బొమ్మిరెడ్డి ఆరోపణలు నిరాధారం  

24 Sep, 2018 03:55 IST|Sakshi
కాకాణి గోవర్ధనరెడ్డి , ప్రతాప్‌కుమార్‌రెడ్డి, కిలివేటి సంజీవయ్య

వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యేలు కాకాణి, రామిరెడ్డి, కిలివేటి

బొమ్మిరెడ్డి పార్టీ నుంచి వెళ్లిపోతూ అవాస్తవాలు మాట్లాడటం సరికాదు

ఆయన్ను ఎమ్మెల్సీగా చేస్తామని సజ్జల రామకృష్ణారెడ్డి పిలిచి మరీ చెప్పారు

వైఎస్‌ జగన్‌ వ్యక్తిత్వం ఐదు కోట్ల మంది ప్రజలకు తెలుసు

ఆయన ఎన్నడూ డబ్బుల గురించి మాట్లాడరు

సాక్షి ప్రతినిధి, నెల్లూరు: వైఎస్సార్‌ సీపీకి రాజీనామా చేసిన బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి చేసిన ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవని పార్టీ నెల్లూరు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధనరెడ్డి స్పష్టం చేశారు. బొమ్మిరెడ్డి వాఖ్యలు అర్థరహితమని, పార్టీ నుంచి వెళ్లిపోతూ ఇష్టానుసారంగా అసత్యాలు మాట్లాడటం పద్ధతి కాదని సూచించారు. కాకాణి ఆదివారం నెల్లూరులోని పార్టీ జిల్లా కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో పార్టీ ఎమ్మెల్యేలు రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి, కిలివేటి సంజీవయ్యలతో కలిసి మాట్లాడారు. బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి పార్టీకి రాజీనామా చేశానని ప్రకటించిన క్రమంలో తన ఆత్మగౌరవం దెబ్బతీసేలా మాట్లాడారని, పిలిచి మాట్లాడలేదని, పట్టించుకోలేదని, అవమానపరిచారని, డబ్బులు ఖర్చు పెట్టగలవా? అని ప్రశ్నించినట్లు ఆరోపించారని, దీనిపై వాస్తవాలను వెల్లడించాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. 

జగన్‌ వ్యక్తిగత కార్యదర్శి ఫోన్‌ చేయలేదా?
రాజకీయ పరిణామాల నేపథ్యంలో పార్టీ రీజనల్‌ కోర్డినేటర్‌ సజ్జల రామకృష్ణారెడ్డి బొమ్మిరెడ్డిని పిలిచి మాట్లాడారని, రానున్న రోజుల్లో ఎమ్మెల్సీ పదవి ఇస్తామని, పార్టీలో గౌరవం కల్పిస్తామని, ఆయన అడిగినవి కూడా చేస్తామని హామీ ఇచ్చారని కాకాణి తెలిపారు. మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పార్టీలో చేరిన తర్వాత అధినేతను కలిసేందుకు రావాలని జగన్‌ వ్యక్తిగత కార్యదర్శి బొమ్మిరెడ్డికి ఫోన్‌ చేశారని చెప్పారు. బొమ్మిరెడ్డిని విశాఖ తీసుకొచ్చే బాధ్యతను తనకు అప్పగించడంతో మంగళవారం ఉదయం ఆయనకు ఫోన్‌ చేయడం వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. ఆయన చైన్నైలో ఉన్నానని చెప్పడంతో నేరుగా విశాఖకు రావాలని సూచించానన్నారు. పార్టీ అధ్యక్షుడు పిలిస్తే వెళ్లకుండా ఉండటం మంచి పద్ధతి కాదని కూడా బొమ్మిరెడ్డికి చెప్పానన్నారు. పార్టీ అధ్యక్షుడి వద్దకు వెళ్దామని నాలుగుసార్లు చెబితే రకరకాల కారణాలతో దాటవేసి ఇప్పుడు అవాస్తవాలు మాట్లాడటం, అసలు తనతో మాట్లాడలేదని బొమ్మిరెడ్డి చెప్పటం భావ్యం కాదన్నారు. 

