హోదా కోసం ఏనాడైనా లేఖ ఇచ్చావా?

30 Dec, 2018 04:46 IST|Sakshi

29 సార్లు ప్రధానిని కలిశానన్నావ్‌ 

ఒక్క లేఖ ఇచ్చినట్టు నిరూపించినా రాజకీయ సన్యాసం చేస్తా

చంద్రబాబుపై వైఎస్సార్‌ సీపీ సీనియర్‌ నేత బొత్స ధ్వజం

సాక్షి, విశాఖపట్నం:  ‘నాలుగున్నరేళ్లలో ప్రధాని నరేంద్రమోదీని 29 సార్లు కలిశానని నువ్వే చెప్పుకున్నావ్‌.. వెళ్లిన ప్రతిసారీ నీ కేసులు.. నీ కాంట్రాక్టుల కోసం మాట్లాడు కున్నావే తప్ప ఏనాడైనా ప్రత్యేక హోదా కావాలని కోరుతూ ఒక్క లేఖయినా ప్రధానికి ఇచ్చావా?’ అని వైఎస్సార్‌ సీపీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ సీఎం  చంద్రబాబును ప్రశ్నించారు. ‘రాష్ట్ర ప్రయోజనాల కోసం నువ్వు ప్రధానికి ఇచ్చానని చెబుతున్న లేఖలన్నీ బహిర్గతం చేయ్‌..దాంట్లో ‘హోదా’ అన్న పదం ఉంటే నేను రాజకీయ సన్యాసం చేస్తా..నువ్వేం చేస్తావో చెప్పు’ అని బొత్స  సవాల్‌ విసిరారు.

పార్టీ విశాఖ కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు.  ‘ప్రత్యేక హోదా వద్దు.. ప్రత్యేక ప్యాకేజీయే ముద్దు అంటూ ప్యాకేజీ కోసం వెంపర్లాడిన నువ్వు హోదా కోసం ధర్మపోరాటం చేస్తున్నావంటే నమ్మేందుకు రాష్ట్ర ప్రజలు సిద్ధంగా లేరని’ అన్నారు. విభజన హామీల్లో పేర్కొన్న బుందేల్‌ ఖండ్‌ ప్యాకేజీ కావాలని ఏనాడు అడగలేదని, రైల్వే జోన్, కడప స్టీల్‌ ప్లాంట్‌ కోసం ఏనాడూ ఉద్యమించలేదని చెప్పారు. ఏపీకి ప్రత్యేక హైకోర్టుకు తగిన మౌలిక సదుపాయాలు కల్పించకుండా ఏర్పాటుకు అనుకూలంగా అఫిడవిట్‌ ఇవ్వడం ఎంతవరకు సమంజసమని బొత్స ప్రశ్నించారు.  

హైదరాబాద్‌లో ఉంటే ఓటుకు నోటు కేసులో ఎక్కడ జైలుకెళ్లాల్సి వస్తుందోననే ఆందోళనతోనే హైకోర్టు విడగొట్టేందుకు బాబు అఫిడివిట్‌ ఇచ్చినట్టు  అర్థమవుతోందన్నారు. వృద్ధి రేటు విషయంలో బాబు తీరు  పోసాని కృష్ణమురళి తీసిన రాజు గారి చేపల చెరువు సినిమాలా కన్పిస్తోందన్నారు. కడప స్టీల్‌ ప్లాంట్‌ విభజన హామీల్లో ఒకటని, దాన్ని నిర్మించాల్సిన బాధ్యత కేంద్రానిదేనని కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి సాధించుకోవల్సింది పోయి కడప స్టీల్‌ప్లాంట్‌ తానే నిర్మించేస్తానంటూ శంకుస్థాపన చేయడం విడ్డూరంగా ఉందన్నారు.

ఒక్క పవర్‌ ప్లాంట్‌ నిర్మించి.. ఒక్క యూనిట్‌ అదనంగా ఉత్పత్తి చేసిన దాఖలాలు లేవు కానీ, మిగులు విద్యుత్‌ సాధించినట్టు  గొప్పలు చెబుతున్నారని విమర్శిం చారు. విశాఖలో 23 వేల మందికి ఉపాధి కల్పిస్తున్న బ్రాండిక్స్‌ దివంగత వైఎస్‌ హయాంలో వచ్చింది కాదని చెప్పగలవా అని ప్రశ్నించారు. ఈసారి వైఎస్సార్‌ సీపీ అధికారంలోకి రాకుండా ఏ శక్తులు అడ్డుకోలేవన్నారు. విశాఖ, కాకినాడ పార్లమెంటు జిల్లా అ«ధ్యక్షులు తైనాల విజయకుమార్, కురసాల కన్నబాబు, విశాఖ సిటీ అధ్యక్షుడు మళ్ల విజయప్రసాద్, అగ్రిగోల్డ్‌ బాసట కమిటీ రాష్ట్రాధ్యక్షుడు లేళ్ల అప్పిరెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి కర్రి పాపారాయుడు, కో–ఆర్డినేటర్లు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు