యథేచ్ఛగా ఉల్లంఘన

22 Mar, 2019 02:16 IST|Sakshi
గుంటూరు జిల్లా మంగళగిరిలో భారీ కాన్వాయ్‌తో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి తనయుడు నారా లోక్‌శ్‌

రెచ్చిపోతున్న అధికార తెలుగుదేశం పార్టీ నేతలు  

కఠిన చర్యలు తీసుకోవాలంటున్న ప్రజాస్వామిక వాదులు

ఓటర్లకు అధికార పార్టీ ప్రలోభాలు.. వైఎస్సార్‌సీపీ నేతలకు బెదిరింపులు  

ఓటర్ల జాబితాలో దొంగ ఓటర్లు.. ప్రతిపక్ష సానుభూతిపరుల ఓట్లు తొలగింపు  

ఎన్నికల ముందు ప్రజలకు తాయిలాలు ప్రకటిస్తున్న ప్రభుత్వం  

అధికార పార్టీకి యథాశక్తి సహకరిస్తున్న అధికారులు  

టీడీపీ కార్యకర్తల్లా పనిచేస్తున్న డీజీపీ, ఇంటెలిజెన్స్‌ ఐజీ 

తెలుగుదేశం అక్రమాలపై పలుమార్లు ఫిర్యాదు చేసిన వైఎస్సార్‌సీపీ  

ప్రజలు స్వేచ్ఛగా ఓటు వేసే పరిస్థితి లేదని ప్రజాస్వామ్యవాదుల ఆందోళన

సాక్షి, అమరావతి:  రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు ప్రజాస్వామ్యయుతంగా, ప్రశాంతంగా జరిగే అవకాశాల్లేకుండా అధికార తెలుగుదేశం పార్టీ అన్నిరకాల అడ్డదారులు తొక్కుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబుతో సహా మంత్రులు, టీడీపీ నేతలు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారు. తమ ఇలాకాలో తమను అడిగే వారే లేరన్నట్లుగా రెచ్చిపోతున్నారు. అధికార పార్టీ నేతల అక్రమాలను ఎన్నికల సంఘం అడ్డుకోకపోవడం విస్మయానికి గురిచేస్తోంది. ఎన్నికల కోడ్‌ను పక్కాగా అమలు చేయాల్సిన కొందరు ఉన్నతాధికారులు అధికార పార్టీ సేవలో తరిస్తున్నారు. టీడీపీకి వత్తాసు పలుకుతున్న అధికారుల తీరుపై ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇప్పటికే ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. అయినా ఈసీ ఎలాంటి చర్యలు చేపట్టకుండా నిస్తేజంగా మారిపోవడం గమనార్హం. ఎన్నికల్లో ప్రజలు స్వేచ్ఛగా ఓటు వేసే పరిస్థితి లేకుండా పోయిందని ప్రజాస్వామ్యవాదులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  
 
ఆ ఉన్నతాధికారులను తప్పిస్తేనే... 
రాష్ట్ర డీజీపీ ఆర్పీ ఠాకూర్, ఇంటెలిజెన్స్‌ విభాగం ఐజీ ఏబీ వెంకటేశ్వరరావు, శాంతిభద్రతల ఐజీ ఘట్టమనేని శ్రీనివాస్‌ తదితర పోలీసు ఉన్నతాధికారులు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. విశాఖపట్నం విమానాశ్రయంలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై హత్యాయత్నం జరిగితే ప్రాథమిక విచారణ పూర్తి కాకుండానే డీజీపీ ఠాకూర్‌ మీడియా సమావేశం నిర్వహించి, వైఎస్సార్‌సీపీ అభిమానే ఈ హత్యాయత్నం చేశాడని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ తరువాత కూడా ఆయన ప్రతిపక్షానికి వ్యతిరేకంగా పలు వివాదాస్పద చర్యలు చేపట్టారు. ఇక ఇంటెలిజెన్స్‌ విభాగం ఐజీ ఏబీ వెంకటేశ్వరరావు తన యంత్రాంగాన్ని పూర్తిగా ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీకి వ్యతిరేకంగా మోహరించారు. వైఎస్సార్‌సీపీ టిక్కెట్‌పై గెలిచిన 23 మంది ఎమ్మెల్యేలతో స్వయంగా బేరసారాలు సాగించి, వారు టీడీపీలోకి ఫిరాయించేలా చేశారు. ఆయన అచ్చంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలా వ్యవహరిస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటి అధికారులను ఎన్నికల బాధ్యతల నుంచి తప్పించాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి.  
 
