‘బీజేపీలో చేరాలని కోడెల ఎందుకు ప్రయత్నించారు’

19 Sep, 2019 17:46 IST|Sakshi

మంత్రి బొత్స సత్యనారాయణ

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు మరణంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాజకీయం చేస్తున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. కోడెల చనిపోయారన్న కనీస సానుభూతి లేకుండా రాజకీయ లబ్ధి కోసం వెంపర్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీడీపీ అధినేత చంద్రబాబుపై బొత్స సత్యనారాయణ ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా చంద్రబాబుకు పలు ప్రశ్నలు సంధించారు. ‘పార్టీలో పనిచేసే వారికి గౌరవం లేదని కోడెల బాధపడింది నిజమా కాదా? ఆయనను చంద్రబాబు ఎందుకు దూరం పెట్టారు? కోడెల బీజేపీలో చేరాలని ఎందుకు ప్రయత్నించారు? సొంత పార్టీ నేతలే ఆయనపై ఎందుకు ఫిర్యాదు చేశారు? కోడెల సెల్‌ఫోన్‌ మాయంపై బాబు ఎందుకు మౌనంగా ఉన్నారు?’అంటూ మంత్రి ప్రశ్నించారు. 

అంతేకాకుండా కోడెల మృతిపై సీబీఐ దర్యాప్తు చేయాలని బాబు అడగడం హాస్యాస్పదంగా ఉందన్నారు. రాష్ట్రంలో సీబీఐ రాకూడదన్న చంద్రబాబు ఇప్పుడు కోడెల మరణంపై సీబీఐ దర్యాప్తునకు ఎలా డిమాండ్‌ చేస్తున్నారని ప్రశ్నించారు. అదేవిధంగా గవర్నర్‌ వ్యవస్థపై టీడీపీ అధినేత చేసిన అనుచిత వ్యాఖ్యలు అందరికీ గుర్తున్నాయని అన్నారు. కేంద్రానికి గవర్నర్‌ ఏజెంట్‌ అని చంద్రబాబు విమర్శించిన విషయాన్ని గుర్తుచేశారు. అటువంటి విమర్శలు చేసిన బాబు ఇప్పుడు ఏ మొఖం పెట్టుకుని గవర్నర్‌ దగ్గరికి వెళ్లారని ప్రశ్నించారు. ఇదేనా ఆయన 40 ఏళ్ల అనుభవం అంటూ మంత్రి బొత్స సత్యనారాయణ ఎద్దేవా చేశారు. కాగా కోడెల శివప్రసాదరావు మృతిపై విచారణ జరిపించాలంటూ చంద్రబాబు ఇవాళ గవర్నర్‌కు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.

చదవండి:
‘కోడెలను తిట్టించిన చంద్రబాబు’ 
 
అందుకే కోడెల ఆత్మహత్య చేసుకున్నారు
కోడెల మృతి: బీజేపీ అధికార ప్రతినిధి సంచలన వ్యాఖ్యలు

మరిన్ని వార్తలు