పార్టీ మార్పుపై ఎమ్మెల్యే షకీల్‌ వివరణ

13 Sep, 2019 12:11 IST|Sakshi

బీజేపీలో చేరుతున్నట్లు వస్తున్న వార్తలు అవాస్తవం

కేసీఆర్ న్యాయం చేస్తారని పూర్తి విశ్వాసం ఉంది

అరవింద్‌తో భేటీ వ్యక్తిగతం: ఎమ్మెల్యే షకీల్‌

సాక్షి, నిజామాబాద్‌: తాను టీఆర్ఎస్‌ను వీడి బీజేపీలో చేరుతున్నట్లు వస్తున్న వార్తలు అవాస్తవమని టీఆర్‌ఎస్‌ బోధన్ ఎమ్మెల్యే షకీల్ తెలిపారు. పార్టీ మార్పుపై వస్తున్నదంతా తప్పుడు ప్రచారమంటూ కొట్టిపారేశారు. తెలంగాణలో తాజాగా జరిగిన మంత్రివర్గ విస్తరణలో ఆయనకు చోటు దక్కని విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గురువారం ఆయన నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అరవింద్‌తో భేటీ అయ్యారు. వీరి భేటీ తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. షకీల్‌ త్వరలోనే బీజేపీలో చేరతారని వార్తలు రాష్ట్ర వ్యాప్తంగా వినిపించాయి. ఈ నేపథ్యంలో ఆయనపై వస్తున్న ప్రచారంపై సోషల్‌ మీడియా వేదికగా షకీల్‌ స్పందించారు.

‘నాపై వస్తున్న వార్తలు అవాస్తవం. నేను టీఆర్ఎస్‌లోనే కొనసాగుతా. నాకు మంత్రిపదవి రానందుకు అసంతృప్తి ఉందనే ప్రచారం కూడా సరైంది కాదు. వ్యక్తిగత పనిమీద అరవింద్‌ను కలిశాను. నేను బీజేపీలో కానీ కాంగ్రెస్‌లో కానీ చేరను, ఆ ఆలోచనలే లేవు.  నాకు సీఎం కేసీఆర్ న్యాయం చేస్తారని పూర్తి విశ్వాసం ఉంది. 12 ఏళ్ళుగా కేసీఆర్‌తో కలిసి నడుస్తున్నాం. జీవితాంతం ఇదేవిధంగా ఉంటాం. సమయం వచ్చినప్పుడు, దేవుడు కరుణించినప్పుడు అవకాశాలు అవే వస్తాయి’ అంటూ సోషల్‌ మీడియాలో వివరణ ఇచ్చారు. కాగా తెలంగాణ కేబినెట్‌ విస్తరణ తర్వాత రాష్ట్రంలోని అధికార టీఆర్‌ఎస్‌లో మొదలైన అలకలు, అసంతృప్తుల పర్వం మొదలైన విషయం తెలిసిందే. మంత్రివర్గంలో స్థానం దక్కకపోవడంతో గులాబీ బాస్‌పై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వారంత బీజేపీలో చేరతారని వార్తలు వినిపిస్తున్నాయి.

చదవండి: టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే షకీల్‌ అలక!
చదవండి: కమలదళం వలస బలం! 

మరిన్ని వార్తలు