దొంగ ఓట్లపై చర్యలు నిల్‌  
అధికార పార్టీకి కొమ్ముకాసే ప్రభుత్వ ఉన్నతాధికారుల సారథ్యంలో రాష్ట్రంలో ఎన్నికలు సజావుగా జరగబోవని తెలిసినా కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవడంలో ఎందుకు వెనుకంజ వేస్తోందో అర్థం కావడం లేదని కొందరు అధికారులు అంటున్నారు. డీజీపీని విధుల నుంచి తప్పించాలని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి ఫిర్యాదు చేశారు. ఓటర్ల జాబితాల్లో అక్రమాలకు పాల్పడుతున్న టీడీపీ నేతలను ఆర్పీ ఠాకూర్, ఏబీ వెంకటేశ్వరరావు రక్షిస్తున్నారని, వైఎస్సార్‌సీపీ నేతలు, సానుభూతిపరులను పోలీసుల ద్వారా భయభ్రాంతులను గురి చేస్తున్నారని పలుమార్లు ఫిర్యాదు చేసినా కేంద్ర ఎన్నికల సంఘం నుంచి స్పందన కరువైంది. దాదాపు 59 లక్షల మేర దొంగ ఓట్లను చేర్పించారని, తమ పార్టీ సానుభూతిపరుల ఓట్లు తొలగిస్తున్నారని కేంద్ర ఎన్నికల సంఘానికి ప్రతిపక్షం ఫిర్యాదు చేసినా ఇప్పటిదాకా చర్యలు లేకపోవడం గమనార్హం. దొంగ ఓట్లను తొలగించాలని రాష్ట్ర ఎన్నికల సంఘానికి వైఎస్సార్‌సీపీ ఆధారాలతో సహా ఫిర్యాదులు ఇచ్చినా ఫలితం లేకుండాపోయింది. ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కేంద్ర ఎన్నికల సంఘానికి, రాష్ట్ర గవర్నర్‌ను స్వయంగా కలిసి ఫిర్యాదు చేసినా ఇప్పటిదాకా ఎలాంటి చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు.   
 
ప్రతిపక్ష నేతపై బాబు అడ్డగోలు వ్యాఖ్యలు  
వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై, ఆ పార్టీ అభ్యర్థులు, నేతలపై ముఖ్యమంత్రి చంద్రబాబు అభూత కల్పనలతో ప్రతిరోజూ ఆరోపణలు చేస్తున్నారు. అలాగే కొన్ని పచ్చ పత్రికలు అసత్యాలతో ప్రతిరోజూ కథనాలు వండి వారుస్తున్నాయి. ఇలాంటి వాటిని ఎన్నికల సంఘం పట్టించుకోవడం లేదు. సీఎం చంద్రబాబు ప్రతిపక్ష నేతపై నేరపూరిత ఆరోపణలు చేస్తూ ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘిస్తున్నారు. వైఎస్‌ జగన్‌ చిన్నాన్న, మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యకు గురైతే చంద్రబాబు ఈ ఘటనపై వాస్తవాలను పక్కదారి పట్టించేలా ఆరోపణలు చేశారు. విచారణను ప్రభావితం చేసేలా పలు వ్యాఖ్యలు చేస్తూ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారు. చంద్రబాబు చేస్తున్న తప్పుడు ప్రకటనల వల్ల విచారణ పక్కదారి పట్టే అవకాశముందని, విచారణ నిష్పక్షపాతంగా జరిగేలా చూడాలని వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్‌ సునీత సీఈఓకు ఫిర్యాదు చేశారు.  
 
చంపుతామని బెదిరిస్తున్నా పట్టించుకోరా?  
గతంలో ఎన్నికల కోడ్‌ ఉల్లంఘనలపై సమాచారం అందితే ఎన్నికల సంఘం వెంటనే స్పందించేది. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే వారికి నోటీసులు ఇచ్చేది. కానీ, ప్రస్తుతం అందుకు భిన్నమైన వాతావరణం కనిపిస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో అధికార పార్టీ నేతలు ప్రతిపక్ష నాయకులపై దాడులు చేస్తూ బెదిరింపులకు దిగుతున్నా ఎన్నికల సంఘం పట్టించుకోవడం లేదు. ఎన్నికల్లో తమ పార్టీకి ఓటు వేయకపోతే పథకాలు నిలిపివేస్తామని ఓటర్లను టీడీపీ నేతలు హెచ్చరిస్తున్నారని ఫిర్యాదులు అందుతున్నా ఈసీ నుంచి ఎలాంటి చర్యలు కనిపించడం లేదు. తెలుగుదేశంలో చేరి, ఆ పార్టీకి అనుకూలంగా పనిచేయకుంటే చంపుతామని బెదిరిస్తున్నారని, పోలీసులు కూడా వారికే వత్తాసు పలుకుతున్నారని చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌ తరఫున లాయర్‌ స్వయంగా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. చంద్రగిరిలో దొంగ ఓట్లు నమోదు చేయిస్తున్న వారిని వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు అడ్డుకొని పోలీసులకు అప్పగించారు. కానీ, వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపైనే పోలీసులు కేసులు నమోదు చేశారు. అదేమిటని నిలదీసిన ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డిని అరెస్టు చేశారు. ఈ ఘటనపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు ఇచ్చినా స్పందన కనిపించలేదు. మంత్రి పరిటాల సునీత కుమారుడు పరిటాల శ్రీరాం పోటీచేస్తున్న రాప్తాడులో తెలుగుదేశానికి ఓటు వేయకుంటే చంపుతామని గ్రామాల్లో ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. మంత్రి అనుచరులు బహిరంగంగానే మైకుల్లో ప్రకటనలు చేస్తున్నారు. దీనిపై రాప్తాడు వైఎస్సార్‌సీపీ అభ్యర్థి గురువారం అమరావతికి వచ్చి, ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.  
 
