ఆదిలాబాద్‌లో బీజేపీ బోణి

24 May, 2019 13:18 IST|Sakshi

ఆదిలాబాద్‌లో బీజేపీ బోణి

గోడం నగేశ్‌పై సోయం బాపురావు గెలుపు

సిట్టింగ్‌ పార్లమెంట్‌ స్థానాన్ని కోల్పోయిన టీఆర్‌ఎస్‌

మూడో స్థానంలో నిలిచిన కాంగ్రెస్‌ ∙బీజేపీ శ్రేణుల సంబరాలు

సాక్షి, ఆదిలాబాద్‌: ఐదు నెలలకే ఎంత మార్పు.. డిసెంబర్‌లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించిన టీఆర్‌ఎస్‌ లోక్‌సభ ఎన్నికలకొచ్చేసరికి ఢీలా పడిపోయింది. సిట్టింగ్‌ పార్లమెంట్‌ స్థానాన్ని కోల్పోయింది. గులాబీ కోటాలో కమలం వికసించింది. ఆదిలాబాద్‌ పార్లమెంట్‌ స్థానంలో బీజేపీ బోణి కొట్టింది. టీఆర్‌ఎస్‌ రెండో స్థానంలో, కాంగ్రెస్‌ మూడో స్థానంలో నిలిచాయి.

సోయం బాపురావు గెలుపు..
పార్లమెంట్‌ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి సోయం బాపురావును విజయం వరించింది. గత డిసెంబర్‌లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో బోథ్‌ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ అభ్యర్థిగా బరిలో నిలిచి 6వేల ఓట్ల తేడాతో ఓటమి పాలైన బాపురావు తిరిగి లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ మార్చి బరిలో నిలిచి విజయకేతనం ఎగరవేశారు. 2004లో టీఆర్‌ఎస్‌ నుంచి బోథ్‌ ఎమ్మెల్యేగా సోయం బాపురావు గెలిచారు. ఆ తర్వాత ఆయనకు రాజకీయంగా ఏ పదవి కలిసిరాలేదు. తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతూ ఆదివాసీల హక్కుల కోసం ఉద్యమం ద్వారా  గత కొంతకాలంగా ప్రముఖంగా నిలిచారు. లోక్‌సభ ఎన్నికలకు ముందు నామినేషన్ల ఘట్టం సమయంలో ఆయన కాంగ్రెస్‌ నుంచి బీజేపీలో చేరా రు. ఆ పార్టీ లోక్‌సభ అభ్యర్థిగా ఆదిలాబాద్‌ పార్లమెంట్‌ నుంచి బరిలో నిలిచి గెలుపొందారు.

మొదటి రౌండ్‌ నుంచే హవా..
బీజేపీ అభ్యర్థి సోయం బాపురావు మొదటి రౌండ్‌ నుంచే హవా కొనసాగింది. ప్రతీ రౌండ్‌కు స్పష్టమైన ఆధిక్యాన్ని కనబర్చారు. మధ్యలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గోడం నగేశ్‌కు రౌండ్‌ పరంగా ఆధిక్యం వచ్చినా సోయం బాపురావుకు అంతకుముందు రౌండ్‌లలో వచ్చిన ఆధిక్యత ముందు అది బలాదూర్‌ అయిపోయింది. ఓ దశలో సోయం బాపురావుకు మెజార్టీ 70వేల నుంచి 80వేల వరకు చేరుకుంటుందని ఆ పార్టీ శ్రేణులు భావించారు. అయితే చివరి రౌండ్‌లలో కొంత ఆధిక్యత తగ్గింది. బీజేపీ మొదటి రౌండ్‌ నుంచే ఆధిక్యత కనబర్చడంతో టీఆర్‌ఎస్‌ నేతలు ముఖం చాటేశారు. కనీసం కౌంటింగ్‌ కేంద్రాలకు కూడా వారు రాకపోవడం గమనార్హం.

సిట్టింగ్‌ స్థానం కోల్పోయిన టీఆర్‌ఎస్‌..
టీఆర్‌ఎస్‌ సిట్టింగ్‌ స్థానాన్ని కోల్పోయింది. 2014 సాధారణ ఎన్నికల్లో ఆదిలాబాద్‌ పార్లమెంట్‌ స్థానం నుంచి టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పోటీ చేసిన గోడం నగేశ్‌ భారీ మెజార్టీతో గెలుపొందారు. ఈ ఎన్నికల్లోనూ టిక్కెట్‌ పొందిన ఆయన గెలుపుపై నమ్మకం పెట్టుకున్నారు. ప్రధానంగా ఆదిలాబాద్‌ పార్లమెంట్‌ పరిధిలోని ఆదిలాబాద్, బోథ్, నిర్మల్, ముథోల్, ఖానాపూర్, సిర్పూర్‌ నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలే ఉండటం, ఆసిఫాబాద్‌లో కాంగ్రెస్‌ నుంచి గెలిచిన టీఆర్‌ఎస్‌లో కొనసాగుతున్న ఆత్రం సక్కు కూడా ఉండడంతో గెలుపుపై ధీమాతో మెలిగారు. అన్ని నియోజకవర్గాల్లో బలమైన కేడర్‌తో పాటు టీఆర్‌ఎస్‌ పార్టీ సంక్షేమ పథకాలు తనను గట్టెక్కిస్తాయని భావించారు. అయితే అనూహ్యంగా ఆయన ఓటమి చెందడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. గత లోక్‌సభ ఎన్నికల కంటే ఈ ఎన్నికల్లో 1లక్ష 12వేల ఓట్లు కోల్పోయారు.

