వచ్చేసింది.. ఓట్ల పండుగ

12 Mar, 2019 05:05 IST|Sakshi

పేరు చెప్పడానికీ సిగ్గుపడే దశ నుంచి... ఓటు మా హక్కు అని మహిళలు గొంతెత్తే వరకూ... నా ఒక్క ఓటేయకపోతే పోయేదేముందిలే అనుకునే దగ్గర్నుంచి... బాధ్యతగా చేసుకున్న మిలినియల్స్‌ వరకూ.. గల్లీ గల్లీ తిరిగి కరపత్రాలు పంచి ప్రచారం చేసే స్థాయి నుంచి... కాక రేపే  ఫేస్‌బుక్‌ పోస్టు ఒక్కటి చాలని అనుకునే వరకు... గెలిచింది ఎవరో తెలిసేందుకు రోజులు పట్టే కాలం నుంచి.. గంటల్లో విజేతలను నిర్ణయించే దశ వరకూ... ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్యం.. మన భారతీయంలో వింతలు విశేషాలు.. అన్నీ ఇన్నీ కావు! సామాన్యుడు.. దేవుడయ్యే సమయం దగ్గరకొచ్చింది! ఎడమచేతి చూపుడువేలిపై సిరా గుర్తు పడే రోజు వచ్చేస్తోంది! ఏడు దశాబ్దాల ఎన్నికల పండుగ ప్రజాస్వామ్య ప్రస్థానం సాగింది ఇలా...

అభ్యర్థికో బాక్స్‌ నుంచి ఈవీఎంల వరకు
మన ఎన్నికల ప్రక్రియ అభ్యర్థికో బాక్స్‌ నుంచి బ్యాలెట్‌ పత్రం దిశగా వెళుతూ ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాల వరకు చేరుకుంది. తొలి ఎన్నికల్లో  ప్రతీ అభ్యర్థికి వేర్వేరు రంగుల్లో ఉన్న ఒక్కో బ్యాలెట్‌ బాక్స్‌ని కేటాయించారు. ఆ బాక్స్‌పై వారి పేరు, ఎన్నికల గుర్తుని పెయింట్‌ చేశారు. ప్రతీ పోలింగ్‌ బూత్‌లో బరిలో ఉన్న అభ్యర్థులు ఒక్కొక్కరికీ ఒక బ్యాలెట్‌ బాక్స్‌ అన్నమాట. నచ్చిన అభ్యర్థి బ్యాలెట్‌ బాక్స్‌లో ఓటరు బ్యాలెట్‌ పేపర్‌ను వేస్తే సరిపోతుంది.

అప్పట్లో ఈ బ్యాలెట్‌ బాక్స్‌లను గోద్రేజ్‌ కంపెనీ బొంబాయిలోని విఖ్రోలి ప్రాంతంలో తయారు చేసింది. 1957 ఎన్నికల్లోనూ ఇదే ప్రక్రియను అనుసరించారు. మూడవ సార్వత్రిక ఎన్నికల (1962)లో బరిలో ఉన్న అభ్యర్థులు, గుర్తులను ఒకే బ్యాలెట్‌ పేపర్‌పై ముద్రించారు. ఇరవైఏళ్లపాటు ఇదే పద్ధతి కొనసాగగా.. 1982లో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రయోగాత్మకంగా ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మిషన్లు (ఈవీఎంలు) వాడారు. అయితే అప్పట్లో పరూరు నియోజకవర్గంలోని 50 పోలింగ్‌ స్టేషన్లకే వీటిని పరిమితం చేశారు. 1998లో మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 16 స్థానాల్లో వీటిని మరోసారి పరీక్షించారు.

ఇవన్నీ మంచి ఫలితాలు ఇవ్వడంతో  2004లో తొలిసారి మొత్తం లోక్‌సభ నియోజకవర్గాల్లో ఈవీఎంల వాడకం మొదలుపెట్టారు. అవకతవకలు జరుగుతున్నాయన్న ఆరోపణలు రావడంతో ఓటింగ్‌ ప్రక్రియను మరింత పారదర్శకం చేసేందుకు 2010లో ఓటర్‌ వెరిఫైయబుల్‌ పేపర్‌ ఆడిట్‌ ట్రెయిల్‌ (వీవీప్యాట్‌)లను ప్రవేశపెట్టారు. ఈవీఎంల వాడకంతో ఓటింగ్‌ ప్రక్రియ సులభతరం కావడమే కాకుండా, ఫలితాల ప్రకటన కూడా వేగవంతమైంది. పోలింగ్‌ కేంద్రాల్లో జరిగే రిగ్గింగ్, ఆక్రమణ వంటి అక్రమాలకు అడ్డుకట్ట వేయడం సాధ్యమైంది. తక్కువ బరువు ఉండటం వల్ల ఈవీఎల రవాణ కూడా సులభం. ఒక్కో ఈవీఎం ఖరీదు ఐదారు వేలు ఉంటుంది. పదిహేనేళ్ల పాటు పని చేస్తుంది. ఇన్ని లాభాలున్నా.. ఈవీఎంలలో లోపాలున్నాయన్న ఆరోపణలు రావడం సాధారణమైపోయింది.

