సమగ్రాభివృద్ధే ప్రభుత్వ విధానం

13 Jan, 2020 05:04 IST|Sakshi

మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టీకరణ  

అనంతపురం: రాష్ట్ర సమగ్ర అభివృద్ధే రాష్ట్ర ప్రభుత్వ విధానమని పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఉద్ఘాటించారు. అనంతపురంలో ఆదివారం నిర్వహించిన వైఎస్సార్‌సీపీ జిల్లా విస్తృతస్థాయి సమావేశానికి జిల్లా ఇన్‌చార్జ్‌ హోదాలో ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా కార్యకర్తలనుద్దేశించి మాట్లాడారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఏ ఒక్క ప్రాంతానికో, ఏ ఒక్క వర్గానికో మేలు చేసేలా పని చేయబోదని స్పష్టం చేశారు. రాష్ట్ర బడ్జెట్‌ రూ.1.75 లక్షల కోట్లు అని, అందులో రూ.లక్షా 9 వేల  కోట్లను రాజధాని నిర్మాణానికి ఖర్చు చేయాలంటే ఎలా సాధ్యమని ప్రశ్నించారు. వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్రలను అభివృద్ధి చేయాలని సీఎం జగన్‌మోహన్‌రెడ్డి కృతనిశ్చయంతో ఉన్నారని, కానీ ఆర్థిక పరిస్థితి ఆ మేరకు లేదన్నారు.

ఇందుకోసం భారీగా డబ్బు సమకూర్చుకోవాల్సి ఉందన్నారు. ఐదేళ్లలో సీఎంగా ఉన్న చంద్రబాబు ఏకంగా రూ.లక్షా 95 వేల కోట్ల అప్పులు చేశారని, అయినా పనికొచ్చే పని ఒక్కటీ చేయలేదని విమర్శించారు. రాయలసీమ ప్రజలు నీటికోసం ధర్నాలు చేస్తుంటే.. చంద్రబాబు అమరావతిలో రేటు కోసం ధర్నాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. అక్కడి నిజమైన రైతుల పట్ల ప్రభుత్వానికి సానుభూతి ఉందని చెప్పారు. దయచేసి చంద్రబాబు ఉచ్చులో పడకండని వారికి విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతమున్న పోటీతత్వాన్ని గుర్తించే ముఖ్యమంత్రి ఇంగ్లిష్‌ మీడియం అమలుకు చర్యలు తీసుకున్నారని బొత్స చెప్పారు. వైఎస్సార్‌సీపీ బలం ఎప్పటికీ ప్రజలేనని, వారి సంక్షేమానికి ఈ ప్రభుత్వం ఏం చేసేందుకైనా సిద్ధమని పేర్కొన్నారు. 

ఏ ముఖం పెట్టుకుని అనంతకు వస్తున్నావ్‌
కరువు జిల్లా అనంత అభివృద్ధిని ఏమాత్రం పట్టించుకోని చంద్రబాబు ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని వస్తున్నట్టని బొత్స ప్రశ్నించారు. ఈ నెల 13న చంద్రబాబు ‘అనంత’ పర్యటన హాస్యాస్పదమన్నారు. అభివృద్ధిని పూర్తిగా విస్మరించిన చంద్రబాబు.. ఇప్పుడు జోలె పట్టుకుని ప్రజల్ని మోసం చేసేందుకు సిద్ధమయ్యారని విమర్శించారు. సమావేశంలో బీసీ సంక్షేమశాఖ మంత్రి శంకరనారాయణ, విప్‌ కాపు రామచంద్రారెడ్డి, ఎంపీలు రంగయ్య, గోరంట్ల మాధవ్, ఎమ్మెల్సీలు ఇక్బాల్, వెన్నపూస గోపాల్‌రెడ్డి పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు