బీజేపీకి గతంకన్నా ఇప్పుడే ఎక్కువ సీట్లు!

23 May, 2019 12:58 IST|Sakshi

సాక్షి, న్యూఢిలీ : 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఎగ్జిట్‌ పోల్‌ ఫలితాలను నిజం చేస్తూ పాలకపక్ష బీజేపీ దూసుకుపోతోంది. ఫలితాల సరళి చూస్తుంటే 2014 ఎన్నికల్లో వచ్చిన 282 సీట్లను దాటే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రంలో బీజేపీ, తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీలు నువ్వా, నేనా అన్నట్లు హోరా హోరీగా ముందుకు సాగుతుండడం విశేషం. బెంగాల్‌లోని మొత్తం 42 సీట్లకుగాను 18 సీట్లలో బీజేపీ తన ఆధిక్యతను కొనసాగిస్తోంది. మరోపక్క కర్ణాటకలో కూడా ముందుగా ఊహించినట్లుగానే 28 సీట్లకుగాను 23 సీట్లలో బీజేపీ తన ఆధిక్యతను కొనసాగిస్తోంది.  

గత ఎన్నికల ఫలితాలతో పోలిస్తే సగానికి సగం సీట్లు పడిపోతాయనుకున్న ఉత్తరప్రదేశ్‌లో కూడా బీజేపీ హవా కొనసాగుతుండడం ఉత్తర, కేంద్ర రాష్ట్రాల్లో ఆ పార్టీ సష్టిస్తోన్న ప్రభంజనానికి నిదర్శనం. యూపీలో 54 సీట్లలో బీజేపీ ఆధిక్యతను ప్రదర్శిస్తోండగా, బీఎస్పీ–ఎస్పీ కూటమి ఆధిక్యత 23 సీట్లకే పరిమితమైంది. ఎగ్టిజ్‌ పోల్‌ అంచనాలను నిజం చేస్తూ బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌ రాష్ట్రాల్లో బీజేపీ అప్రతిహతంగా దూసుకుపోతోండగా, నవీన్‌ పట్నాయక్‌కు కంచుకోటైన ఒడిశాలో కూడా బీజేపీ పది సీట్లకు దక్కించుకునే దిశగా దూసుకుపోతుండడం ఆశ్చర్యం.

మరిన్ని వార్తలు