బిల్లులను అప్రజాస్వామికంగా అడ్డుకున్నారు

27 Jan, 2020 05:34 IST|Sakshi

మంత్రి బొత్స సత్యనారాయణ

మండలి పరిణామాలను రామోజీ సమర్థిస్తున్నారా? వ్యతిరేకిస్తున్నారా?

చేతిలో మీడియా ఉందని ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తే ఎలా?

సాక్షి, అమరావతి: ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యేలతో కూడిన శాసనసభ బిల్లులను ఆమోదించి పంపితే శాసన మండలిలో అప్రజాస్వామికంగా, నిబంధనలకు విరుద్ధంగా అడ్డుకోవడాన్ని మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్రంగా తప్పుబట్టారు. ఆదివారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. పరిపాలన వికేంద్రీకరణ బిల్లు, ఎస్సీ కమిషన్‌ బిల్లు, ఇంగ్లిష్‌ మీడియం బిల్లును తెస్తే శాసనమండలిలో వ్యతిరేకించారన్నారు. మండలి అవసరమా.. అనే చర్చ రాష్ట్రమంతా జరుగుతోందన్నారు. రాష్ట్ర వ్యాప్త చర్చ కోసమే రెండు రోజులు గడువు ఇచ్చామన్నారు. ఎమ్మెల్సీలను ప్రలోభ పెడుతున్నారంటూ రెండు రోజులుగా ఈనాడు, ఆంధ్రజ్యోతిలో తప్పుడు కథనాలు రాస్తున్నారని మండిపడ్డారు. 1983లో టీడీపీకి బలం లేనప్పుడు ఆ పార్టీ వ్యవహరించిన తీరును బొత్స గుర్తు చేశారు. ప్రస్తు్తతం శాసన మండలిలో జరుగుతున్న పరిణామాలను ఈనాడు అధిపతి రామోజీరావు సమర్థిస్తున్నారో? వ్యతిరేకిస్తున్నారో? చెప్పాలని నిలదీశారు. ఎన్టీఆర్‌ హయాంలో మండలి రద్దును ఈనాడు సమర్థించిందన్నారు. ఇప్పుడు ఆదే ఈనాడు శాసనమండలి రద్దును వ్యతిరేకిస్తోందన్నారు. మండలిలో నిబంధనలను తుంగలో తొక్కడం రామోజీరావుకి కనపడట్లేదా అని నిలదీశారు. బాబు విధానాలకు రామోజీ కొమ్ము కాస్తున్నారని విమర్శించారు.  

వెన్నుపోటుకు బ్రాండ్‌ అంబాసిడర్లు బాబు, యనమల: చంద్రబాబు, యనమల రామకృష్ణుడు వెన్నుపోటుకు బ్రాండ్‌ అంబాసిడర్లలాంటి వారని బొత్స చెప్పారు. అందుకే ఎన్నికల్లో చంద్రబాబుకు ప్రజలు బుద్ధి చెప్పారని విమర్శించారు. టీడీపీ ఎమ్మెల్సీలకు రూ. 5 కోట్లు, రూ.10 కోట్లు ఎందుకిస్తాం? వాళ్లేమైనా ప్రజా ఆమోదం ఉన్న నేతలా? అని ప్రశ్నించారు. లోకేశ్‌ ప్రత్యక్ష ఎన్నికల్లో గెలవలేడు కాబట్టి.. మండలి రద్దయితే తన కుమారుడి పదవి పోతుందని చంద్రబాబు భయపడుతున్నారని చెప్పారు. స్వార్థ ప్రయోజనాలే తప్ప చంద్రబాబుకు ప్రజా ప్రయోజనాలు పట్టవన్నారు. మండలి చైర్మన్‌ షరీఫ్‌ టీడీపీ కార్యకర్తలా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. సూచనలు చేయాల్సిన మండలి.. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడం బాధాకరం అన్నారు. మండలిలో రాజ్యాంగానికి తూట్లు పొడవడంపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఆవేదన చెందారని  చెప్పారు. ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబు ఎలా అడ్డంగా దొరికిపోయారో, టీడీపీ ప్రభుత్వంలో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలను ఎలా కొనుగోలు చేశారో ప్రజలు చూశారని అన్నారు.

మరిన్ని వార్తలు