చంద్రబాబు.. అమిత్‌ షా.. ఓ రాజగురువు!

16 Jul, 2018 17:23 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం : సీఎం చంద్రబాబు నాయుడు పాలనలో ఏపీలో ఎన్నడూ.. ఎక్కడా అభివృద్ధి జరగలేదని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి బొత్స సత్యనారాయణ విమర్శించారు. బాబు పాలనలో అభివృద్ధి, సంక్షేమం రెండూ అటకెక్కాయని ఎద్దేవా చేశారు. మహిళలకు పది వేలు ఇచ్చామంటూ ఇప్పుడు పచ్చి అబద్ధాలు ఆడుతున్నారని బొత్స మండిపడ్డారు. విశాఖపట్నంలో సోమవారం బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు.

భారతీయ జనతా పార్టీ (బీజేపీ) జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా హైదరాబాద్‌కు వచ్చినప్పుడు చంద్రబాబు రాజగురువును కలిశారని పేర్కొన్నారు. ఎందుకంటే... టీడీపీ, బీజేపీని కలపడానికేనని, ఇది నిజం కాదా అని ఈ సందర్భంగా బొత్స ప్రశ్నించారు. టీడీపీ చేసిన అభివృద్ధి ఏంటో నేరుగా ప్రజలకే చెప్పాలని ఆయన సూచించారు. కాపులకు ఇచ్చిన నిధులకు లెక్కలు చెప్పాలని.. రాష్ట్ర బడ్జెట్‌లో కేటాయింపులు చూపించకుండా 25 వేల కోట్ల రూపాయలను ఏ విధంగా రుణమాఫీ చేశారో చెప్పాలని ప్రశ్నించారు. పెట్రో కెమికల్ కారిడార్‌ను తమ ప్రభుత్వం పూర్తి చేసిందని చంద్రబాబు చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. చంద్రబాబు 13 ఏళ్ల పాలనలో ఒక్క పరిశ్రమను కూడా ఏపీకి తీసుకురాలేదని విమర్శించారు.

రాష్ట్రంలో విద్యార్థులు చదువుకునే పరిస్థితి లేదని ఆరోపించారు. నిరుపేద విద్యార్థుల చదువుల కోసం దివంగత ముఖ్యమత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం ప్రస్తుతం ఏపీలో అమలు కావడం లేదంటూ ఆయన ధ్వజమెత్తారు. విద్యార్థులు చదువుకోలేని పరిస్థితి ఏపీలో నెలకొందని ఆందోళ. డ్వాక్రా అక్కాచెల్లెమ్మలకు ఇప్పటివరకూ రుణమాఫీ కాలేదన్నారు. వారికి 10వేల రూపాయలు ఇచ్చామనడం పచ్చి అబద్ధమని పేర్కొన్న ఆయన.. నగదు ఇచ్చామని నిరూపిస్తే తాను దేనికైనా సిద్ధమని స్పష్టం చేశారు.

>
మరిన్ని వార్తలు