మహా సంకటం : గవర్నర్‌ పిలుపుపై తర్జనభర్జన

10 Nov, 2019 10:30 IST|Sakshi

ముంబై : మహారాష్ట్రలో తదుపరి ప్రభుత్వ ఏర్పాటుకు తాత్కాలిక సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ను గవర్నర్‌ భగత్‌ సింగ్‌ కోష్యారి ఆహ్వానించడంతో దీనిపై ఓ నిర్ణయం తీసుకునేందుకు బీజేపీ కోర్‌కమిటీ ఆదివారం భేటీ కానుంది. ఈ సమావేశానికి సీఎం ఫడ్నవీస్‌తో పాటు పార్టీ రాష్ట్ర చీఫ్‌ చంద్రకాంత్‌ పాటి్ల్‌‌, సుధీర్‌ ముంగటివార్‌ సహా పలువురు అగ్రనేతలు హాజరుకానున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మేజిక్‌ ఫిగర్‌కు బీజేపీ చాలా దూరంలో నిలిచిపోవడంతో పాటు భాగస్వామ్య పక్షం శివసేన కలిసిరాకపోవడంతో సభలో బలనిరూపణలో సమస్యలు తప్పవని కాషాయ పార్టీ తర్జనభర్జనలు సాగిస్తోంది. మరోవైపు రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిణామాలపై చర్చించేందుకు శివసేన చీఫ్‌ ఉద్ధవ్‌ ఠాక్రే పార్టీ నేతలతో సమావేశమవనున్నారు.

ఇక సోమవారంలోగా అసెంబ్లీలో బలనిరూపణ చేసుకోవాలని గవర్నర్‌ ఫడ‍్నవీస్‌ను కోరిన క్రమంలో బీజేపీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. సభలో మెజారిటీ నిరూపించుకోవడంలో ఫడ్నవీస్‌ విఫలమైతే 56 మంది ఎమ్మెల్యేలతో రెండో అతిపెద్ద పార్టీగా నిలిచిన శివసేనను ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్‌ ఆహ్వానించే అవకాశం ఉంది. ఇదే జరిగితే శివసేన-ఎన్సీపీ కూటమి ప్రభుత్వం గద్దెనెక్కే అవకాశం ఉందని భావిస్తున్నారు. శివసేన-ఎన్సీపీ సర్కార్‌కు వెలుపల నుంచి మద్దతిచ్చేందుకు కాంగ్రెస్‌ సానుకూలంగా ఉందని చెబుతున్నారు. అసెంబ్లీ వేదికగా బీజేపీ సర్కార్‌కు శివసేన వ్యతిరేకంగా ఓటువేస్తే ప్రత్యామ్నాయ సర్కార్‌ ఏర్పాటుకు సహకరిస్తామని ఎన్సీపీ విస్పష్ట సంకేతాలు పంపింది. తమతో కలిసివచ్చే పార్టీల సహకారం తీసుకునే విషయమై ఎన్సీపీ చీఫ్‌ ఉద్ధవ్‌ ఠాక్రే మరోసారి పార్టీ తరపున ఎన్నికైన ఎమ్మెల్యేలు, సీనియర్‌ నేతల అభిప్రాయం కోరతారని సమాచారం.

మరిన్ని వార్తలు