కర్ణాటకలో బోపయ్యే ప్రొటెం స్పీకర్‌

19 May, 2018 11:30 IST|Sakshi
కర్ణాటక అసెంబ్లీలో ప్రొటెం స్పీకర్‌గా బోపయ్య

సాక్షి, న్యూఢిల్లీ : కర్ణాటక అసెంబ్లీ ప్రొటెం(తాత్కాలిక) స్పీకర్‌గా భారతీయ జనతా పార్టీ(బీజేపీ) ఎమ్మెల్యే కేజీ బోపయ్య కొనసాగేందుకు సుప్రీం కోర్టు శనివారం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. కర్ణాటకలో ప్రొటెం స్పీకర్‌గా సభ్యుల్లో సీనియర్‌ను కాకుండా బోపయ్యతో ప్రమాణం చేయించడంపై కాంగ్రెస్‌ పార్టీ సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై శనివారం విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బాబ్డే సీనియర్‌ను కాకుండా వేరే వ్యక్తిని సైతం ప్రొటెం స్పీకర్‌గా నియమించిన ఘటనలు ఉన్నాయని పేర్కొన్నారు.

కాంగ్రెస్‌ పార్టీ తరఫున రాం జెఠ్మలానీ, సింఘ్వీ, కపిల్‌ సిబల్‌లు కోర్టులో వాదనలు వినిపించారు. రాజ్యాంగ పరిషత్‌ ప్రారంభం నుంచి సభ్యుల్లో సీనియర్‌ను మాత్రమే ప్రొటెం స్పీకర్‌గా ఎంపిక చేస్తున్నారని సిబల్‌ కోర్టుకు నివేదించారు. ఇందుకు స్పందించిన న్యాయమూర్తి సీనియర్‌ను ప్రొటెం స్పీకర్‌గా నియమించని ఘటనలు కూడా ఉన్నాయన్నారు. అయితే, బోపయ్య గతంలో అసెంబ్లీలో ప్రొటెం స్పీకర్‌గా వ్యవహరించిన తీరు సరిగా లేదని, బల పరీక్షకు ఆయన అధ్యక్షత వహించకుండా చూడాలని సిబల్‌ న్యాయమూర్తిని అభ్యర్థించారు.

కేవలం ప్రమాణస్వీకారాల వరకూ బోపయ్య ఉంటే అభ్యంతరం లేదని చెప్పారు. దీనిపై స్పందించిన జస్టిస్‌ ఎస్‌ బాబ్డే ఇందుకు బోపయ్య వాదనలు కూడా వినాల్సివుంటుందని పేర్కొన్నారు. ఈ వ్యక్తినే ప్రొటెం స్పీకర్‌గా ఎంపిక చేయాలని గవర్నర్‌ను న్యాయస్థానం ఆదేశించలేదని చెప్పారు. అసెంబ్లీ ప్రొసీడింగ్స్‌ను ఉదయం 11 గంటల నుంచి బలపరీక్ష ముగిసేవరకూ చానళ్లలో లైవ్‌ టెలికాస్ట్‌ చేయాలని కర్ణాటక ప్రభుత్వాన్ని ఆదేశించారు. దీని వల్ల పారదర్శకత ఉండేట్లు చూడొచ్చని అభిప్రాయం వ్యక్తం చేశారు.

గతంలో సుప్రీం మొట్టికాయలు
2008లోనూ బోపయ్య ప్రొటెం స్పీకర్‌గా వ్యవహరించారు. అప్పుడు ఎన్నికైన ఎమ్మెల్యేలతో ఆయనే ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం జగదీశ్‌ షెట్టర్‌ స్పీకర్‌గా నియమితులు కాగా, బోపయ్య డిప్యూటీ స్పీకర్‌ అయ్యారు. షెట్టర్‌ రాజీనామా అనంతరం 2009 నుంచి 2013 మధ్య స్పీకర్‌గా పనిచేశారు. బోపయ్య స్పీకర్‌ పదవిలో ఉండగా బీజేపీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం వచ్చింది.

విశ్వాసపరీక్షలో యడ్యూరప్పను గెలిపించేందుకు 11 మంది బీజేపీ తిరుగుబాటు ఎమ్మెల్యేలు, ఐదుగురు స్వతంత్ర ఎమ్మెల్యేలు సహా మొత్తం 16 మందిపై బోపయ్య అనర్హత వేటు వేశారు. ఈ నిర్ణయాన్ని కర్ణాటక హైకోర్టు కూడా సమర్థించగా, సుప్రీంకోర్టు 2011లో కొట్టివేసింది. బోపయ్య ప్రాథమిక రాజ్యాంగ విలువలు, సిద్ధాంతాలను పట్టించుకోకుండా ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించారనీ, ఆయనకు రాజ్యాంగం, ప్రజాస్వామ్యంపై నమ్మకం లేదని సుప్రీంకోర్టు అప్పట్లో తీవ్రంగా ఆక్షేపించింది.

మరిన్ని వార్తలు