మోదీ నవ శివాజీ అంటూ పుస్తకం

14 Jan, 2020 09:54 IST|Sakshi

బ్యాన్‌ చేయాలంటూ కేసు పెట్టిన శివసేన

ముంబై: ‘ఇప్పటి శివాజీ – నరేంద్ర మోదీ’ పేరుతో విడుదలైన పుస్తకం మహారాష్ట్రలో వివాదస్పదమైంది. ఇది మహారాజు ఛత్రపతి శివాజీని అవమానించడమేనని, బీజేపీలో ఉన్న శివాజీ వారసులు దీనిపై తమ అభిప్రాయమేమిటో చెప్పాలని సోమవారం శివసేన నేత సంజయ్‌ రౌత్‌ డిమాండ్‌ చేశారు. శివాజీని మోదీతో పోల్చడం ద్వారా ప్రజల మనోభావాలను దెబ్బతీస్తున్నారంటూ శివసేన పార్టీ కార్యకర్త దిన్‌కర్‌ జగ్దాలే.. పుస్తక రచయిత జయ్‌ భగవాన్‌ గోయల్‌పై సోలాపూర్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసు పెట్టారు. సోలాపూర్‌లో ఈ పుస్తకంపై నిరసన కూడా జరిగింది. ఈ కేసుకు సంబంధించిన న్యాయపర అంశాలను పరిశీలిస్తున్నందున దరఖాస్తు అందినా, కేసు ఇంకా నమోదు చేయలేదని పోలీసులు చెప్పారు. మోదీ బూట్లు నాకే కొందరు వ్యక్తులు ఇలాంటి పుస్తకాలు రాసి లాభం పొందాలని చూస్తున్నారని సంజయ్‌రౌత్‌ మండిపడ్డారు.

ఈ పుస్తకంతో తమకే సంబంధంలేదని బీజేపీ చెప్పాలంటూ డిమాండ్‌ చేశారు. తమకు మోదీ అంటే గౌరవమేనని, అయితే శివాజీతో పోల్చడం అంగీకరించబోమని స్పష్టంచేశారు. శివాజీ వారసులైన బీజేపీ రాజ్యసభ సభ్యుడు ఛత్రపతి సాంబాజి రాజే, ఇటీవలే బీజేపీలో చేరిన సతారా మాజీ ఎంపీ ఉదయాంజె భోసాలేలు ఈ పుస్తకంపై తమ వైఖరి తెలియజేయాలని కోరారు. ఈ అంశంపై తమ పార్టీ స్పష్టమైన వైఖరి కలిగి ఉందని మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే కూడా తనకు చెప్పినట్లు ఆయన వెల్లడించారు. ఈ పుస్తకాన్ని నిషేధించాలనేది తమ పార్టీ వైఖరి అని తెలిపారు. అయితే పుస్తకంలో వివాదాస్పద విషయాలను తిరిగి రాయడానికి సిద్ధంగా ఉన్నానంటూ రచయిత గోయల్‌ మీడియాతో చెప్పారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా