‘చంద్రబాబు మోసాలకు మరోసారి బలికావొద్దు’

16 Sep, 2018 14:17 IST|Sakshi

విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ప్రజా సమస్యలను గాలి కొదిలేసిన ముఖ్యమంత్రి చంద‍్రబాబు నాయుడుపై వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. సందర్భం ఉన్నా లేకపోయినా ప్రజలను మభ్యపెడుతూ పబ్బం గడుపుకుంటున్న చంద్రబాబు గొప్పలు చెప్పుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. తోటపల్లి ప్రాజెక్టు పనులను గత ప్రభుత్వం 89 శాతం పూర్తి చేస్తే, తానే చేశానని చంద్రబాబు చెప్పుకోవడం సిగ్గు చేటన్నారు. దీనిలో భాగంగా మరోసారి చంద్రబాబు మోసాలకు బలికావొద్దని ప్రజలకు బొత్స విజ్ఞప్తి చేశారు. పార‍్లమెంట్‌, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి వస్తాయని ప్రగల్భాలు పలికిన చంద్రబాబు..ముందస్తు ఎన్నికలపై తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి మాట్లాడితే తప్పా అని ప్రశ్నించారు. తమ పార్టీ నేతల్ని సమాయత్తం చేసు​కోవడం కోసం జగన్‌ మాట్లాడితే దాన్ని తప్పుపడుతుండటం ఎంతవరకూ సమంజసమన‍్నారు.  

ఇక్కడ చంద్రబాబుకో న్యాయం.. ఎదుటవాళ్లకో న్యాయమా? అని బొత్స నిలదీశారు. ‘బాబు మాట్లాడితే నీతి.. మేము మాట్లాడితే అసత్యమా. 16 లక్షల అగ్రిగోల్డ్‌ బాధితుల జీవితాలతో ఆడుకున్నారు. అగ్రిగోల్డ్‌ బాధితులందరినీ సర్వనాశనం చేశారు. నాలుగున్నరేళ్లలో చంద్రబాబు ఉద్ధరించింది లేదు. ఎన్నికలు ఎప్పుడొస్తాయని ప్రజలు ఎదురుచూస్తున్నారు. మీ అనుభవం, మీ తత్వం రాష్ట ప్రజలు తెలుసు. వెన్నుపోటు పొడవడం మీకు వెన్నతో పెట్టిన విద్య. అన్నింటినీ మ్యానేజ్‌ చేయడంలో చంద్రబాబు దిట్ట. వైఎస్సార్‌సీపీ ఓటేస్తే బీజేపీకి వేసినట్లు ఎలా అవుతుంది. మరి టీడీపీ ఓటేస్తే సోనియా గాంధీకి వేసినట్లా?, వైఎస్‌ జగన్‌ది మాటమీద  నిలబడే తత్వం. రాజన్న రాజ్యంకోసం ప్రజలు ఎదురుచూస్తున్నారు’ అని బొత్స పేర్కొన్నారు.
 

మరిన్ని వార్తలు