బొడిగె శోభకు మళ్లీ చుక్కెదురు!?

12 Sep, 2018 13:35 IST|Sakshi

సాక్షి,  చొప్పదండి : టికెట్‌ విషయంలో అసంతృప్తితో రగిలిపోతున్న చొప్పదండి తాజా మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభకు మళ్లీ చుక్కెదురైనట్లు సమాచారం. శోభ వ్యవహార శైలితో టీఆర్‌ఎస్‌ పార్టీకి పెద్దఎత్తున నష్టం వాటిల్లనుందంటూ నియోజకవర్గంలోని ప్రముఖ నేతలంతా తమ అధినాయకుడు కేసీఆర్‌కు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీంతో అసెంబ్లీ రద్దు అనంతరం కేసీఆర్‌ ప్రకటించిన 105 మంది అభ్యర్థుల జాబితాలో శోభకు చోటు కల్పించలేదు. అంతేకాకుండా ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోని 13 నియోజక వర్గాల అభ్యర్థులను ప్రకటించి.. చొప్పదండి అసెంబ్లీ స్థానాన్ని మాత్రమే పెండింగ్‌లో పెట్టడంతో శోభ అనుచరగణంలో ఆందోళన మొదలైంది.

కాగా అప్పటి నుంచి ఇంటికే పరిమితమైన శోభ.. సోమవారం కేసీఆర్‌ను కలిసేందుకు విశ్వ ప్రయత్నం చేసినా అపాయింట్‌మెంట్‌ దొరకలేదని తెలిసింది. దీంతో ఆపద్ధర్మ మంత్రి ఈటల రాజేందర్‌, కరీంనగర్‌ ఎంపీ వినోద్‌కుమార్‌లను కలిసి టికెట్‌ కేటాయింపు విషయమై సహకరించాలని కోరినట్లు సమాచారం. కాగా ఆ విషయం కేసీఆర్‌ చేతిలోనే ఉందని, తామేమీ చేయలేని చెప్పడంతో శోభ వర్గీయులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. శోభ వ్యవహార శైలితో టీఆర్‌ఎస్‌ పార్టీకి పెద్దఎత్తున నష్టం వాటిల్లనుందంటూ నియోజకవర్గంలోని ప్రముఖ నేతలంతా తమ అధినాయకుడు కేసీఆర్‌కు పిర్యాదు చేసిన విషయం తెలిసిందే.

శోభక్క లేకుండానే...!!
టీఆర్‌ఎస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నియోజక వర్గంలో జరిగే పార్టీ కార్యక్రమాలన్నీ శోభ కనుసన్నల్లోనే జరిగేవి. కాగా మండల కేంద్రంలో సోమవారం జరిగిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఓటరు నమోదు కార్యక్రమాన్ని నిర్వహించింది. పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి గూడూరి ప్రవీణ్‌, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ ఏనుగు రవీందర్‌ రెడ్డిలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. శోభ లేకుంగా పార్టీ కార్యక్రమం జరగడం ఇదే తొలిసారి. దీంతో శోభను పక్కన పెట్టేందుకే పార్టీ ప్రముఖులు అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారనే ప్రచారం జోరందుకుంది.

ఏఎంసీ సమావేశానికి శోభ వర్గీయుల గైర్హాజరు..
శోభ పట్ల పార్టీ అధినాయకత్వం తీరును నిరసిస్తూ ఆమె వర్గీయులైన.. వ్యవసాయ మార్కెట్‌ వైస్‌ చైర్మన్‌ బుచ్చయ్య, మరొకొంత మంది డైరెక్టర్లు పాలక వర్గ సర్వ సభ్య సమావేశానికి గైర్హారయ్యారు. వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పీఏసీఎస్‌ చైర్మన్‌ కోమటిరెడ్డి పద్మాకర్‌ రెడ్డి, కార్యదర్శి బుచ్చయ్య తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు