ఏడాదిలో చెప్పినవన్నీ చేసి చూపించాం

1 Jun, 2020 04:54 IST|Sakshi

దమ్మూ, ధైర్యం ఉన్న నాయకుడు సీఎం వైఎస్‌ జగన్‌ 

కోడిగుడ్డుపై ఈకలు పీకడమే చంద్రబాబు పని 

నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ విషయంలో టీడీపీ కోర్టుకు ఎందుకెళ్లింది? 

నిమ్మగడ్డ ఆర్డర్‌ ఎందుకు వెనక్కి తీసుకున్నారో యనమల చెప్పాలి 

అడ్వకేట్‌ జనరల్‌ చట్టం తెలియని వ్యక్తేమీ కాదు.. న్యాయకోవిదుడు 

మంత్రి బొత్స సత్యనారాయణ 

సాక్షి, అమరావతి: ప్రజలకు చెప్పినవన్నీ తన ఏడాది పాలనలో చేసి చూపించిన దమ్మూ ధైర్యం ఉన్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అని.. టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం కోడిగుడ్డుపై ఈకలు పీకడమే పనిగా పెట్టుకున్నారని పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎన్నికల మేనిఫెస్టోను భగవద్గీత, ఖురాన్, బైబిల్‌గా భావించి అందులో 90 శాతం హామీలను తొలి ఏడాదిలోనే పూర్తిచేశామని ఆయనన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం మీడియాతో బొత్స మాట్లాడారు. అమ్మఒడి, ఆరోగ్యశ్రీ, రైతుభరోసా వంటి అనేక పథకాలను అమలుచేయడంతో పాటు నిరుద్యోగులకు సుమారు 4.5 లక్షల ఉద్యోగాలను కల్పించి ప్రజల గడప వద్దకే పథకాలను అందజేశామన్నారు. బొత్స ఇంకా ఏమన్నారంటే.. 

► నేను వైఎస్‌ రాజశేఖరరెడ్డి, రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వాల్లో మంత్రిగా ఉన్నాను. గతంలో ఎన్నడూ లేని విధంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ తన వాగ్దానాలను నెరవేర్చి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు.  
టీడీపీ అధికారంలో ఉన్నపుడు మేనిఫెస్టోలోని ఒక్క హామీనైనా నెరవేర్చిందా?  
► మేనిఫెస్టోలో చెప్పినవన్నీ మేం నెరవేర్చిన విషయం వాస్తవమా.. కాదా..  
► మా పథకాలు అందుతున్నాయా లేదా? పింఛన్లు ఒకటో తేదీన అందుతున్నాయా లేదా? అని టీడీపీ కార్యకర్తలనే అడగండి చంద్రబాబూ..   
► నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ వ్యవహారంపై యనమల రామకృష్ణుడు, చంద్రబాబు ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. రమేష్‌ కోర్టుకు వెళ్లవచ్చు.. కానీ, టీడీపీ హైకోర్టుకు ఎందుకెళ్లింది? నిమ్మగడ్డపై వ్యక్తిగత అభిమానంతో వెళ్లిందా? 
► అడ్వకేట్‌ జనరల్‌ ప్రజల ముందుకు వచ్చి చెప్పడం తప్పంటున్నారు. మా అడ్వకేట్‌ జనరల్‌ చట్టం తెలియని వ్యక్తేమీ కాదు, న్యాయకోవిదుడు. తీర్పుపై కొందరు వక్రభాష్యం చెప్పడం మంచి పద్ధతి కాదు.  
► ఏజీ మాట్లాడింది తప్పని యనమల అంటున్నారు. మరి నిన్న నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ మొదట ఇచ్చిన ఆర్డర్‌ను ఎందుకు వెనక్కి తీసుకున్నారో యనమల సమాధానం చెప్పాలి. దాని వెనుక గూఢార్థం ఏమిటి? ఎందుకంత తత్తరపాటు? 
► మాట్లాడటానికి మీకు ఎంత హక్కుందో మాకు అంతే హక్కుంది. మీరు మాట్లాడితేనే అవి వేదాలు, సూక్తులు, ప్రవచనాలా?  
► పేదలకు ఇళ్ల పట్టాలిస్తుంటే కోర్టులకు వెళ్లి స్టే తెప్పిస్తారు. రోడ్డు పైన తప్పతాగి వ్యవహరించే వారిపై ఎంక్వయిరీలు వేయిస్తారు.  
► లాక్‌డౌన్‌లో మా ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తలు సహాయ కార్యక్రమాలు చేపడితే కోర్టుకు వెళ్లి అడ్డుకుంటారు. కానీ, చంద్రబాబు హైదరాబాద్‌ నుంచి అట్టహాసంగా వస్తూ వందలాది మందితో స్వాగతం పలికించుకుని లాక్‌డౌన్‌ నిబంధనలను ఉల్లంఘించారు.  
► దీనిపై కూడా కోర్టుకు వెళ్తే ఏం తీర్పులు ఇచ్చాయో చూడండి.  
► న్యాయస్థానాలంటే మాకు అపారమైన గౌరవం ఉంది. ఈ విషయంలో చంద్రబాబు మంచేంటి.. మా ఎమ్మెల్యేలు చేసిన తప్పేంటి?  

మరిన్ని వార్తలు