బూత్‌ అధ్యక్షులు క్రియాశీలకంగా పనిచేయాలి 

18 Jul, 2018 01:44 IST|Sakshi

ఎల్‌డీఎంఆర్‌సీ అధ్యక్షులతో ఉత్తమ్‌ టెలీ కాన్ఫరెన్స్‌ 

సాక్షి, హైదరాబాద్‌: ఓటర్లతో సత్సంబంధాలు ఏర్పాటు చేసుకుని వారంతా కాంగ్రెస్‌ పార్టీ వైపు ఉండేలా చూడాలని, పోలింగ్‌బూత్‌ స్థాయిలో నియమితులైన అధ్యక్షులు క్రియాశీలకంగా పనిచేయాలని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి లీడర్‌ షిప్‌ మిషన్‌ ఇన్‌ రిజర్వుడ్‌ కానిస్టిట్యూషన్స్‌ (ఎల్‌డీఎంఆర్‌సీ) అధ్యక్షులకు పిలుపునిచ్చారు.

కాంగ్రెస్‌ హ్యూమన్‌ రీసోర్స్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ (ఛార్మ్స్‌) ద్వారా ఆయన మంగళవారం ఏకకాలంలో రాష్ట్రంలోని 31 రిజర్వుడ్‌ నియోజకవర్గాలకు చెందిన 4,500 మంది బూత్‌ అధ్యక్షులతో టెలీకాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. శక్తి యాప్‌లో కార్యకర్తల రిజిస్ట్రేషన్‌ చాలా ముఖ్యమైన అంశమని, ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ప్రత్యేక శ్రద్ధతో ఈ ప్రాజెక్టును చేపట్టారని, ప్రతి ఒక్కరు ఇందులో రిజిస్ట్రేషన్‌ చేసుకునేలా జాగ్రత్తలు తీసుకోవాలని ఉత్తమ్‌ సూచించారు.

నియోజకవర్గాల్లో బూత్‌కమిటీల ఏర్పాటు, ఓటర్‌పేజీ మ్యాపింగ్‌ పద్ధతిని క్రియాశీలంగా చేపట్టాలని, ప్రతి బూత్‌లో సమన్వయకర్తలను ఏర్పాటు చేసి ఓటరు పేజీ బాధ్యతలు అప్పజెప్పాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ ఎస్సీ సెల్‌ కన్వీనర్‌ ప్రసాద్, ఎల్‌డీఎంఆర్‌సీ కోఆర్డినేటర్‌ హర్కర వేణుగోపాల్, చార్మ్స్‌  ఇన్‌చార్జి మదన్‌మోహన్‌ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు