2019 మనదే

29 Oct, 2018 01:13 IST|Sakshi

విపక్షాలన్నీ ఏకమైనా బీజేపీ విజయాన్ని అడ్డుకోలేవు

బీజేవైఎం జాతీయ సమ్మేళనం ముగింపు ప్రసంగంలో అమిత్‌ షా

రాహుల్‌ ప్రధాని కలలు కనడం మానుకోవాలని ఎద్దేవా!

సర్జికల్‌ దాడులతో అమెరికా, ఇజ్రాయెల్‌ సరసన భారత్‌

మళ్లీ అధికారంలోకి రాగానే దేశవ్యాప్తంగా ఎన్నార్సీ

ఘనంగా తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు

పథకాల లబ్ధిదారులను కలవాలని బీజేవైఎం శ్రేణులకు పిలుపు

సాక్షి, హైదరాబాద్‌: దేశవ్యాప్తంగా భూతద్దంలో చూస్తేకానీ కాంగ్రెస్‌ పార్టీ కనిపించని పరిస్థితి నెలకొందని.. 2019 ఎన్నికల తర్వాత భూతద్దం లోనూ వెతుక్కునే అవకాశం కూడా ఉండదని బీజేపీ చీఫ్‌ అమిత్‌ షా పేర్కొన్నారు. విపక్షాలన్నీ ఏకమైనా.. ప్రధాని కావాలని రాహుల్‌ కలలుగంటున్నా.. బీజేపీ జోరును అడ్డుకునే శక్తి ఎవరికీ లేదన్నారు. సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌లో బీజేవైఎం జాతీయ యువసమ్మేళనం ముగింపు సందర్భంగా షా ప్రసంగించారు. వీరుల పోరుగడ్డ తెలంగాణలో జరిగిన ఈ సమ్మేళనానికి వచ్చిన యువ కార్యకర్తలను చూశాక.. 2019లో మళ్లీ నరేంద్ర మోదీయే ప్రధాని అవుతారనే అంశంలో సందేహం లేదన్నారు. ‘ప్రధాని మోదీ హయాంలో 2014 నుంచి జరిగిన అన్ని ఎన్నికల ఫలితాలను ఓసారి గుర్తుచేసుకోండి. మహారాష్ట్రలో ప్రారంభమైన కాంగ్రెస్‌ ఓటమి, బీజేపీ జైత్రయాత్ర పరంపర.. హరియాణా, జార్ఖండ్, జమ్మూకశ్మీర్, అస్సాం, మణిపూర్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, గుజరాత్, హిమాచల్‌ ప్రదేశ్, గోవా, మేఘాలయ, నాగాలాండ్, త్రిపుర వరకు అప్రతిహతంగా కొనసాగింది. రాహుల్‌ గాంధీ.. మీ పార్టీ అన్ని రాష్ట్రాల్లోనూ ఓడిపోయింది. నాలుగున్నరేళ్లలో 70% భూభాగంపై బీజేపీ జెండా ఎగురవేశాం. 2019లోనూ విజయఢంకా మోగిస్తాం’అని అమిత్‌ షా ధీమా వ్యక్తం చేశారు.
 
సారథిలేని మహా కూటమి
మహా కూటమికి సారథి లేడు, సిద్ధాంతాలు లేవని అమిత్‌ షా ఎద్దేవా చేశారు. ‘మెజారిటీ సాధిస్తే ప్రధాని నేనేనంటూ కర్ణాటక ప్రచారంలో రాహుల్‌ చెప్పుకున్నారు. ఆయన ప్రసంగం ముగించుకుని అలా కార్లో కూర్చున్నారలో లేదో.. శరద్‌ పవార్‌ తిరస్కరించారు. కారుడోరు వేసుకునేలోపే మమత మండిపడ్డారు. మరో సమావేశానికి వెళ్లేలోగా అఖిలేశ్‌ వ్యతిరేకించారు. మీ కూటమే మిమ్మల్ని నాయకుడుగా గుర్తించడం లేదు’అని రాహుల్‌పై వ్యంగాస్త్రాలు సంధించారు. పేదరికం, నిరుద్యోగం, పేదల జీవితాల్లో చీకటి, పేద తల్లుల ఇళ్ల నుంచి పొగ, అభద్రతను తొలగించాలని మోదీ అంటుంటే.. మోదీని తొలగించాలని మహాకూటమి నినాదాలిస్తోందన్నారు. మోదీ పాలనలో ప్రతి కుటుంబానికి ఏదో ఒకరకంగా మేలు జరిగిందన్నారు. పూనం మహాజన్‌ నేతృత్వంలో యువ మోర్చా కార్యకర్తలు దేశంలోని 22 కోట్లకు పైగా కుటుంబాలను చేరుకోవాలని.. మళ్లీ బీజేపీని భారీ మెజారిటీతో గెలిపించేందుకు అహర్నిషలు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ‘మోదీ నేతృత్వంలో దేశంలో సానుకూల మార్పు స్పష్టంగా కనబడుతోంది. 2019 ఎన్నికలు మనకు సవాల్‌. యువ మోర్చా కార్యకర్తలు ఈ యుద్ధంలో నిర్ణయాత్మకం కానున్నారు. ఈ రోజు నుంచి ఎన్నికల వరకు ప్రతిక్షణం బీజేపీని గెలిపించేందుకు కష్టపడాలి’అని బీజేవైఎం శ్రేణులకు అమిత్‌ షా పిలుపునిచ్చారు.
 
