అర్హులందరికీ పింఛన్లు ఇస్తాం

8 Feb, 2020 03:59 IST|Sakshi

తొలగించిన పింఛన్ల పునఃపరిశీలన 

అర్హులని తేలితే గత నెల పింఛన్‌ కూడా కలిపి ఇస్తాం

ఏ ఒక్క అర్హునికీ అన్యాయం చేయం

మంత్రి బొత్స సత్యనారాయణ 

సాక్షి, అమరావతి: పింఛన్ల జాబితాలో తొలగించబడిన వారి వివరాలను మరోసారి పరిశీలించి.. అర్హత ఉన్న వారందరికీ తక్షణమే పింఛన్లు మంజూరు చేయాలని ప్రభుత్వం ఆదేశించిందని పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. తాజా పరిశీలనలో అర్హులుగా నిర్థారణ అయిన వారికి గత నెలలో నిలిపివేసిన పింఛన్‌ను మొత్తాన్ని కూడా వచ్చే నెల పింఛన్‌తో కలిపి ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారని చెప్పారు. వెలగపూడిలోని సచివాలయంలో మంత్రి బొత్స శుక్రవారం విలేకరుల సమాలేశంలో మాట్లాడుతూ..  తమది మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి స్ఫూర్తితో నడిచే పేదల అనుకూల ప్రభుత్వమని చెప్పారు. రాష్ట్రంలో ఏ ఒక్క పేదవాడికి అన్యాయం జరగదని స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం కొత్తగా 6.14 లక్షల మందికి పింఛన్లు మంజూరు చేసిందని వెల్లడించారు.

రాష్ట్రంలో 4,16,034 మందిని మాత్రమే అనర్హులుగా గుర్తించి పింఛన్లు తొలగించినట్టు స్పష్టం చేశారు. వారిలో కూడా అర్హులు ఉండొచ్చన్న ఉద్దేశంతో వారందరి వివరాలను మరోసారి పరిశీలిస్తున్నామని చెప్పారు. నెలకు 300 యూనిట్లు పైబడి కరెంటు వినియోగిస్తున్న కేటగిరీలో 8,900మంది పింఛన్లు మాత్రమే తొలగించినట్టు తెలిపారు. కానీ.. ఉమ్మడి కుటుంబాలు, ఇంటి యజమాని, అద్దెకున్న వారికి జాయింట్‌ మీటర్లు ఉండటం వంటి పలు కారణాలతో 300 యూనిట్ల వినియోగం దాటిన వారిని తిరిగి అర్హులుగా గుర్తించి పింఛన్లు జారీ చేయాలని అధికారులను ఆదేశించినట్టు తెలిపారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంటే టీడీపీ రాజకీయ దురుద్దేశాలతో దుష్ప్రచారం చేస్తోందని మంత్రి ధ్వజమెత్తారు. మీడియాను అడ్డం పెట్టుకుని టీడీపీ చేస్తున్న అసత్య ప్రచారాన్ని నమ్మొద్దని ప్రజలను కోరారు. చంద్రబాబు కంటే తమ ప్రభుత్వంలో పెన్షన్ల నిబంధనలను సరళతరం చేశామని వివరించారు.

వికేంద్రీకరణ ప్రక్రియ మొదలైనట్టే..
రాష్ట్రంలో అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధి కోసం చేపట్టిన వికేంద్రీకరణ ప్రక్రియ మొదలైనట్టేనని మంత్రి బొత్స చెప్పారు. చట్టానికి, రాజ్యాంగానికి లోబడి న్యాయస్థానాలకు సంపూర్ణ గౌరవం ఇస్తూనే ప్రభుత్వ విధాన నిర్ణయాలు, కార్యాచరణ ఉంటాయన్నారు. సీఆర్‌డీయే రద్దు, వికేంద్రీకరణ బిల్లులను సెలెక్ట్‌ కమిటీకి పంపే ప్రక్రియ పూర్తి కాలేదని శాసనమండలి చైర్మన్‌ సభలోనే స్వయంగా వెల్లడించారని మంత్రి బొత్స ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. 

అర్హుల గుర్తింపునకు ప్రత్యేక డ్రైవ్‌
రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ సంతృప్త స్థాయిలో పెన్షన్లు ఇవ్వాలనేదే తమ ప్రభుత్వ ఉద్దేశమని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. ఎక్కువమంది పేదలకు ప్రయోజనం చేకూర్చాలనే ఉద్దేశంతో పింఛన్ల మంజూరు మార్గదర్శకాలను మరింత సరళతరం చేసినట్టు చెప్పారు. అర్హత ఉన్నవారు ఎవరైనా పెన్షన్‌కోసం సంబంధిత గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకున్న 5 రోజుల్లో మంజూరు చేస్తామన్నారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. అలాగే తిరుపతిలోని తన నివాసం వద్ద విలేకరులతో మాట్లాడారు. అన్ని అర్హతలుండి.. పెన్షన్‌ రానివారిని గుర్తించేందుకు వారంపాటు స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. తమకు పెన్షన్‌ రాలేదంటూ దరఖాస్తు చేసుకున్నవారి ఇళ్లవద్దకే అధికారులు వస్తారని.. ఎంపీడీవో, మున్సిపల్‌ కమిషనర్లు స్వయంగా వెళ్లి అర్హతలను పరిశీలిస్తారన్నారు. ఇటీవల వలంటీర్ల సర్వేలో అనర్హులుగా పేర్కొంటూ తొలగించిన పెన్షన్లపైనా స్పెషల్‌ డ్రైవ్‌ సందర్భంగా మరోసారి సమగ్ర పరిశీలన జరుగుతుందన్నారు.  

6.14 లక్షల కొత్త పెన్షన్లు ఇచ్చాం..
నవశకం సర్వేలో ప్రతి ఒక్కరి అర్హతలను నిర్ధారణ చేసుకుని ఫిబ్రవరిలో మొత్తం 54.68 లక్షలమందికి పింఛన్లు పంపిణీ చేసినట్టు పెద్దిరెడ్డి తెలిపారు. ఈ నెలలో కొత్తగా 6.14 లక్షల పెన్షన్లను మంజూరు చేశామన్నారు. వలంటీర్ల ద్వారా మొత్తం రూ.1,320 కోట్లను లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి చేతికి అందించి.. పంపిణీలోనూ తమ ప్రభుత్వం రికార్డు సృష్టించిందన్నారు. కియా కార్ల పరిశ్రమ రాష్ట్రం నుంచి మరెక్కడికీ తరలిపోవట్లేదని ఈ సందర్భంగా పెద్దిరెడ్డి స్పష్టం చేశారు. దీనిపై ప్రభుత్వం వివరణ ఇచ్చాక కూడా చంద్రబాబు చెడుగా ప్రచారం చేయడం దురదృష్టకరమన్నారు. ఈ ప్రభుత్వంపై కుట్రపూరితంగానే తొలినుంచీ చంద్రబాబు, ఆయన కొడుకు లోకేష్, టీడీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

మరిన్ని వార్తలు