’మరో వందేళ్లు అధికారంలో ఉన్నా బీజేపీ ఆ పని చేయలేదు’

18 May, 2019 12:11 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : బీజేపీ మరో 100 ఏళ్లు అధికారంలో ఉన్నా జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పిస్తున్న ఆర్టికల్‌ 370ని రద్దు చేయలేరని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత గులాం నబీ ఆజాద్‌ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం ఆయన హిమాచల్‌ ప్రదేశ్‌లో మాట్లాడారు.

‘బీజేపీ ప్రభుత్వం ఆర్టికల్‌ 370 ని రద్దు చేయలేదు. ఇప్పుడే కాదు మరో 100 ఏళ్లు బీజేపీ అధికారంలో ఉన్నా జమ్ము కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పిస్తున్న ఆర్టికల్‌ 370ని తొలగించలేదు. అటల్‌ బీహార్‌ వాజ్‌పేయి అధికారంలో ఉన్నప్పుడే ఆర్టికల్‌ 370ని తొలగించలేకపోయారు. ఇప్పుడు ఎలా తొలగిస్తారు. బీజేపీ వీలుకాని హామీలను ఇస్తూ ప్రజలను మోసగిస్తుంది’ అని అజాద్‌ విమర్శించారు. బీజేపీ ప్రభుత్వంలోనే ఉగ్రవాది అజార్‌ మసూద్‌ను విడిచిపెట్టారని గుర్తు చేశారు. ఎన్నికల వేళలో తమకు ఇలాంటి విషయాలు ముఖ్యం కాదని, ప్రజలకు ఏం చేస్తామో చెప్పడమే తమ ప్రధాన అంశం అన్నారు. నిరుద్యోగం, పేదరిక నిర్మూళననే తమ పార్టీ ధ్యేయం అన్నారు. 

ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ 273పైగా సీట్లను గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌కు అత్యధిక సీట్లు వచ్చినా సరే, ప్రాంతీయ పార్టీలను నుంచి  ఎవరినైనా ప్రధాని చేయాలంటే అందుకు మద్దతిచ్చేందుకు  సిద్ధంగా ఉన్నామని అజాద్‌ పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు