బీజేపీ ఎన్నికల శంఖారావం

20 Jan, 2019 07:46 IST|Sakshi

27న మదురైలో ప్రధాని మోదీ తొలి బహిరంగసభ

ఫిబ్రవరి 10, 19 తేదీల్లో చెన్నై, కోయంబత్తూరుల్లో ప్రచారం

కూటమి చర్చలకోసం బీజేపీ రాష్ట్ర ఇన్‌చార్జ్‌ 

 పీయూష్‌గోయల్‌ త్వరలో రాష్ట్రానికి రాక

పార్లమెంటు ఎన్నికల సందర్భంగా భారతీయ జనతా పార్టీ మదురైలో తన తొలి ఎన్నికల శంఖారావానికి సిద్ధమైంది. వచ్చే నెలలో చెన్నై, కోయంబత్తూరు జిల్లాలు ప్రచార వేదికలు కానున్నాయి. ఈ మూడు సభల్లో పాల్గొనేందుకు ఈనెల 27, ఫిబ్రవరి 10, 19 తేదీల్లో ప్రధాని నరేంద్రమోదీ రానున్నారు.

సాక్షి ప్రతినిధి, చెన్నై: పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో భారతీయ జనతా పార్టీ  ప్రచార సన్నాహాలు ప్రారంభించింది. పార్టీ అగ్రనేతలు దేశవ్యాప్త పర్యటనకు సమాయత్తం అవుతున్నారు. ప్రధాని నరేంద్రమోదీ దేశవ్యాప్తంగా ఎన్నికల ప్రచారాలు నిర్వహించేలా కార్యక్రమాలు రూపొందిస్తున్నారు. పార్లమెంటు ఎన్నికలకు పార్టీ శ్రేణులను సమాయత్తం చేసేందుకు రాష్ట్రాల వారీగా మోదీ వీడియో కాన్ఫరెన్స్‌లు నిర్వహిస్తున్నారు. తమిళనాడులో మొత్తం 39 పార్లమెంటు స్థానాలు ఉండగా (పుదుచ్చేరి 1) 25 పార్లమెంటు నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌లతో మోదీ సంభాషించడం పూర్తయింది.

మిగిలిన 14 నియోజకవర్గాల వారితో ఈనెలాఖరులోగా మోదీ మాట్లాడనున్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లు పూర్తికాగానే దేశవ్యాప్త పర్యటనకు మోదీ బయలుదేరనున్నారు. తమిళనాడులో కనీసం ఐదుసార్లకు పైగా పర్యటించాలని మోదీ నిర్ణయించుకున్నట్లు సమాచారం. తొలిదశగా ఈనెల 27వ తేదీన మదురైకి రానున్నారు. ఆరోజు మధురైలో ఎయిమ్స్‌కు శంకుస్థాపనతో పాటు పలు పథకాలను ప్రారంభించనున్నారు. అదేరోజు సాయంత్రం మదురై విమానాశ్రయం ఎదురుగా రింగ్‌రోడ్డు సమీపంలోని మైదానంలో బహిరంగసభ నిర్వహించి ఎన్నికల శంఖారావం పూరిచేస్తారు.  ఈ బహిరంగ సభకు పది పార్లమెంటు నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌లతోపాటు సుమారు రెండులక్షల మందిని సమీకరించాలని రాష్ట్రనేతలు లక్ష్యంగా పెట్టుకున్నారు. 

ఇక రెండోదశ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఫిబ్రవరి 10, 19 తేదీల్లో మోదీ పర్యటించనున్నారు. 10వ తేదీన చెన్నైలో నిర్వహించే బ్రహ్మాండమైన బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తారు. అలాగే 19వ తేదీన మూడో దశలో కోయంబత్తూరు జిల్లాలోని ఏదేని ఊరిలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. 10, 19 తేదీల్లో నిర్వహించే బహిరంగ సభలో రాష్ట్రంలోని మొత్తం 39 మంది పార్లమెంటు నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌లను హాజరుపర్చనున్నారు.

ప్రధాని మోదీ పర్యటన బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు తమిళిసై సౌందరరాజన్‌ శనివారం మీడియాతో మాట్లాడుతూ, వచ్చేనెల 10, 19 తేదీల్లో ప్రధాని మోదీ పర్యటన ఖరారైందని తెలిపారు. ఈనెల 27వ తేదీన మదురైలో జరిగే బహిరంగసభలో ఆయన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారని అన్నారు. మదురై సభలో దక్షిణ తమిళనాడుకు చెందిన పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొంటారని చెప్పారు.

వచ్చేనెలలో నిర్వహించబోయే సభలో ప్రధానంగా ఉత్తర తమిళనాడు పార్టీ నేతలతోపాటు అన్ని నియోజకవర్గాల వారు పాల్గొనే అవకాశం ఉందని అన్నారు. బీజేపీ నేతృత్వంలో రాష్ట్రంలో బలమైన కూటమి ఏర్పడుతుందని ఆమె ధీమా వ్యక్తంచేశారు. పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జ్‌ పీయూష్‌ గోయల్‌ బడ్జెట్‌ రూపకల్పనలో బిజీగా ఉన్నందున తమిళనాడు పర్యటన వాయిదా పడుతోందని తెలిపారు. త్వరలో ఆయన తమిళనాడుకు వచ్చి కూటమి చర్చలు జరుపుతారని ఆమె వివరించారు.   

మరిన్ని వార్తలు