ఐదో రోజూ అడ్డుకున్నారు

7 Mar, 2020 04:48 IST|Sakshi
పార్లమెంటు ప్రాంగణంలో నిరసన సందర్భంగా చేతికి నల్లబ్యాండ్‌ ధరించిన రాహుల్‌ గాంధీ

ఢిల్లీ అల్లర్లు, కాంగ్రెస్‌ ఎంపీల సస్పెన్షన్‌పై విపక్షాల నిరసనలు

పార్లమెంట్‌ ఉభయసభలు మార్చి 11వ తేదీకి వాయిదా

న్యూఢిల్లీ: పార్లమెంట్‌ ఉభయ సభల కార్యకలాపాలను విపక్షాలు వరుసగా ఐదో రోజూ అడ్డుకున్నాయి. ఢిల్లీ అల్లర్లపై, లోక్‌సభ నుంచి కాంగ్రెస్‌ సభ్యులను సస్పెండ్‌ చేయడంపై శుక్రవారం విపక్ష సభ్యులు పెద్ద ఎత్తున నిరసనలు తెలిపారు. దాంతో, పలు వాయిదాల అనంతరం లోక్‌సభ, సభ ప్రారంభమైన పావుగంటకే రాజ్యసభ మార్చి 11వ తేదీకి వాయిదా పడ్డాయి.  

లోక్‌సభ..: ఉదయం 11 గంటలకు సభ ప్రారంభం కాగానే ఢిల్లీ అల్లర్లపై తక్షణమే చర్చ జరపాలని  కాంగ్రెస్, డీఎంకే, ఐయూఎంఎల్‌ తదితర  పార్టీల సభ్యులు వెల్‌లోనికి వచ్చి నినాదాలు చేశారు. ఢిల్లీ అల్లర్లపై 11న చర్చ జరుగుతుందని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా, స్పీకర్‌ స్థానాన్ని అవమానించారని పేర్కొంటూ గురువారం ఏడుగురు కాంగ్రెస్‌ సభ్యులను లోక్‌సభ నుంచి ఈ సమావేశాలు ముగిసే వరకు సస్పెండ్‌ చేయడాన్ని నిరసిస్తూ ఆ పార్టీ సహా పలు విపక్షాలు సభలో నిరసన తెలిపాయి. కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ సహా చాలామంది విపక్ష సభ్యులు తమ చేతులకు నల్లని బ్యాడ్జీలు కట్టుకుని నిరసన తెలిపారు. గందరగోళం కొనసాగుతుండటంతో సభను స్పీకర్‌ స్థానంలో ఉన్న కిరిట్‌ సోలంకీ మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. ఆ తరువాత కూడా విపక్షం శాంతించలేదు. నినాదాల మధ్యనే ఖనిజ చట్టాల(సవరణ) బిల్లు, దివాలా కోడ్‌(సవరణ) బిల్లు ఆమోదం పొందాయి.  

రాజ్యసభ..: సభ ప్రారంభం కాగానే తన శాఖకు సంబంధించిన పత్రాలను సభ ముందుంచేందుకు హోంశాఖ సహాయ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ లేవగానే.. విపక్ష సభ్యులంతా  గట్టిగా నినాదాలు చేశారు. ఢిల్లీ అల్లర్లపై చర్చకు పట్టుబట్టారు.   రాజ్యసభ చైర్మన్‌ వెంకయ్యనాయుడు చేసిన విజ్ఞప్తిని వారు పట్టించుకోలేదు.  దీంతో సభను 11వ తేదీకి వాయిదా వేశారు.

జేబుదొంగకు ఉరిశిక్షా?
కాంగ్రెస్‌ సభ్యుల సస్పెన్షన్‌పై ఆ పార్టీ నేత ఆధిర్‌ రంజన్‌చౌధురి సభలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చిన్న తప్పుకు పెద్ద శిక్ష వేశారన్న ఉద్దేశంతో.. ‘జేబు దొంగకు ఉరిశిక్ష వేయకూడదు’ అని  వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యతో కాంగ్రెస్‌ సభ్యులు ఇబ్బందిగా ముఖం పెట్టగా, కొందరు పెద్దగా నవ్వేశారు. కాంగ్రెస్‌ సభ్యుడు చెప్పిన పోలిక వింతగా ఉందని, ఆ ఎంపీలను జేబుదొంగలతో పోల్చడం దురదృష్టకరమని  మంత్రి ప్రహ్లాద్‌ జోషి పేర్కొన్నారు.  మరోవైపు, తమ ఎంపీల సస్పెన్షన్‌పై రాహుల్‌  నేతృత్వంలో కాంగ్రెస్‌ పార్లమెంట్‌ ప్రాంగణంలోని మహాత్మాగాంధీ విగ్రహం వద్ద నిరసన తెలిపింది.

>
మరిన్ని వార్తలు