బీఎల్‌ఎఫ్‌ ప్రయోగంలో విఫలమయ్యాం

30 Dec, 2018 02:46 IST|Sakshi

అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపై సీపీఎం విశ్లేషణ

ఎజెండాను ప్రజలకు అర్థమయ్యేలా వివరించలేకపోయాం

అందుకే 90% ఉన్న బహుజనుల నుంచే మద్దతు లభించలేదు

ఏచూరి, కారత్‌ సమక్షంలో పార్టీ రాష్ట్ర సెక్రటేరియట్‌ భేటీ

సాక్షి, హైదరాబాద్‌: అసెంబ్లీ ఎన్నికల్లో బహుజన లెఫ్ట్‌ ఫ్రంట్‌ (బీఎల్‌ఎఫ్‌) పేరిట చేసిన ప్రయోగాన్ని ప్రజలకు అర్థమయ్యేలా వివరించడంలో విఫలమైనట్లు సీపీఎం అంగీకరించింది. రాష్ట్రంలో 90 శాతానికిపైగా ఉన్న బహుజనులకు (ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారి టీలు, మహిళలు) ప్రాధాన్యం, సామాజిక న్యాయం సాధన ఎజెండాను ముందుకు తీసుకెళ్లినా ఈ వర్గాల నుంచే తగిన సహకారం అందలేదని పార్టీ నేతలు అభిప్రాయపడ్డారు. తాము చేసిన కొత్త ప్రయోగానికి కిందిస్థాయిలోని ఆయా వర్గాలు కలసి రాకపోగా ఈ ఎజెండా కారణంగా ఇప్పటివరకు మద్దతుగా ఉన్న పైకులాలు, వర్గాలు కూడా పార్టీకి దూరమయ్యాయని పేర్కొన్నారు. అధికార టీఆర్‌ఎస్‌–విపక్ష కాంగ్రెస్‌ కూటమి మధ్యే ప్రధాన పోటీ ఉండటంతో ఓటర్లు తమను బలమైన రాజకీయ శక్తిగా గుర్తించలేదని విశ్లేషించారు. ఈ ఎజెండాను ఎవరి కోసం చేపట్టామో దాన్ని కిందిస్థాయి వరకు తీసుకెళ్లి ప్రజలకు బలంగా వివరించడంలో తమ వైఫల్యం ఉందని అంగీకరించారు. ఎన్నికల ఫలితాలపై శనివారం ఎంబీ భవన్‌లో పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గంతో సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, అగ్రనేతలు ప్రకాష్‌ కారత్, బీవీ రాఘవులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఎన్నికలు జరిగిన తీరు, చోటుచేసుకున్న పరిణామాల గురించి బీవీ రాఘవులు వివరించారు. అనంతరం పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఒక్కొక్కరుగా ఎన్నికల్లో పార్టీ నిరాశాజనక ఫలితాలకు దారితీసిన పరిస్థితులపై అభిప్రాయాలు తెలియజేశారు. బీఎల్‌ఎఫ్‌ పేరిట పేదలు, రైతులు, ఇతర వర్గాల కోసం ఎంచుకున్న ఎజెండా మంచిదే అయినా దాన్ని ప్రజలకు అర్థమయ్యేలా వివరించలేకపోయామన్నారు.

తెలంగాణ సెంటిమెంట్‌ పని చేసింది... 
తెలంగాణ రాజకీయాల్లో ఏపీ సీఎం చంద్రబాబు జోక్యం చేసుకున్న తీరు, నిర్వహించిన ప్రచారం కాంగ్రెస్‌ ప్రజాఫ్రంట్‌ కూటమిపై ప్రతికూల ఫలితాలకు కారణమైందని ఓ నాయకుడు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో తన రాజకీయ ప్రయోజనాలను కాపాడుకునేందుకే కాంగ్రెస్‌తో చంద్రబాబు పొత్తు పెట్టుకున్నారని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్‌ కూటమి గెలిస్తే తెలంగాణ రాజకీయాల్లో చంద్రబాబు జోక్యం, పెత్తనం పెరుగుతుందని, రాష్ట్ర ప్రయోజనాలకు భంగం వాటిల్లుతుందనే ప్రచారాన్ని కేసీఆర్‌ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లగలిగారని పేర్కొన్నారు. పింఛన్ల పెంపు, రైతుబంధు పథకం, వివిధ సంక్షేమ పథకాల అమలు, ఏదో ఒక రూపంలో లబ్ధి చేకూర్చేందుకు చేసిన ప్రయత్నాలు టీఆర్‌ఎస్‌కు ఎన్నికల్లో రాజకీయంగా ప్రయోజనం చేకూర్చాయని తెలిపారు. టీఆర్‌ఎస్‌ మళ్లీ గెలిస్తేనే ప్రస్తుతం అమలవుతున్న సంక్షేమ పథకాలు కొనసాగుతాయని ప్రజలు భావించే టీఆర్‌ఎస్‌ను మళ్లీ గెలిపించారని విశ్లేషించారు. తెలంగాణ సెంటిమెంట్‌ను మరోసారి చర్చనీయాంశం చేసేలా చంద్రబాబు చేసిన ప్రసంగాలు, ఆయన వ్యవహారశైలి ప్రజల్లో వ్యతిరేకతకు కారణమైందని ఆ నాయకుడు పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు