భారీ విజయం దిశగా గంభీర్‌

23 May, 2019 16:27 IST|Sakshi

ఢిల్లీ: సాధారణ ఎన్నికల్లో తొలిసారి లోక్‌సభ బరిలో నిలిచిన భారత మాజీ క్రికెటర్‌ గౌతం​ గంభీర్‌ భారీ విజయం దిశగా దూసుకుపోతున్నారు. తూర్పు ఢిల్లీ నుంచి బీజేపీ అభ్యర్థిగా లోక్‌సభకు పోటీ చేసిన గంభీర్‌.. ప్రత్యర్థి నేతలకు అందనంత మెజార్టీలో కొనసాగుతున్నారు. ప్రస్తుతం గంభీర్‌కు ఐదు లక్షల పైచిలుకు ఓట్లు రాగా, అతని సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్‌ నేత అరవింద్‌ సింగ్‌ లవ్లీ రెండు లక్షల నలభై తొమ్మిది వేల ఓట్లతో రెండో స్థానంలో కొనసాగుతున్నారు. గంభీర్‌కు గట్టి పోటీ ఇస్తారని భావించిన లవ్లీ పెద్దగా ప్రభావంగా చూపలేదు. ఇక ఆప్‌ అభ్యర్థి అతీషి లక్షా డబ్బై వేల ఓట్లతో మూడో స్థానంలో కొనసాగుతున్నారు. దాంతో గంభీర్‌ ఘన విజయం ఖాయంగా కనబడుతోంది. 

తొలిసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్న గంభీర్‌ స్థానికుడు కాకపోయినా  ఆయనపై ఓటర్లు నమ్మకం ఉంచారు.  తనకున్న వ్యక్తిగత స్టార్‌డమ్‌తో పాటు ప్రధాని నరేంద్ర మోదీ చరిష్మా కూడా గంభీర్‌కు కలిసొచ్చింది. సోషల్‌ మీడియా వేదికగా తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా వ్యక్తం చేయడంలో ముందు వరుసలో ఉండే గంభీర్‌ తన విజయంపై ఆది నుంచీ నమ్మకంతో ఉన్నారు. ఇక కాంగ్రెస్‌ తరఫున బరిలో ఉన్న అరవింద్‌ కాంగ్రెస్‌ నుంచి బీజేపీకి, తిరిగి కాంగ్రెస్‌కు చేరడం కూడా గంభీర్‌ ప్రధానంగా కలిసొచ్చిన అంశగా చెప్పాలి. 

మరిన్ని వార్తలు