చంద్రబాబు ఓర్వలేకపోతున్నారు : బొత్స

13 Aug, 2019 19:00 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకుంటున్న చారిత్రత్మక నిర్ణయాలు చూసి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఓర్వలేకపోతున్నారని పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. గత ఐదేళ్ల టీడీపీ పాలనలో రాష్ట్రంలో శాంతి భద్రతలు లేకుండా పోయాయని ఆరోపించారు. మంగళవారం విశాఖపట్నంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ..  గత ఐదేళ్లలో రాష్ట్రంలో హత్యలు, దోపిడీలు, దౌర్జన్యాలు జరిగాయని చెప్పారు. అందుకే ప్రజలు చంద్రబాబు పాలనకు చరమగీతం పాడారని అన్నారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వానిది పారదర్శక పాలన అని స్పష్టం చేశారు. తమ ప్రభుత్వంలో తప్పు చేస్తే ఊరుకునే పరిస్థితి ఉండదని హెచ్చరించారు.

ఇంకా ఆయన మాట్లాడుతూ.. ‘ సంక్షేమం, అభివృద్ధి దిశగా సీఎం వైఎస్‌ జగన్‌ ఆలోచనలు ఉన్నాయి. నాలుగు లక్షలుగా పైగా ఉద్యోగాలు కల్పించారు. చంద్రబాబు పాలనలో నదుల అనుసంధానం కాకుండా.. నిధుల అనుసంధానం చేశారు. ఐదేళ్ల పాలనలో ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి చేయలేదు. తోటపల్లి ప్రాజెక్టులో మిగిలిన 10 శాతం పనులను టీడీపీ ప్రభుత్వం పూర్తి చేయలేదు. గత ఏడాది కాలంగా పోలవరం పనుల్లో తట్ట  మట్టి కూడా వేయలేదు. టీడీపీ పాలనలో శాసనసభలో ప్రతిపక్షానికి మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదు. కానీ ఇప్పుడు సభలో ప్రతి సభ్యుడికి మాట్లాడే అవకాశం లభిస్తోంది. చంద్రబాబు పాలనలో అంతా కరువుతో నిండిపోయింది. కానీ వైఎస్‌ జగన్‌ సీఎం అయ్యాక వాతావరణం మారింది.. వర్షాలు పడుతున్నాయి. అన్నా క్యాంటీన్ల పేరుతో టీడీపీ ప్రభుత్వం భారీగా దోపిడీకి పాల్పడిందని ఆరోపించారు. టీడీపీ నాయకులు కోరిన చోట్ల అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేసుకున్నారు. ఒక్కో బిల్డింగ్‌కు రూ. 50 లక్షలు ఖర్చు చేశారు. కానీ తాము పేదలకు ఉపయోగపడేలా క్యాంటీన్లు నిర్వహిస్తాం. గత ఐదేళ్లలో చంద్రబాబు ఒక్క ఇల్లు కూడా నిర్మించలేదు. త్వరలో ఇళ్ల నిర్మాణంలోని అక్రమాలపై విచారణ జరిపిస్తామ’ని తెలిపారు. 

మరిన్ని వార్తలు