నాలుగు తరాల పాలనలో ఏం చేశారు?
‘మోదీ నాలుగున్నరేళ్లలో ఏం చేశారని రాహుల్‌ ప్రశ్నిస్తున్నారు. మీకు లెక్కలు ఇవ్వాల్సిన అవసరం మాకు లేదు. మీకు వివరాలు అడిగే హక్కు అసలే లేదు. నాలుగు తరాలు పాలించిన మీరు దేశానికేం చేశారు? మేం నాలుగున్నరేళ్ల నుంచే అధికారంలో ఉన్నాం. మేం వచ్చేనాటికి దేశంలో 50 కోట్ల మంది ప్రజలకు కనీస సదుపాయాల్లేవు. ఈ 50 కోట్ల ప్రజల జీవితాల్లో వెలుగులు నింపే దిశగా పనిచేశాం. 5.5 కోట్లకు పైగా పేద మహిళలకు గ్యాస్‌ కనెక్షన్లు, 7.5కోట్లకు పైగా మరుగుదొడ్లు, రెండు కోట్లకు పైగా ఇళ్ల నిర్మాణం, రెండు కోట్లకు పైగా ఇళ్లకు కరెంట్, 13 కోట్ల మంది గర్భిణులు, శిశువులకు టీకాలు, 14కోట్ల యువతకు ముద్ర బ్యాంకు రుణాలు, 50కోట్ల మంది పేదలకు రూ.5లక్షల వరకు వైద్య ఖర్చులను భరించే ఆయుష్మాన్‌ భారత్‌ పథకం.. ఇలా పేదలు, రైతులు, మహిళలు, దళితులు, యువత సంక్షేమానికి బీజేపీ పనిచేసింది. వీటితోపాటు దేశాన్ని సురక్షితంగా మార్చింది’అని అమిత్‌ షా పేర్కొన్నారు.
 
అమెరికా, ఇజ్రాయిల్‌ల సరసన
‘సోనియా, మన్మోహన్‌ల నేతృత్వంలో 10ఏళ్ల యూపీఏ పాలనలో పాకిస్తాన్‌ నుంచి ఆలియా, మలియా, జమాలియాలు (ఇస్లామిక్‌ ఉగ్రవాదులను ఉటంకిస్తూ) దేశంలో చొరబడి బాంబులు పేల్చి యథేచ్ఛగా వెళ్లిపోయేవారు. మనం మాత్రం యూరీ సెక్టార్‌లో దాడి జరిగిన 10రోజుల్లోనే సర్జికల్‌ దాడులతో ప్రతీకారం తీర్చుకున్నాం. మౌనీ బాబా (మన్మోహన్‌) సర్కారుకు.. మనకూ ఉన్న తేడా అదే. మన సైనికుల వీరత్వాన్ని సైతం రాహుల్‌ విమర్శించారు. సైనికుల రక్తంతో దళారీ రాజకీయాలు చేస్తారా?’అని రాహుల్‌పై తీవ్ర విమర్శలు చేశారు. సైనికుల రక్తం చిందితే.. వెంటనే ప్రతీకారం తీర్చుకునే దేశాలు అమెరికా, ఇజ్రాయిల్‌లు మాత్రమేనన్నారు. సర్జికల్‌ దాడులతో ఆ రెండు దేశాల సరసన భారత దేశం నిలిచిందని అమిత్‌షా వెల్లడించారు.
 
