బీజేపీ ‘దళిత గోవిందం’ రసాభాసా...!

6 May, 2018 07:40 IST|Sakshi
బీజేపీ ‘దళిత గోవిందం’ (ఫైల్‌)

నేతల తీరుతో కమలదళానికి తప్పని పాట్లు...

లక్నో: దేశంలోని దళితవర్గాలకు చేరువయ్యేందుకు రాజకీయపక్షాలు చేస్తున్న ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కాదు. వచ్చే ఏడాది జరగనున్న లోక్‌సభ సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఈ అంశం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. అత్యధిక ఎంపీ సీట్లున్న ఉత్తరప్రదేశ్‌తో పాటు పలు రాష్ట్రాల్లో ఈ వర్గాల ఓట్లు కీలకంగా మారాయి. కొన్ని దశాబ్దాలుగా అగ్రవర్ణాల పార్టీగా పడిన ముద్రను తొలగించే ప్రయత్నంలోనూ ఆ పార్టీ నిమగ్నమైంది. దళితుల ఆదరాభిమానాలు పొందడంలో వెనకబడిందన్న పలు విశ్లేషణలు, నివేదికల నేపథ్యంలో ఈ వర్గాల మనసు గెలుచుకోవడంపై అధికార బీజేపీ దృష్టిపెట్టింది. దీనికోసం దళితుల ఇళ్లల్లో భోజనం, బస వంటి ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని సైతం ప్రారంభించింది. అయితే వివిధ రాష్ట్రాల్లో నేతలు అనుసరిస్తున్న తీరుతో ఇది ఒకింత రసాభాసాగాను తయారైంది.

యూపీలో ఓ దళితవాడలోని ఇంటికి చెప్పా పెట్టకుండానే ఓ మంత్రివర్యుడు మందీ మార్భలంతో వాలిపోయాడు. వచ్చిన చిక్కల్లా ఆ ఇంట్లో వండిన భోజనం కాకుండా మినరల్‌ వాటర్‌ సహా వడ్డించే వస్తువులు, ఆహారం ఇలా మొత్తం  హోటల్‌ నుంచే తెప్పించి అక్కడ ఆరగించడమే. ఎంపీలు, మంత్రులతో సహా పార్టీ నేతలంతా కనీసం ఒక్కనాడైనా దళితవాడల్లో గడపాలన్న అధినాయకత్వం హుకుంను ఆ మంత్రి ఆ విధంగా అర్థం చేసుకున్నాడన్న మాట. సురేష్‌ రానా అనే ఈ మంత్రి  హఠాత్తుగా రాత్రి 11 గంటల సమయంలో అలీఘర్‌లోని ఓ దళితుడి ఇంట్లో ప్రత్యక్షమై  ఇలా ఆభాసుపాలయ్యారు. తమ ప్రమేయం ఏమాత్రం లేకుండానే జరిగిన ఈ తంతును గురించి సదరు గృహస్థు రజనీష్‌ కుమార్‌ మీడియా ఎదుట వివరించడంతో ఈ ఉదంతం బయటకొచ్చింది.

ఆ ఇంట్లో  వండిన పదార్థాలూ తిన్నాననీ, ఆ కుటుంబంతో కలిసి  ఉదయం టిఫెన్‌ కూడా చేశానని చివరకు ఆ మంత్రి సంజాయిషీ ఇచ్చుకోక తప్పలేదు. ఈ ఒక్క ఘటనతోనే దళిత నివాసాల్లో భోజనం అంకం ముగిసిపోలేదు. దళితులతో మమేకమవ్వడంలో భాగంగా మంత్రులు ‘దోమకాట్ల’కు సైతం గురవుతున్నారంటూ యోగి ఆదిత్యనాథ్‌ ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రి అనుపమ జైస్వాల్‌ తాజాగా సెలవిచ్చేశారు. దీని నుంచి రాజకీయంగా ఆశించిన ఫలితాలు పొందేందుకు దళితుల ఇళ్లలో రాత్రంతా దోమలతో కుట్టించుకుంటున్నామని పేర్కొన్నారు. ఈ అనుభవం మంచిదనే భావనలో కూడా ఉన్నారని, ఈ పనిలో సంతృప్తి ఉన్నందున ఇది తమను పరిపుష్టం చేస్తుందని వెల్లడించారు. గత నెలలో కేంద్రమంత్రి రవిశంకర్‌ప్రసాద్‌ కొందరు దళితులతో కలిసి అయిదునక్షత్రాల హోటల్‌లో విందు ఆరగించిన ఫోటోలు సోషల్‌మీడియాలో విస్తృతంగా షేర్‌ కావడం, దానిపై విమర్శలు రావడం తెలిసిందే.

యూపీకే చెందిన మరోమంత్రి రాజేందర్‌ ప్రతాప్‌సింగ్‌   దళితులతో కలిసి తినడం ద్వారా వారి ఉద్ధరణకు కృషి చేస్తున్న బీజేపీ నాయకులు శ్రీరాముడితో పోల్చతగినవారంటూ పేర్కొన్నారు. ఇలాంటి కార్యక్రమాలు దళితవర్గాలను కించపరిచేందుకు దోహదపడుతున్నాయంటూ కాషాయపక్ష ఎంపీ ఉదిత్‌రాజ్‌ తప్పబట్టారు. తాము ఉచ్ఛస్థాయిలో ఉంటే దళితులు అథమస్థాయిలో ఉన్నారని చెప్పేందుకు ఇది ఉపయోగపడుతోందని ఓ దళితుడిగా తానీ విషయాన్ని వెల్లడిస్తున్నట్టు స్పష్టంచేశాడు. ఇదిలా ఉంటే కేంద్రమంత్రి, ఫైర్‌బ్రాండ్‌ నాయకురాలు ఉమాభారతి మధ్యప్రదేశ్‌లో ఏర్పాటు చేసిన దళితులతో భోజనం కార్యక్రమానికి గైర్హాజరయ్యారు.

ప్రజలతో భోజనం చేసి వారిని పరిశుద్ధులుగా చేయడానికి తానేమి శ్రీరామ భగవాన్‌ను కానంటూ మరో వివాదానికి తెరలేపారు. విమర్శలు వెళ్లువెత్తడంతో ఆమె క్షమాపణలు చెప్పక తప్పలేదు. దళితులే ఢిల్లీలోని తన ఇంటికి వస్తే, వారికి భోజనం పెట్టడంతో తమ ఇంటి వాళ్లు వారి ప్లేట్లు కూడా కడుగుతారంటూ వ్యాఖ్యానించారు. అయితే దళితుల హృదయాలను గెలుచుకోవడానికి బదులు నాయకులు చేష్టలతో ఈ కార్యక్రమం కొన్ని చోట్ల ‘ఫార్స్‌’గా మారడం పట్ల చివరకు ఆరెస్సెస్‌ నుంచి కూడా హెచ్చరికలు ఎదుర్కోక తప్పలేదు. కేవలం దళితుల ఇళ్లకు వెళ్లడంతోనే ప్రయోజనం ఉండదని, వారిని బీజేపీ నాయకుల ఇళ్లల్లోకి ఆహ్వానిస్తేనే ఉభయతారకంగా ఉంటుందని ఆరెస్సెస్‌ అధినేత మోహన్‌ భగవత్‌ కూడా సూచించారు.  
–సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌

మరిన్ని వార్తలు