ప్రజావేదికా... టీడీపీ కార్యాలయమా?  

ప్రభుత్వ కార్యకలాపాలకు మాత్రమే వినియోగించాల్సిన ఉండవల్లిలోని ప్రజావేదికను సీఎం చంద్రబాబు ఏకంగా తన పార్టీ కార్యాలయంగా మార్చేశారు. అక్కడే ఇతర పార్టీల నాయకులను టీడీపీలో చేర్చుకుంటున్నారు. రాజకీయ ప్రసంగాలు చేస్తున్నారు. ప్రభుత్వానికి చెందిన ఆర్టీజీఎస్‌ ద్వారా ప్రతిపక్ష అభ్యర్థులు, నాయకులపై ప్రభుత్వం నిఘా ఏర్పాటు చేసిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆర్టీజీఎస్‌ను ఎన్నికల సంఘం తన పరిధిలోకి తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. విద్యుత్‌ పంపిణీ సంస్థల అధికారులు తెలుగుదేశం పార్టీకి సహకరిస్తూ ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘిస్తున్నారు. నెలవారీ విద్యుత్‌ బిల్లులపై చంద్రబాబు ఫొటోను ముద్రించి పంపిణీ చేస్తన్నారు. బిల్లుల వెనుక భాగంలో అమరావతి నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు, వివిధ పథకాలంటూ చంద్రబాబు ఫొటో ముద్రించారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ద్వారా యువకులకు ఉపాధి కల్పిస్తామని చెబుతూ వారితో అక్రమాలు చేయిస్తున్నారు. ఆర్టీజీఎస్‌ ద్వారా సేకరించిన డేటాను ఏపీఎన్‌ఆర్టీకి ఇచ్చి, దాని ఆధారంగా కొందరు యువకులతో సర్వేలు చేయిస్తూ ప్రజలకు ఆన్‌లైన్‌లో డబ్బులు బదిలీ చేయించేలా అధికారులు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలూ ఉన్నాయి. డ్వాక్రా సంఘాల మహిళలకు శిక్షణ ఇచ్చి, వారితో తెలుగుదేశానికి అనుకూలంగా ప్రచారం చేయించడానికి అధికారులు సన్నద్ధమయ్యారు.  
 
సైకిళ్లు, ఇళ్ల నిర్మాణ పత్రాల పంపిణీ   

మంగళగిరిలో పోటీ  చేస్తున్న ముఖ్యమంత్రి తనయుడు నారా లోకేశ్‌ ఎన్నికల నిబంధనలను ఉల్లంఘిస్తున్నా చర్యలు కనిపించడం లేదు. ప్రతిపక్ష అభ్యర్థులు ప్రచారం చేసే ప్రాంతాల్లో అధికార పార్టీ నియమించిన బృందాలు డ్రోన్‌ కెమెరాలతో చిత్రీకరిస్తూ హల్‌చల్‌ చేస్తున్నాయి. ఎన్నికల వేళ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ వివిధ సరుకులతో ఫుడ్‌ బకెట్లను ఉచితంగా పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేసింది. మంత్రులు, అధికార పార్టీ నేతలు పాఠశాల విద్యార్థులకు సైకిళ్లు, ప్రజలకు ఇళ్లనిర్మాణ పత్రాలు పంపిణీ చేస్తూ నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు. ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రజలకు వివిధ తాయిలాలు ప్రకటిస్తోంది. ఎన్నికల నిబంధనలకు వ్యతిరేకంగా పోస్టు డేటెడ్‌ చెక్కులు ఇచ్చి లబ్ధిదారులను ప్రలోభాలకు గురిచేస్తోంది. పసుపు–కుంకుమ, అన్నదాత సుఖీభవ పథకాల కింద నగదు పంపిణీ చేయిస్తోంది. ఇవన్నీ ఎన్నికల ప్రవర్తనా నియమాళికి విరుద్ధమే.  
 

మరిన్ని వార్తలు