పాజిటివ్‌ కేసులు దాస్తే దాగుతాయా?

17 Apr, 2020 19:42 IST|Sakshi

చంద్రబాబు వ్యాఖ్యలపై మంత్రి బొత్స మండిపాటు

ప్రజల ఆరోగ్యమే మా ప్రభుత్వ లక్ష్యం: బొత్స

సాక్షి, విజయవాడ: ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలను మున్సిపల్‌ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్రంగా ఖండించారు. కరోనా పాజిటివ్‌ కేసులు దాస్తే దాగుతాయా అని సూటిగా ప్రశ్నించారు. ఆయన శుక్రవారమిక్కడ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. చంద్రబాబు వ్యాఖ్యలు దురదృష్టకరం. చంద్రబాబు ఆయన కుమారుడు నారా లోకేష్‌ హైదరాబాద్‌ ఉండి ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారు. ఇది ఆయన దివాళకోరుతనానికి నిదర్శనం. విశాఖలో కరోనా పాజిటివ్‌ కేసులు దాచిపెడుతున్నామని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. (కరోనా టెస్ట్ చేయించుకున్న సీఎం జగన్)

పాజిటివ్‌ వస్తే దాచుకునే పరిస్థితి ఉందా? అది ఎంత ప్రమాదకరమో అందరికీ తెలుసు. హైదరాబాద్‌లో ఎక్కువ కేసులు వచ్చాయని రాజధాని మారుస్తారా? విశాఖకు కరోనా రావాలని చంద్రబాబు కోరుకుంటున్నారా? కరోనా పరీక్షలు చేసి కేసులు దాచిపెట్టాల్సిన అవసరం ప్రభుత్వానికి లేదు. విశాఖలో పాజిటివ్ కేసులు రాకపోతే వచ్చాయని ప్రభుత్వం ఎలా చెప్తుంది. చంద్రబాబు రాజధానికి కరోనాకు ముడిపెడుతున్నారు. ప్రజల ఆత్మస్థైర్యం దెబ్బతీసేలా ఆయన మాట్లాడుతున్నారు. టెలి కాన్ఫెరెన్స్ పెట్టి ప్రభుత్వంపై చంద్రబాబు  బురద చల్లాలని చూస్తున్నారు. (కరోనాను జయించి.. క్షేమంగా ఇంటికి..)

విశాఖలో పాజిటివ్‌ కేసులు ఉంటే చంద్రబాబు చూపించాలి. ఆయన ఊకదంపుడు ఉపన్యాసాలు మానుకుంటే మంచిది. ఇప్పటికైనా  సామాన్యులకు న్యాయం జరిగేలా చంద్రబాబు వ్యవహించాలి. మహారాష్ట్రలో లాగా ఏపీలో అధికంగా కేసులు నమోదు కావాలని టీడీపీ కోరుకుంటున్నట్లుంది. రాష్ట్రంలో రోజువారీగా కరోనా కేసుల వివరాలు  విడుదల చేస్తున్నాం. అలాగే కరోనా నియంత్రణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు కన్నా లక్ష్మీనారాయణకు తెలియకపోతే తెలుసుకోవాలి. (ఇదేం పెళ్లి తంతు.. ఇప్పుడు అవసరమా!)

ప్రజల భద్రత కోసం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రతిరోజూ సమీక్ష చేస్తున్నారు. ప్రజల ఆరోగ్యమే మా ప్రభుత్వ లక్ష్యం. కరోనా పరీక్షల కోసం పూర్తిస్థాయిలో ల్యాబ్‌లను సిద్ధం చేశాం. రోజుకు 2వేలమందికి పరీక్షలు నిర్వహించేలా ఏర్పాట్లు చేశాం. వాలంటీర్‌ వ్యవస్థ ద్వారా సమగ్ర కుటుంబ సర్వే నిర్వహిస్తున్నాం. ప్రతి ఒక్కరి ఆరోగ‍్య పరిస్థితిని సమీక్షిస్తున్నాం. అవసరమైన వారికి వైద్య సేవలు అందిస్తున్నాం. నిత్యావసర సరుకులను అందరికీ అందుబాటులో ఉంచాం. 

అలాగే రైతులకు మద్దతు ధర లభించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం దెబ్బతినకుండా గిట్టుబాటు ధర లభించేలా చర్యలు తీసుకుంటున్నాం. కేంద్రంతో కలిసి రాష్ట్ర అధికారులు సమన్వయంతో పని చేస్తున్నారు. కేంద్ర ప్రభుత‍్వం సూచనలకు అనుగుణంగా అన్ని చర్యలు తీసుకున్నాం. మెప్పా, ఆప్కో ద్వారా మాస్కుల ఉత్పత్తి చేస్తున్నాం. స్వయం సహాయక సంఘాల నుంచి మన్నికైన మాస్కులు ఉత్పత్తి జరుగుతుంది. ఏపీలో మొత్తం 16 కోట్ల మాస్కులు పంపిణీ చేయబోతున్నాం’ అని తెలిపారు.

మరిన్ని వార్తలు