నెట్టుకున్నారు.. తోసేసుకున్నారు!

3 Mar, 2020 02:26 IST|Sakshi
లోక్‌సభలో నిరసన తెలుపుతున్న కాంగ్రెస్, ఇతర ప్రతిపక్ష సభ్యులు

ఢిల్లీ అల్లర్లపై లోక్‌సభలో విపక్ష, అధికార సభ్యుల తీరు

ప్రారంభమైన బడ్జెట్‌ మలి దశ పార్లమెంట్‌ సమావేశాలు

న్యూఢిల్లీ: బడ్జెట్‌ సమావేశాల మలి దశ తొలి రోజే లోక్‌సభ దద్ధరిల్లింది. ఢిల్లీ అల్లర్లపై అధికార, విపక్ష సభ్యులు ఆవేశంగా ఒకరినొకరు గట్టిగా తోసుకోవడంతో సభలో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. సభలో నెలకొన్న తోపులాటపై స్పీకర్‌ ఓం బిర్లా ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో సభను నిర్వహించలేనంటూ అశక్తత వ్యక్తం చేశారు. సభలో తమ మహిళా సభ్యులపై అనుచితంగా ప్రవర్తించారంటూ కాంగ్రెస్, బీజేపీ సభ్యులు ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకున్నారు.

పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాల మలి దశ సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఉదయం లోక్‌సభ ప్రారంభం కాగానే.. ఫిబ్రవరి 28వ తేదీన మరణించిన జేడీయూ ఎంపీ బైద్యనాథ్‌ ప్రసాద్‌కు నివాళి అర్పించి, అనంతరం ఆయనకు గౌరవ సూచకంగా సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు.  మధ్యాహ్నం 2 గంటలకు సభ ప్రారంభం కాగానే గందరగోళం మొదలైంది. ఇటీవలి ఢిల్లీ అల్లర్ల అంశాన్ని లేవనెత్తిన కాంగ్రెస్‌ సహా పలు విపక్ష పార్టీల సభ్యులు వెల్‌లోకి దూసుకొచ్చి.. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేయడం ప్రారంభించారు.

హోంమంత్రి అమిత్‌ షా రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. అధికార పక్ష సభ్యులు కూర్చున్న వైపు కూడా వెళ్లి అమిత్‌షా రాజీనామా డిమాండ్‌ ఉన్న నల్లని బ్యానర్‌ను ప్రదర్శించారు.  ‘అల్లర్లకు కారణం వీరే. వీరే రెచ్చగొట్టారు. 1984లోనూ వీరు 3000 మందిని హతమార్చారు. వీరికి శాంతి నెలకొనడం ఇష్టం లేదు’ అని   పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్‌ జోషి కాంగ్రెస్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. దీంతో విపక్ష సభ్యులు మరింత బిగ్గరగా.. ‘వి వాంట్‌ జస్టిస్‌’, ‘అమిత్‌ షా ముర్దాబాద్‌’ అని నినాదాలు చేయసాగారు. ఈ సమయంలో, కాంగ్రెస్‌ సభ్యులు  నల్ల బ్యానర్‌తో  అధికార పక్ష సభ్యుల వైపు వెళ్లారు. బీజేపీ సభ్యులు వీరిని అడ్డుకునేందుకు ప్రయత్నించారు.  కొందరు ప్రతిపక్ష సభ్యులు చేతిలోని కాగితాలను చించి, విసిరేశారు.

ఈ సమయంలో, ఇరు వర్గాల సభ్యుల మధ్య  తోపులాట చోటు చేసుకుంది. గట్టిగా నెట్టివేసుకున్నారు. దీంతో సభను మధ్యాహ్నం 3 గంటల వరకు వాయిదా వేశారు.  3 గంటలకు సభ ప్రారంభమైన తరువాత కూడా పరిస్థితిలో మార్పు రాలేదు. తమవైపు నుంచి వెల్‌లోకి వెళ్లనివ్వకుండా బీజేపీ సభ్యులు విపక్ష సభ్యులను అడ్డుకున్నారు. ఈ సమయంలో బీజేపీ మహిళా ఎంపీ ఒకరు తనపై దాడి చేశారని కాంగ్రెస్‌ ఎంపీ రమ్య హరిదాస్‌ స్పీకర్‌ కు ఫిర్యాదు చేశారు.  గందరగోళం మధ్య సభ పదేపదే వాయిదాపడింది.దీంతో సభను స్పీకర్‌ మంగళవారానికి వాయిదా వేశారు. కాగా, బీజేపీ మహిళా సభ్యులతో కాంగ్రెస్‌ ఎంపీలు అనుచితంగా ప్రవర్తించారని, స్పీకర్‌కు ఫిర్యాదు చేస్తామని మంత్రి స్మృతి ఇరానీ సభ వెలుపల మీడియాకు తెలిపారు.

వాయిదా పడిన రాజ్యసభ
ఢిల్లీ అల్లర్లపై రాజ్యసభలో దుమారం రేగింది. ఢిల్లీ తగులబడుతుంటే కేంద్రం నిద్ర పోతోందని ప్రతిపక్షాలు విమర్శించాయి. హోం మంత్రి రాజీనామా చేయాలని కోరాయి. ప్రతిపక్ష సభ్యుల నినాదాలతో సభ దద్దరిల్లింది. వెల్‌లోకి వచ్చి నిలబడిన సభ్యులను సీట్లలో కూర్చోవాల్సిందిగా అధ్యక్ష స్థానంలో ఉన్న డిప్యూటీ చైర్మన్‌ హరివంశ్‌ పలు పర్యాయాలు కోరినా ఫలితం కనిపించలేదు. దీంతో ఆయన సభను మధ్యాçహ్నానికి వాయిదావేశారు. ఆ తర్వాతా అదే తీరు కొనసాగడంతో చైర్మన్‌ వెంకయ్యనాయుడు సభను మంగళవారానికి  వాయిదా వేశారు. గొడవ మధ్యనే తిరుపతిలోని రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠ్‌ సహా మూడు సంస్కృత వర్సిటీలను సెంట్రల్‌ వర్సిటీలుగా మార్చేందుకు ఉద్దేశించిన బిల్లును ప్రవేశపెట్టారు.

గౌరవంగా వ్యవహరిద్దాం
సభ్యులను సముదాయించేందుకు స్పీకర్‌ ఓం బిర్లా పలు సందర్భాల్లో విఫల యత్నం చేశారు. దేశ ప్రజలు చూస్తున్నారని, గౌరవ సభ్యులుగా హుందాగా వ్యవహరిద్దామని సభ్యులకు సూచించారు. సభ గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత సభ్యులందరిపై ఉందన్నారు. గందరగోళం మధ్యనే మెడికల్‌ టెర్మినేషన్‌ ఆఫ్‌ ప్రెగ్నెన్సీ(అమెండ్‌మెంట్‌) బిల్లు, మినరల్‌ లాస్‌ అమెండ్‌మెంట్‌ బిల్లులను ప్రవేశపెట్టారు. ప్రత్యక్ష పన్నులకు సంబంధించిన ‘వివాద్‌ సే విశ్వాస్‌’ బిల్లుపై చర్చ జరిగింది.

మరిన్ని వార్తలు