బాబూ.. రాజధానిలో ఏం చూడటానికొస్తావ్‌? 

27 Nov, 2019 05:02 IST|Sakshi
మాట్లాడుతున్న మంత్రులు బొత్స సత్యనారాయణ, వెలంపల్లి శ్రీనివాసరావు

ప్రతిపక్ష నేత చంద్రబాబుపై మంత్రి బొత్స ఫైర్‌ 

కార్పొరేటర్‌గా గెలవలేని వ్యక్తి జగన్‌ గురించి మాట్లాడటమా: మంత్రి వెలంపల్లి

సాక్షి ప్రతినిధి విజయనగరం: ప్రతిపక్ష నేత చంద్రబాబు రాజధానిలో ఏం చూడటానికి వస్తారని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. విజయనగరంలో మంగళవారం మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావుతో కలిసి బొత్స మీడియాతో మాట్లాడారు. ఐదేళ్లలో చంద్రబాబు వల్ల ఏర్పడ్డ లోటును మరో ఇరవై ఏళ్లలో కూడా తీర్చలేమని అన్నారు. ఏ రకంగా దోచుకుందామనే రీతిలో ఆయన పాలన సాగించారని ధ్వజమెత్తారు. రాష్ట్రాన్ని శ్మశానంగా మార్చేశారని మండిపడ్డారు. రాజధానిని పవిత్ర దేవాలయం అంటున్న ఆయన ఐదేళ్లలో ఏం చేశారని నిలదీశారు. రాజధానిని నిర్మించుకోవాలనే ధ్యాస లేదా అని ప్రశ్నించారు.

వేల కోట్ల రూపాయలు అప్పులు చేసి రాజధానిలో ఏ సంపద సృష్టించారో చెప్పాలన్నారు. సింగపూర్‌ కన్సార్టియంతో తాను అనేకసార్లు చర్చలు జరిపానని, దానితో జరిగిన ఒప్పందమే లోపభూయిష్టమని చెప్పారు. ఇరువురి అంగీకారం మేరకే సింగపూర్‌ కన్సార్టియం తప్పుకుందని వివరించారు. గత ప్రభుత్వంలా ప్రజాధనాన్ని దుబారా చేయొద్దని సీఎం వైఎస్‌ జగన్‌ సూచించారన్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు ఉంటాయన్నారు. మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రజల్లో ఉన్నామనిపించుకోవడానికే లోకేశ్‌ ట్విట్టర్‌లో ఏదో ఒకటి పెడుతున్నారనీ, అవి చూస్తే నవ్వొస్తోందన్నారు. కార్పొరేటర్‌గా కూడా గెలవలేని వ్యక్తి సీఎం గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు.

మరిన్ని వార్తలు