగ్గినట్టేనని బీజేపీ నేతలు అంచనా వేస్తున్నారు. బీజేపీ ప్రయత్నాలను గట్టిగా అడ్డుకునేందుకు అటు శరద్‌ పవార్‌ కూడా శాయశక్తులా పోరాడుతున్నట్టు కనిపిస్తోంది.

ఇక, బీజేపీ అజిత్‌పైనే గట్టి నమ్మకమే పెట్టుకుంది. ‘అజిత్‌ వెంట 27 నుంచి 29 మంది ఎమ్మెల్యేలు వచ్చే అవకాశముం‍ది. ఎన్నికల్లో పార్టీ రోజువారీ వ్యవహారాలు చూసుకోవడమే కాదు..  పలువురు ఎన్సీపీ ఎమ్మెల్యేల ఖర్చులను పూర్తిస్థాయిలో అజితే భరించారు. ఇటు కాంగ్రెస్‌, సేన ఎమ్మెల్యేలకు కూడా ఆయన సాయం చేశారు. కాబట్టి ఆయన వెంట పెద్దఎత్తున ఎమ్మెల్యేలు కలిసివచ్చే అవకాశముంది’ అని ఒక బీజేపీ నేత అభిప్రాయపడ్డారు. మొత్తం 29 మంది (16 మంది చిన్న పార్టీల ఎమ్మెల్యేలు, 13 మంది స్వతంత్రులు)లో ఎనిమిది మంది ఎమ్మెల్యేలు శివసేనకు మద్దతునిస్తున్నారు. వీరిలో చాలామందికి బీజేపీ గట్టిగానే గాలం వేస్తోంది. వీరిలో ఎక్కువమంది బీజేపీలో చేరే అవకాశముందని భావిస్తున్న కమలదళం.. శివసేన ఎమ్మెల్యేల్లో కూడా కొందరిని  తనవైపునకు ఆకర్షించేందుకు ప్రయత్నిస్తోంది. స్వతంత్ర, చిన్న పార్టీల ఎమ్మెల్యేల్లో ఎస్పీ, ఎంఐఎం మినహా మిగతా 19, 20 మంది మద్దతు తనదేనని బీజేపీ ధీమాగా ఉంది. స్వతంత్ర ఎమ్మెల్యేల డిమాండ్లకు అంగీకరించడమే కాదు.. ఫిరాయింపునకు సిద్ధపడితే మంత్రి పదవులు ఇచ్చేందుకు సిద్ధమంటూ బీజేపీ ఆఫర్లు ఇస్తున్నట్టు తెలుస్తోంది. తమ ఆపరేషన్‌ ఆకర్ష ఫలిస్తే బలపరీక్షలో నెగ్గడం చాలా సులభమని కాషాయ పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా