తప్పుడు రాతలకు క్షమాపణ చెప్పండి

16 Feb, 2020 04:09 IST|Sakshi

కట్టుకథలతో ఇంకెంత కాలం పత్రికను నడుపుతారు? 

వార్తను వెనక్కు తీసుకుంటూ నా లేఖను ప్రముఖంగా ప్రచురించాలి 

రామోజీరావుకు బొత్స బహిరంగ లేఖ

సాక్షి, అమరావతి:  తాను అనని మాటలను అన్నట్లుగా ఈనాడు దినపత్రిక దురాలోచనతో ప్రచురించిందని, ‘అవసరమైతే ఎన్డీయేలో చేరతాం..’ అని తానన్నట్లుగా శీర్షిక పెట్టారని.. ఎన్డీయేలో చేరతామని తానెక్కడ చెప్పానో చూపించాలని ఈనాడు దినపత్రిక అధిపతి రామోజీరావును మంత్రి మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ డిమాండ్‌ చేశారు. ఇది మైనారిటీలను రెచ్చగొట్టడం తప్ప మరేమీ కాదని ఆగ్రహం వ్యక్తంచేశారు. చంద్రబాబు మాజీ పీఎస్‌ తీగ లాగుతూంటే కదులుతున్న రూ.వేల కోట్ల అవినీతి డొంకను ‘ఈనాడు’ ఎందుకు చూపించడంలేదని ఆయన ప్రశ్నించారు. ఈ మేరకు ఈనాడు అధినేత రామోజీరావుకు బొత్స శనివారం ఒక బహిరంగ లేఖను రాసి పత్రికలకు విడుదల చేశారు. లేఖలోని ముఖ్యాంశాలు.. 

రామోజీరావు గారికి..: 15–02–2020 తేదీ ఈనాడు మొదటి పేజీలో నేను అన్నట్లుగా ప్రచురించిన వార్తను చూసిన తరువాత ఈ బహిరంగ లేఖ రాస్తున్నాను. లేఖతోపాటుగా నిన్న నేను మాట్లాడిన వీడియోను కూడా మీకు పంపుతున్నాను. మీ తప్పుడు వార్తను వెనక్కు తీసుకుంటూ నా ఈ బహిరంగ లేఖకు అంతే ప్రాముఖ్యం ఇచ్చి ప్రచురించాలని కోరుతున్నాను. చంద్రబాబు ఎన్ని లక్షల కోట్లు మింగేసినా మీకు ఆయనంటే ఉన్న దిక్కుమాలిన ప్రేమ గత మూడు దశాబ్దాలుగా మీ పత్రికలో నిత్యం కనిపిస్తునే ఉంది. ఇది తెలుగు ప్రజల దౌర్భాగ్యం. రాష్ట్ర ప్రయోజనాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల ప్రయోజనాలు పరమావధిగా పనిచేస్తున్న ప్రభుత్వం మాది. కేంద్రానికి–రాష్ట్రానికి మధ్య సత్సంబంధాలు ఉండాలని ఏ ప్రభుత్వమైనా కోరుకుంటుంది. అందులో భాగంగానే ప్రధానిని, హోంమంత్రిని, కేంద్రంలోని పెద్దలను సీఎంగారు కలుస్తారన్నది అర్థం అవుతుంది. ప్రజలకు మంచి చేయటం చేతగాని చంద్రబాబును ప్రజల్లో పెంచలేని మీరు ఎంతగా దిగజారుతున్నారో ఆత్మపరిశీలన చేసుకోండి.  

ఎందుకీ పరిస్థితి వచ్చిందో ఆలోచించుకోండి.. 
మీ అందరి ఉమ్మడి ప్రయోజనాల కోసం అబద్ధాలు, కట్టుకథలతో ఇంకెంత కాలం మీ పత్రిక నడుపుతారు? చంద్రబాబుకు 70. మీకు 84.. ఇంత పండు వయసు వచ్చినా మీ వైఖరివల్ల రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు మీ పాజిటివ్‌ కంట్రిబ్యూషన్‌ ఏమిటంటే చెప్పుకునేందుకు ఏమీలేని పరిస్థితి తెచ్చుకున్నారు. చివరిగా.. మీ వార్త తప్పు మాత్రమే కాదు.. నేరం కూడా. మీ స్పందనను బట్టి నా తదుపరి కార్యాచరణ ఉంటుంది’.. అంటూ బొత్స ముగించారు. 

మరిన్ని వార్తలు