గుడ్డిలో మెల్ల.. కాంగ్రెస్‌
కాంగ్రెస్‌ అభ్యర్థి రాథోడ్‌ రమేశ్‌ మూడో స్థానంలో నిలిచినా గత ఎన్నికలకంటే ఆ పార్టీ అధిక ఓట్లు సాధించడం గుడ్డిలో మెల్లలాగ నిలిచింది. శాసనసభ ఎన్నికల్లో ఖానాపూర్‌ నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసిన రాథోడ్‌ రమేష్‌ ఆ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి రేఖానాయక్‌ చేతిలో ఓటమి చెందారు. ఈ పరిస్థితిలో లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించాలని ఆయన ఉవ్విళ్లూరారు. అయితే పరిస్థితులు మాత్రం అనుకూలించలేదు. ఒకప్పుడు ఉమ్మడి జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పిన రాథోడ్‌ రమేశ్‌ గత కొద్ది కాలంగా రాజకీయంగా పదవి లేకపోవడంతో ప్రభావం కోల్పోయారు. ఈ పరిస్థితుల్లో లోక్‌సభ ఎన్నికల్లో సత్తా చాటడం ద్వారా తిరిగి రాజకీయంగా బలపడుదామని ఆయన అనేక ఆశలు పెట్టుకున్నారు. అయితే అవి వమ్ము అయ్యాయి.

బీజేపీ శ్రేణుల సంబరాలు..
ఆదిలాబాద్‌ పార్లమెంట్‌ స్థానంలో భారతీయ జనతా పార్టీ బోణి కొట్టడంతో ఆ పార్టీ శ్రేణుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. పార్లమెంట్‌ స్థానం ఏర్పడినప్పటి నుంచి సోషలిస్ట్‌ పార్టీ, ఆ తర్వాత కాంగ్రెస్, టీడీపీ, టీఆర్‌ఎస్‌లు ప్రాతినిధ్యం వహించినా బీజేపీ ఇప్పటివరకు ఇక్కడ గెలవలేదు. అయితే ఆదిలాబాద్, నిర్మల్, ముథోల్‌ నియోజకవర్గాల్లో పార్టీ క్యాడర్‌ బలంగా ఉంది. అనేక మంది సీనియర్‌ నేతలు పార్టీలో కొనసాగుతున్నారు. ఈ గెలుపు ఆ పార్టీకి ఉత్సాహాన్ని ఇచ్చింది. ఆదిలాబాద్‌ లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ పలుమార్లు పోటీ చేసినా గెలుపొందలేదు. తాజాగా సోయం బాపురావు గెలుపుతో బీజేపీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. పార్లమెంట్‌ పరిధిలోని ఆదిలాబాద్, నిర్మల్, కుమురంభీం జిల్లాల్లో సంబరాలు జరుపుకున్నారు.

పోలింగ్‌ వివరాలు..
మొత్తం ఓట్లు    14,88,353
పోలైన ఓట్లు    10,69,333
పోలింగ్‌ శాతం    71.45

అభ్యర్థులకు వచ్చిన ఓట్లు
అభ్యర్థి పేరు    వచ్చిన ఓట్లు
సోయం బాపురావు    3,77,374
గోడం నగేశ్‌    3,18,814
రాథోడ్‌ రమేశ్‌    3,14,238
కుమ్రం వందన    8,007
దరావత్‌ నరేందర్‌నాయక్‌  5,241
పవర్‌ కృష్ణ    2,705
భీంరావు    6,837
ఆరె ఎల్లన్న    3,019
కుమ్ర రాజు    4,388
గంట పెంటన్న    4,548
నేతావత్‌ రాందాస్‌    5,521
నోటా    13,036

పార్టీల వారీగా వచ్చిన ఓట్లు
సోయం బాపురావు    బీజేపీ 3,77,374

గోడం నగేశ్‌టీఆర్‌ఎస్‌  3,18,814

మెజార్టీ58,560(టీఆర్‌ఎస్‌పై బీజేపీ గెలుపు)

 రాథోడ్‌ రమేశ్‌  కాంగ్రెస్‌    3,14,238 

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు