బీజేపీ కార్యాలయంపై బాంబు దాడి

7 Mar, 2018 11:01 IST|Sakshi
కోయంబత్తూర్‌ బీజేపీ కార్యాలయంపై బాంబులు విసిరిన దుండగులు

సాక్షి, కోయంబత్తూర్‌ : ద్రవిడ ఉద్యమ వ్యవస్థాపకుడు పెరియార్‌ రామస్వామి విగ్రహం విధ్వంసంతో తమిళనాడులో ఉద్రిక్తత నెలకొంది. బీజేపీ జాతీయ కార్యదర్శి హెచ్‌ రాజా చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీ కార్యాలయాలపై దాడులకు దారి తీశాయి.  కోయంబత్తూరులోని బీజేపీ కార్యాలయంపై కొందరు దుండగులు బాంబులు విసిరారు. చితపుదూర్‌ ప్రాంతంలోని బీజేపీ కార్యాలయంపై బుధవారం తెల్లవారుజామున నాలుగు గంటలకు ఈ దాడి జరిగింది. కార్యాలయ భవనంపై గుర్తుతెలియని వ్యక్తులు రెండు పెట్రోల్‌ బాంబులు విసిరి వెనువెంటనే పరారయ్యారని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. ఘటనకు సంబంధించి పెట్రోలింగ్‌ చేస్తున్న పోలీసులకు సమాచారం అందించామని వారు తెలిపారు. కాగా, దాడి సమయంలో కార్యాలయం మూసివేసి ఉందని, ఎవరికీ గాయాలైన సమాచారం లేదని పోలీసులు తెలిపారు.

దాడికి పాల్పడిన వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. దాడి ఘటన దృశ్యాలు సీసీ టీవీలో రికార్డయ్యాయి. కోయంబత్తూరు దాడి నేపథ్యంలో చెన్నైలోని బీజేపీ కార్యాలయం వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు.  త్రిపురలో ఎన్‌డీఏ ప్రభుత్వం కొలువుతీరిన క్రమంలో లెనిన్‌, పెరియార్‌ విగ్రహాలను ధ్వంసం చేసిన ఘటనల నేపథ్యంలో బీజేపీ కార్యాలయంపై దాడి జరగడం గమనార్హం.

మాటమార్చిన హెచ్‌ రాజా
మరోవైపు తన ఫేస్‌బుక్‌ పోస్టుపై  హెచ్ రాజా మాట మార్చారు. తాను కామెంట్ చేసినట్టు చెబుతున్న ఫేస్ బుక్ పేజీ తనది కాదని, వేరెవరో దాన్ని మెయింటెయిన్ చేస్తున్నారని తెలిపారు.

కాగా  పెరియార్‌ పై బీజేపీ జాతీయ కార్యదర్శి రాజా చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ డీఎంకే కార్యకర్తలు సైదాపేటలో ఆందోళనకు దిగారు. పెరియార్ విగ్రహ ధ్వంసాన్నినిరసిస్తూ తమిళ సంఘాలు ఆందోళనలకు పిలుపునివ్వడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

మరిన్ని వార్తలు