బీజేపీలోకి మాజీ ఎంపీ వివేక్; కేసీఆర్‌పై విమర్శలు

9 Aug, 2019 14:28 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: మాజీ ఎంపీ గడ్డం వివేక్‌ బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా సమక్షంలో శుక్రవారం కాషాయ పార్టీలో చేరారు. నరేంద్ర మోదీ పరిపాలన నచ్చడంతోనే బీజేపీలో చేరానని ఆయన చెప్పారు. రాష్ట్రంలో బీజేపీ బలోపేతానికి కృషి చేస్తానని వెల్లడించారు. తెలంగాణలో పార్టీని అధికారంలోకి తేవడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. కేసీఆర్‌ను గద్దె దింపి, ప్రజాస్వామిక తెలంగాణ సాధిస్తామని ఉద్ఘాటించారు. ఉద్యమకారులంటే కేసీఆర్‌కు భయమని, అందుకే పార్టీ నుంచి బయటకు పంపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు ఎంపీ టికెట్ ఇస్తానని చెప్పి కేసీఆర్‌ మాట తప్పారని విమర్శించారు. మాట తప్పడం ఆయనకు అలవాటయిందని చురకలంటించారు. 

ఉత్తర ప్రగల్భాలు..
వివేక్ రాకతో బీజేపీ మరింత బలోపేతం అవుతుందని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ అన్నారు. ఆయనకు పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని చెప్పారు. ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఉత్తర కుమార ప్రగల్భాలు పలుకుతున్నారని ఎద్దేవా చేశారు. త్వరలో కాంగ్రెస్‌ పార్టీ ఖాళీ అవుతుందని జోస్యం చెప్పారు. చాలామంది నాయకులు తమతో టచ్‌లో ఉన్నారని వెల్లడించారు.

మరింతమంది నాయకులు..
వివేక్ బీజేపీలో చేరడం పార్టీకి మరింత ఊతమిస్తుందని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఆయన బలమైన రాజకీయ కుటుంబం నుంచి వచ్చారని గుర్తు చేశారు. భవిష్యత్తులో మరింత మంది నాయకులు బీజేపీలో చేరబోతున్నారని వెల్లడించారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ జెండా ఎగరేస్తామని ఎంపీ అరవింద్‌ అన్నారు. తెలంగాణలో 15 సీట్లు గెలువడం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు. వివేక్‌ చేరిక బీజేపీకి మరింత బలాన్ని ఇస్తుందన్నారు.

మరిన్ని వార్తలు