జగన్‌పై విమర్శలు సిగ్గుమాలిన చర్య
జిల్లా రాజకీయ చరిత్రలో ఆనం కుటుంబం ఎన్నికల్లో డబ్బు ఖర్చు పెట్టిన పరిస్థితి ఉందా? అని కాకాణి ప్రశ్నించారు. రాజకీయాలు తప్ప వ్యాపారాలు లేని వ్యక్తి ఆనం అని చెప్పారు. అలాంటిది ఆయన రూ.50 కోట్లు ఖర్చు పెడతారని పార్టీ అన్నట్లుగా బొమ్మిరెడ్డి చెప్పడం ఎంతవరకు సమంజసం? అని ప్రశ్నించారు. ఏడేళ్ల పాటు పార్టీలో ఉండి ఇప్పడిలా మాట్లాడటం సరైన పద్ధతి కాదన్నారు. జగన్‌ నియంత అంటూ బొమ్మిరెడ్డి విమర్శించడం సిగ్గుమాలిన చర్య అని మండిపడ్డారు. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ నుంచి వచ్చిన బొమ్మిరెడ్డికి సీనియర్లను కాదని జెడ్పీ చైర్మన్‌గా పార్టీ అవకాశం కల్పించిందన్నారు. 46 జెడ్పీటీసీలకు గానూ 31 స్థానాలు వైఎస్సార్‌ సీపీ గెలిస్తే ముఖ్యమంత్రి, డీజీపీ ఆదేశాలతో మంత్రులు, పోలీసులు కుమ్మకై జెడ్పీటీసీలు, ఇతరులను చొక్కాలు పట్టుకొని దౌర్జన్యం చేసి ప్రలోభపెట్టి పార్టీలు మారమని ఒత్తిడి తెచ్చిన తరుణంలో పార్టీ పూర్తి అండగా నిలిచి బొమ్మిరెడ్డిని జెడ్పీ చైర్మన్‌గా  చేయలేదా? అని ప్రశ్నించారు.

పార్టీ జెడ్పీటీసీలను పులివెందులలోని జగన్‌ నివాసానికి తరలిస్తే ఆయన మనోధైర్యం నింపి అంతా రాఘవేంద్రను గెలిపించాలని సూచిస్తే ఇప్పుడు నియంత అని ఆరోపించడం సిగ్గుమాలిన పని కాదా? అని ప్రశ్నించారు. జగన్‌ వ్యక్తిత్వం గురించి ఐదు కోట్ల మంది ప్రజలందరికీ తెలుసని చెప్పారు. పార్టీలో మేకపాటి రాజమోహనరెడ్డికి విలువ లేదని బొమ్మరెడ్డి మాట్లాడటం నీతిమాలిన  చర్యని మండిపడ్డారు. వైఎస్‌ జగన్‌కు మెదటి నుంచి అండగా ఉన్న వ్యక్తి మేకపాటి రాజమోహన్‌రెడ్డి అని గుర్తు చేశారు. బొమ్మిరెడ్డికి జెడ్పీ చైర్మన్‌ పదవి ఇప్పించిన వ్యక్తి మేకపాటి కాదా? అని ప్రశ్నించారు. బొమ్మిరెడ్డిని జెడ్పీ చైర్మన్‌గా చేయడంతోపాటు వెంకటగిరి నియోజకవర్గం సమన్వయకర్త బాధ్యతలు దక్కేలా చేసింది మేకపాటి కుటుంబం కాదా? అని ప్రశ్నించారు. ఆనం ఈ నెల 2వ తేదీన పార్టీలో చేరితే బొమ్మిరెడ్డితో మాట్లాడాలనే 20వ తేదీ వరకు ఎదురుచూసి ఆయన్ని సమన్వయకర్తగా ప్రకటించారని చెప్పారు. వైఎస్సార్‌ సీపీ గౌరవం, విలువలతో కూడిన రాజకీయం చేసే పార్టీ అని కాకాణి పేర్కొన్నారు.

కొందరి ప్రేరణతోనే బొమ్మిరెడ్డి ఆరోపణలు..
రాఘవ వాఖ్యలు సరికాదని కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. జగన్‌ పలు ఒత్తిళ్లను భరించి మరీ ఆయన్ను జెడ్పీ చైర్మన్‌గా చేసిన సంగతి మరిచిపోయి ఇలా మాట్లాడటం దారుణమన్నారు. కొందరు వ్యక్తుల ప్రేరణతోనే బొమ్మిరెడ్డి ఇలా మాట్లాడుతున్నారని చెప్పారు. జగన్‌ నోటి వెంట ఎప్పుడూ డబ్బు ప్రస్తావనే రాదని, ఆయన ఎంతో ఆప్యాయంగా మాట్లాడి అండగా ఉండే వ్యక్తి అని సూళ్లూరుపేట ఎమ్మెల్యే  సంజీవయ్య పేర్కొన్నారు. ఉద్యోగం వదిలి రాజకీయాల్లోకి వచ్చిన తనకు 2014 ఎన్నికల సమయంలో డబ్బుల గురించి ఒక్కమాట కూడా మాట్లాడకుండా బాగా పని చేసుకోవాలని సూచించారని, మనిషిని నమ్మే నైజం జగన్‌దని చెప్పారు. 

మరిన్ని వార్తలు