ఒక్క రాజధానిలో వెయ్యి కుంభకోణాలు

2 Sep, 2019 03:45 IST|Sakshi

మున్సిపల్‌ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ధ్వజం 

టీడీపీ ప్రభుత్వం అమరావతిని దోపిడీకి రాజధానిగా మార్చింది 

సాక్షి, అమరావతి: రాష్ట్ర రాజధాని అమరావతిలో వెయ్యి కుంభకోణాలు జరిగినట్లు కొద్ది రోజులుగా సీఆర్‌డీఏ సమీక్షల్లో తేటతెల్లం అవుతోందని, రాజధాని చుట్టూ భూకుంభకోణాలు అల్లుకుని ఉన్నాయని రాష్ట్ర మున్సిపల్‌ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఆరోపించారు. ఆయన ఆదివారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. రాజధాని అభివృద్ధి పేరిట భారీ దోపిడీ జరిగిందని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్వహిస్తున్న సమీక్షల్లో అనేక కుంభకోణాలు బయటపడుతున్నాయని తెలిపారు. రాజధాని చుట్టూ భూకుంభకోణం, సింగపూర్‌ కంపెనీలకు భూములు ఇవ్వడంలో కుంభకోణం, నీటి పైపులైన్ల నిర్మాణం, విద్యుత్‌ స్తంభాలు, తాత్కాలిక అసెంబ్లీ నిర్మాణం.. ఇలా లెక్కలేనన్ని కుంభకోణాలున్నాయని అన్నారు. అసలు ప్రతిపక్ష నేత చంద్రబాబు నివాసమే ఒక పెద్ద కుంభకోణమని విమర్శించారు. టీడీపీ ప్రభుత్వం అమరావతిని దోపిడీకి రాజధానిగా మార్చేసిందని మండిపడ్డారు. కుంభకోణాలపై చర్యలకు ఉపక్రమిస్తే సహజంగానే చంద్రబాబు తట్టుకోలేరని, ఆయన పుత్రరత్నం అంతకన్నా తట్టుకోలేరని ఎద్దేవా చేశారు. 

చంద్రబాబు ఆర్థిక లావాదేవీలకు పవన్‌ మద్దతు 
‘‘రాజధానిలో జరిగిన దోపిడీపై చర్యలు తీసుకోవాల్సిందేనని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ప్రజాధనానికి జవాబుదారీగా ఉండాల్సిన వారే దారుణంగా దోపిడీకి పాల్పడితే చర్యలు తీసుకోవాల్సిందేనని ఎవరైనా అంటారు. కానీ, జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ మాత్రం తెలుగుదేశం పార్టీకి ఎందుకు వత్తాసు పలుకుతున్నాడో... దోపిడీని పక్కదోవ పట్టించేందుకు ఎందుకు ప్రయత్నిస్తున్నాడో అర్థం కావడం లేదు. పవన్‌ కల్యాణ్‌ మైండ్‌సెట్, జనసేన పార్టీ అజెండా మారలేదనిపిస్తోంది. జనసేన పార్టీ అవినీతిని ప్రోత్సహిస్తున్నట్లుగా ఉంది. ఎవరి తీరు ఏమిటో ప్రజలు గమనిస్తున్నారు. టీడీపీ ప్రభుత్వంలో జరిగిన అవినీతిని పవన్‌ కల్యాణ్‌ ఎందుకు ప్రశ్నించలేదు? గత ఐదేళ్లలో రాజధాని ప్రాంతంలో జరిగిన దోపిడీ గురించి ఆయన ఒక్క ముక్క కూడా ఎందుకు మాట్లాడలేదు? చంద్రబాబుకు, ఆయన చేసిన ఆర్థిక లావాదేవీలకు జనసేన అధ్యక్షుడు మద్దతు ఇస్తున్నాడు. ఇవన్నీ చూస్తుంటే చంద్రబాబు అవినీతిలో పవన్‌ కల్యాణ్‌కు కూడా ఏమైనా భాగస్వామ్యం ఉందా? అని కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద పవన్‌ కల్యాణ్‌ కుంభకోణాలకు అనుకూలం అనేది ప్రజలకు అర్థమైపోయింది. పవన్‌ కల్యాణ్‌ నివాసం కోసం 2 ఎకరాల భూమిని ఇచ్చింది, చంద్రబాబుకు అక్రమ నివాస భవనం ఇచ్చింది ఒక్కరే. వీరిద్దరికీ ఆర్థిక సంబంధాలున్నాయని స్పష్టం కావడానికి ఈ బంధం చాలు. ఆర్థిక సంబంధాలకు తోడు రాజకీయ బంధం, తెరవెనుక స్క్రిప్టు సంబంధాలున్నాయి’’ అని బొత్స సత్యనారాయణ ఆరోపించారు. 

టీడీపీ–బి పార్టీ జనసేన 
‘‘పోలవరం ప్రాజెక్టు నిర్మాణ వ్యయం తగ్గించి ప్రజలపై భారం పడకుండా చూడాలన్న ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకుంటే పవన్‌ కల్యాణ్‌ నవయుగ కాంట్రాక్టర్‌ను సమర్థించడంలో అర్థం ఏమిటి? విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాలను(పీపీఏ) సవరిస్తే ప్రజలకు ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. ఈ అంశంలో కూడా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి పవన్‌ కల్యాణ్‌ ఎందుకు మద్దతు ఇవ్వడం లేదు? ఇలాంటి అంశాలన్నీ చూస్తే చంద్రబాబుకు నారాయణ అనే వ్యక్తి భూములు, ఆస్తులపరంగా బినామీ అయితే రాజకీయ పరంగా పవన్‌ కల్యాణ్‌ బినామీ అనేది స్పష్టమవుతోంది. కొత్త పలుకు అనే రాధాకృష్ణ చిలుక పలుకులు పలుకుతూ ఉంటారు. పదేళ్ల కాలంలో బొత్స విజయనగరం జిల్లాను ఏ మేరకు అభివృద్ధి చేశారో చూడండి అంటున్నారు. మేము విశ్వాసంతో చెబుతున్నాం. చెట్టును, పుట్టను అడిగినా ఏ రంగంలో ఎంత అభివృద్ధి జరిగిందో తెలుస్తుంది. జనసేన పార్టీ ప్రజల కోసం మాట్లాడటం లేదు, టీడీపీ–బి పార్టీగా మాట్లాడుతోంది’’ అని మంత్రి బొత్స దుయ్యబట్టారు. రాజధానిలో జరిగిన కుంభకోణాలు, అక్కడ వరద రాగల పరిస్థితులు, ఇతర ప్రతికూల అంశాలన్నీ పరిశీలిస్తున్నామని, ఆ తరువాతే ఒక అభిప్రాయానికి వస్తామని ఆయన ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.   

మరిన్ని వార్తలు