శ్వేతపత్రాలపై బ్లాక్‌ పత్రాలు విడుదల చేస్తాం

24 Dec, 2018 03:45 IST|Sakshi

చంద్రబాబు శ్వేత పత్రాలు బూటకమని నిరూపిస్తాం 

ప్రజలను మోసం చేసేందుకే ఎన్నికల ముందు మరో డ్రామా 

20 మంది ఎంపీలుంటే సాధించలేని బాబు 25 ఇస్తే సాధిస్తాడా?

ఈవీఎంలపై బాబు ఆరోపణలంటే ఓటమిని ముందే అంగీకరించినట్లే

వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నేత ఆనం రామనారాయణరెడ్డి   

సాక్షి, హైదరాబాద్‌: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విడుదల చేస్తున్న శ్వేతపత్రాలు బూటకమని నిరూపిస్తామని, అందులో భాగంగా తమ పార్టీ బ్లాక్‌ పేపర్లను విడుదల చేస్తుందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత ఆనం రామనారాయణరెడ్డి చెప్పారు. ఆదివారం ఆయన హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో  విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు చంద్రబాబు విడుదల చేసే ఒక్కో శ్వేతపత్రంపై తమ పార్టీ స్పందిస్తుందని, వాటిలోని లోటుపాట్లను ఎత్తి చూపుతూ బ్లాక్‌ పేపర్‌ విడుదల చేస్తామన్నారు.  బాబు విడుదల చేసే శ్వేతపత్రాలు తెల్ల కాగితాలతో సమానమని, వాటికి విలువ లేదని దుయ్యబట్టారు. ఎన్నికల ముందు ప్రజలను మభ్య పెట్టేందుకు, దగా చేసేందుకు వీటిని విడుదల చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 2014 ఎన్నికలపుడు చంద్రబాబు 600కుపైగా హామీలు ఇచ్చి వాటిలో ఏ ఒక్క దానినీ సంపూర్ణంగా అమలు చేయలేదని, అభివృద్ధి పనులు చేయకుండా ప్రజలను మభ్య పెట్టేందుకే శ్వేతపత్రాల పల్లవిని అందుకున్నారని ఆయన దుయ్యబట్టారు. ఏపీకి ఇచ్చిన విభజన హామీలు నెరవేరాలంటే వచ్చే ఎన్నికలలో 25 ఎంపీ సీట్లు టీడీపికి రావాలని ధర్మపోరాట దీక్షలలో చంద్రబాబు కోరడంపై ప్రజలు ఒకసారి ఆలోచించాలన్నారు. టీడీపీకి ప్రస్తుతం కొనుగోలు చేసిన ముగ్గురితో కలిపి 20 మంది ఎంపీలున్నారని, అయినా కేంద్రంతో నాలుగున్నర సంవత్సరాలు అంటకాగి చంద్రబాబు ఏపీ కోసం సాధించిన విజయాలు ఏమైనా ఉన్నాయా? అని ప్రశ్నించారు. 

ఓటమి భయంతోనే ఈవీఎంపై  ఆరోపణలు
తెలంగాణ ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత చంద్రబాబు ఈవీఎంలపై విమర్శలు చేస్తూ, బ్యాలెట్‌ పత్రాలే కావాలని హంగామా చేస్తున్నారంటే రానున్న ఎన్నికల్లో ఓటమిని అంగీకరించినట్లేనన్నారు. తెలంగాణలో ఈవీఎంలు టాంపరింగ్‌ అయినట్లైతే మరి మూడు రాష్ట్రాలలో కాంగ్రెస్‌ ఎలా గెలిచింది, అక్కడ ఈవీఎంలు సరిగ్గానే పని చేశాయా? అని ప్రశ్నించారు. 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు ఇలా దిగజారి మాట్లాడడం శోచనీయమన్నారు.  

తిరుపతి పేరును సిలికాన్‌ సిటీగా ఎలా మారుస్తారు?
తిరుపతిని సిలికాన్‌ సిటీగా మారుస్తానని ప్రకటించి కోట్ల మంది హిందువుల మనో భావాలను ముఖ్యమంత్రి దెబ్బతీశారని అన్నారు. గతంలో వేయి కాళ్ల మండపాన్ని కూల్చిన చంద్రబాబుకు దాని ఫలితం ఏ విధంగా ఉంటుందో అర్థం అయ్యే ఉంటుందన్నారు. 

చంద్రబాబు కోవర్టు కిరణ్‌..
చంద్రబాబుకు ఇద్దరు కోవర్టులు ఉన్నారని, వారిలో ఒకరు ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్‌లో ఉన్న రేవంత్‌రెడ్డి కాగా రెండో వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి అన్నారు. కిరణ్‌కుమార్‌రెడ్డి నాలుగున్నరేళ్లు గోల్ఫ్‌ ఆడి అలసి పోయి, ఇపుడు చంద్రబాబు కోవర్టుగా రాజకీయాల్లోకి వచ్చారని  విమర్శించారు. ఇంతకూ కిరణ్‌కుమార్‌రెడ్డి ఉమ్మడి రాష్ట్రంలో ప్రారంభించిన చెప్పుల పార్టీ ఏమైంది. ? దాన్ని రద్దు చేశారా? అలాగే ఉందా? అని ప్రశ్నించారు. కోవర్టు కిరణ్‌ ఈ మధ్య రాజకీయ సభలలో మాట్లాడుతూ వైయస్సార్‌సీపీపై విమర్శలు గుప్పిస్తున్నారనీ సోనియా దయాదాక్షిణ్యాలతో సీఎం పదవిని దక్కించుకున్న కిరణ్‌కుమార్‌ రెడ్డికి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ను ఎదుర్కొనే శక్తి సామర్థ్యాలు లేవన్నారు. 

మరిన్ని వార్తలు