దమ్ముంటే ఇంగ్లిష్‌కు వ్యతిరేకమని ప్రకటించగలరా? 

19 Nov, 2019 05:22 IST|Sakshi
మాట్లాడుతున్న మంత్రి బొత్స. చిత్రంలో మంత్రి శంకరనారాయణ

చంద్రబాబుకు మంత్రి బొత్స సవాల్‌  

అనంతపురం సెంట్రల్‌: విద్యార్థుల భవిష్యత్‌ దృష్ట్యా పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియం ప్రవేశపెడుతుంటే చంద్రబాబు వక్రీకరిస్తున్నారని, దమ్ముంటే మీరు ఇంగ్లిష్‌కు వ్యతిరేకమని ప్రకటించాలని మంత్రి బొత్స సత్యనారాయణ సవాల్‌ విసిరారు. అనంతపురం జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి శంకరనారాయణ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి స్థానిక పోలీసు కాన్ఫరెన్స్‌ హాల్లో విలేకరులతో మాట్లాడారు. మాతృభాషను కాపాడుకోవాల్సిన అవసరం ఎంత ఉందో.. మనిషి మనుగడ, భృతికి ఇంగ్లిష్‌ అంతే అవసరమన్నారు.

తాము ఇంగ్లిష్‌ మీడియానికి వ్యతిరేకమని ధైర్యంగా చెప్పలేని వ్యక్తులు మతమార్పిడి పేరిట వక్రభాష్యం చెప్పడం మంచిది కాదని హితవు పలికారు. మార్కెట్‌యార్డు కమిటీలు, దేవాలయాల్లో నామినేటెడ్‌ పోస్టులకు రిజర్వేషన్‌ అమలు చేసి దేశ చరిత్రలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చిరస్థాయిగా నిలిచిపోనున్నారని కొనియాడారు. చంద్రబాబు లోపభూయిష్ట విధానాలతో సింగపూర్‌ కంపెనీ తాము కొనసాగలేమని మ్యూచువల్‌ పద్ధతిలో వైదొలుగుతుంటే, రాష్ట్రంలో పెట్టుబడులు వెనక్కుపోతున్నాయని గగ్గోలు పెట్టడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రభుత్వం గద్దెదిగే నాటికి రూ.48 వేల కోట్లు కేవలం బిల్లుల రూపంలోనే బకాయి పెట్టిన చంద్రబాబు లాంటి ముఖ్యమంత్రిని తానెప్పుడూ చూడలేదన్నారు. 

మరిన్ని వార్తలు