అక్రమ వలసదారులను వదలబోం
2019లో మోదీ సర్కార్‌ను మళ్లీ అధికారంలోకి తీసుకొస్తే, కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు అస్సాం నుంచి గుజరాత్‌ వరకు ఒక్కో అక్రమ వలసదారున్ని పట్టుకుని దేశం నుంచి వెళ్లగొడ్తామని అమిత్‌షా స్పష్టం చేశారు. అస్సాంలో ఎన్నార్సీ ప్రక్రియ పూర్తి చేసి 40లక్షల మంది అక్రమ వలసదారులను గుర్తించామని, వారిని దేశం నుంచి గెంటేయాల్సి ఉందన్నారు. మోదీ నాయకత్వంలో ప్రపంచవ్యాప్తంగా దేశ గౌరవం, అంతర్గతంగా భద్రత పెరిగిందన్నారు. ఎకనమిస్ట్‌గా పేరున్న మన్మోహన్‌ సింగ్‌ తన పదేళ్ల పాలనలో దేశ ఆర్థిక వ్యవస్థను 9వ స్థానంలో వదిలివెళ్లారని.. మోదీ సర్కారు దీన్ని 6వ స్థానానికి తీసుకొచ్చిందన్నారు. ఎన్నికల్లోగా 5వ స్థానాన్ని తీసుకొస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మహారాష్ట్ర ప్రభుత్వం అర్బన్‌ మావోయిస్టులను అరెస్టు చేస్తే, వారి భావప్రకటన స్వేచ్ఛకు భంగం కలిగిందంటూ కాంగ్రెస్‌ పేర్నొనడాన్ని షా తప్పుబట్టారు. భారత్‌ తేరే తుక్డే తుక్డే హోంగే అని నినాదాలు చేసే వారేవరైనా జైలులో ఉండాల్సిందేనన్నారు.
 
అధికారికంగా విమోచన దినోత్సవం
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్లడంతోపాటు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామని అమిత్‌ షా స్పష్టం చేశారు. తద్వారా తెలంగాణ అమరవీరులకు ఘననివాళులు అర్పిస్తామన్నారు. ‘హైదరాబాద్‌తో పాటు కర్ణాటక, మహారాష్ట్రల్లోని కొన్ని ప్రాంతాలను నిజాం అత్యాచారాల నుంచి విముక్తి కల్పించేందుకు వేల మంది ప్రజలు, సైనికులు ప్రాణత్యాగాలు చేశారు. వారి బలిదానాలకు సంస్మరణగా హైదరాబాద్‌ విమోచన దినం జరుపుకునేవారు. ఒవైసీ, మజ్లిస్‌ పార్టీ భయంతో కేసీఆర్‌ వెనక్కుతగ్గారు. ఇక్కడి ప్రభుత్వానికి కొన్ని రోజులే మిగిలున్నాయి. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం రానుంది. మళ్లీ మోదీయే ప్రధాని అవుతారు. అప్పుడు హైదరాబాద్‌ విమోచన దినాన్ని ఘనంగా నిర్వహించి.. తెలంగాణ అమరులకు ఘనంగా నివాళులర్పిద్దాం’అని అమిత్‌షా పేర్కొన్నారు. ‘సర్దార్‌ వల్లాభాయ్‌ పటేల్‌ జయంతి సందర్భంగా అక్టోబర్‌ 31న ఆయనకు నివాళిగా.. గుజరాత్‌లో నిర్మించిన ప్రపంచంలోనే అతిపెద్ద విగ్రహమైన పటేల్‌ విగ్రహాన్ని ప్రధాని మోదీ ఆవిష్కరించనున్నారు. పటేల్‌ ఇచ్చిన ధైర్యంతోనే నిజాంను, రజాకార్లను తెలంగాణ వీరపుత్రులు ఎదుర్కొన్నారు. పటేల్‌ విమానాశ్రయంలో దిగగానే నిజాం తోకముడిచి పారిపోయారు. అలాంటి వీరగడ్డపై మనమంతా కలుసుకోవడం అదృష్టం’అని ఆయన వెల్లడించారు.   

నేడు బీజేపీ రెండో జాబితా
 ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థుల రెండో జాబి తాను బీజేపీ సోమవారం విడుదల చేయనుంది. 38 మందితో మొదటి జాబితా ప్రకటించిన బీజేపీ, రెండో జాబితాను జాతీయ పార్లమెంటరీ బోర్డుకు పంపించనుంది. సోమవారం జరిగే బోర్డు సమావేశంలో ఆమో దం తర్వాత జాబితాను ప్రకటించనున్నారు. 

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా