ఖాతా తెరవని లెఫ్ట్‌..

12 Dec, 2018 05:11 IST|Sakshi

ఫలించని బీఎల్‌ఎఫ్‌ ప్రయోగం... 

అసెంబ్లీలో ప్రాతినిథ్యం సున్నా 

సాక్షి, హైదరాబాద్‌: అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఐ, సీపీఎం–బీఎల్‌ఎఫ్‌ కనీసం ఖాతా కూడా తెరవలేకపోయాయి. ఈ పక్షాలు విడివిడిగా పోటీచేసినా ఒక్క సీటు అయినా గెలవలేకపోయాయి. గత ఎన్నికల్లో సీపీఐ, సీపీఎం చెరో సీటు సాధించగా, ఈసారి ఈ రెండు పార్టీలతో పాటు బీఎల్‌ఎఫ్‌కు కూడా శాసనసభలో ప్రాతినిధ్యం లేకుండా పోయింది. 1999లో సీపీఐకు ఇలాంటి పరిస్థితే ఎదురైంది. మళ్లీ 15 ఏళ్ల తర్వాత ఆ పార్టీ మరోసారి అదే స్థితికి లోనైంది. సీపీఎం  తొలిసారిగా శాసనసభలో ప్రాతినిధ్యం లేని పరిస్థితిని ఎదుర్కొంటోంది. 

మూడుచోట్లా సీపీఐ ఓటమి... 
కాంగ్రెస్‌ ప్రజాఫ్రంట్‌ కూటమిలో భాగంగా కేటాయించిన 3 సీట్లలో సీపీఐ ఓటమి పాలైంది. ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు కారణంగా ఆశించిన ప్రయోజనం నెరవేరకపోగా కనీసం ఒక్కస్థానంలో కూడా గెలవకపోవడం ఆ పార్టీపై తీవ్ర ప్రభావం చూపనుంది. సీపీఐ, సీపీఎం, ఇతర వామపక్షాలు కలసి పోటీచేసి ఉంటే కనీసం వామపక్ష ఐక్యతకు ప్రాధాన్యం ఇచ్చినట్టుగా ఉండేదని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. హుస్నాబాద్‌ నుంచి పోటీచేసిన ఆ పార్టీ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి 46,553 ఓట్లు సాధించి, టీఆర్‌ఎస్‌ అభ్యర్థి వొడితెల సతీశ్‌కుమార్‌ చేతిలో 70,530 ఓట్లతేడాతో పరాజయం చవిచూశారు. ఆ పార్టీ రెండో సీటు వైరా (ఎస్టీ)లో సీపీఐ అభ్యర్థి బానోతు విజయ 32,757 ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు. బెల్లంపల్లి (ఎస్సీ) స్థానం నుంచి పోటీ చేసిన సీనియర్‌ నేత గుండా మల్లేశ్‌  కేవలం 3,600 ఓట్లతో నాలుగోస్థానానికి పరిమితమయ్యారు.   

బీఎల్‌ఎఫ్‌ విఫలం.. 
ఈ ఎన్నికల్లో సీపీఎం–బహుజన లెఫ్ట్‌ ఫ్రంట్‌ (బీఎల్‌ఎఫ్‌) కలసి మొత్తం 107 సీట్లలో పోటీచేశాయి. సీపీఎం 26 స్థానాల్లో పోటీచేయగా, పార్టీ బలంగా ఉందని భావిస్తున్న భద్రాచలంలో మూడోస్థానానికి, మిర్యాలగూడలో నాలుగోస్థానానికి పరిమితమైంది. భద్రాచలం మినహా మిగతా చోట్ల డిపాజిట్లు గల్లంత య్యే పరిస్థితి ఏర్పడింది. ప్రత్యామ్నాయ విధానాలు–సామాజికన్యాయం పేరిట ప్రస్తుత ఎన్నికల్లో సీట్లు కాకపోయినా గణనీయంగా ఓట్లు అయినా సాధించవచ్చుననే కోరిక కూడా సీపీఎం–బీఎల్‌ఎఫ్‌లకు నెరవేరలేదు. బీఎల్‌ఎఫ్‌ అభ్యర్థి కె.శివకుమార్‌రెడ్డి 53,580 ఓట్లు సాధించి రెండోస్థానంలో నిలిచా రు. మధిరలో కోటా రాంబాబు 23,030 ఓట్లతో మూడోస్థానంలో నిలిచారు. ఈచోట్ల మినహా మిగతా నియోజకవర్గాల్లో డిపాజిట్లు కూడా దక్కని పరిస్థితి నెలకొంది. గోషామహల్‌ నుంచి తొలిసారిగా ట్రాన్స్‌జెండర్‌ అభ్యర్థి చంద్రముఖిని బీఎల్‌ఎఫ్‌ బరిలో నిలిపినా కేవలం 120 ఓట్లు మాత్రమే పోలయ్యాయి.  

మరిన్ని వార్తలు