కాలినడక, పడవల్లో, ఏనుగులపై ప్రయాణాలు
ఒకప్పుడు ప్రయాణ సాధనాలు అంతగా లేవు. సరైన రహదారి సౌకర్యాలు ఉండేవి కావు. కొండ ప్రాంతాల్లోనూ, నక్సల్స్‌ ప్రాబల్యం ఉన్న ఏజెన్సీ ప్రాంతాల్లోనూ, ఎడారుల్లోనూ, సముద్రం మధ్య ద్వీపాల్లోనూ  ఓటింగ్‌ నిర్వహణ దుర్లభంగా ఉండేది. ఎన్నికల కమిషన్‌ సభ్యులు నానా పాట్లు పడేవారు. ఎన్నికల సామగ్రి మోసుకుంటూ మైళ్లకి మైళ్లు నడిచే పరిస్థితి. ఇఅదీ ప్రజాస్వామ్య వ్యవస్థకి మనం ఇచ్చే గౌరవం.  హిందూమహాసముద్రం ద్వీపాల్లో ఎన్నికల కోసం ఏకంగా నేవీ అధికారుల సాయం కూడా  తీసుకోవాల్సి వచ్చింది.

కొన్ని ప్రాంతాలకు ఎన్నికల సిబ్బందిని, సామగ్రిని చేర్చడానికి హెలికాప్టర్‌ సాయం తీసుకునే వారు. ఇప్పుడు ప్రయాణ సాధనాలు మెరుగు పడినప్పటికీ అటవీ ప్రాంత పోలింగ్‌ స్టేషన్లకి వెళ్లాలంటే కాలినడకే మార్గం. ఇక ప్రత్యేక వాహనాలు, రైళ్లు, హెలికాప్టర్లు, బోట్లలో కూడా సిబ్బందని తరలిస్తారు. కొన్నిసార్లు పోలింగ్‌ స్టేషన్‌ చేరుకోవడానికి ఏనుగులు వాడిన సందర్భాలూ లేకపోలేదు. రాజస్థాన్‌ వంటి ఎడారుల్లో ఒంటెలే సాధనం. దేశం మొత్తమ్మీద దాదాపుగా 80 వేల పోలింగ్‌ కేంద్రాల వద్ద  మోబైల్‌ఫోన్‌ సౌకర్యం కూడా లేదు. ఇంకో ఇరవై వేల పోలింగ్‌ స్టేషన్లు అటవీ ప్రాంతాల్లో ఉన్నాయి.

ఒక్కడున్నాడు!
ఒక్క ఓటు. ఒకే ఒక్క ఓటు. మన ప్రజాస్వామ్య వ్యవస్థలో అది కూడా ఎంతో కీలకం. అందుకే ఎన్నికల సంఘం ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి మరీ గుజరాత్‌లో దట్టమైన గిర్‌ అడవుల్లోకి కాలినడకన వెళుతుంది. ఆ ఒక్కడి కోసం పోలింగ్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తుంది. అతని పేరు మహంత్‌ భరత్‌దాస్‌ దర్శన్‌ దాస్‌. ఆలయపూజారి. ఆయన ప్రతీ ఏడాది తన ఓటు హక్కును వినియోగించుకుంటారు. ఇందుకోసం ఎన్నికల సిబ్బంది గిర్‌ అడవుల్లోని బనేజ్‌కు ఏకంగా 35 కి.మీ. ప్రయాణం చెయ్యాలి.

ఆ ప్రయాణంలో వారిని సింహాలు భయపెడతాయి. అడవి జంతువులు ఎదురవుతాయి. అయినా ప్రాణాలకు తెగించి మరీ ఆ ఒక్క ఓటు నమోదు కోసమే అధికారులు వెళతారు. ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ఏ పౌరుడు కూడా తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి 2 కి.మీ.దూరానికి మించి ప్రయాణించకూడదు. అందుకే తాము భరత్‌దాస్‌ దగ్గరకి వెళతామని ఎన్నికల సంఘం అధికారి ఒకరు చెప్పారు. ఆ ప్రాంతంలో ఫోన్లు పని చెయ్యవు. టీవీ రాదు. కనీసం విద్యుత్‌ సౌకర్యం కూడా లేదు. అయినప్పటికీ  దర్శన్‌దాస్‌ శివుడిపై అపారమైన భక్తితో ఆ ప్రాంతంలోనే చాలా ఏళ్లుగా ఉంటున్నారు. చూడడానికి కాస్త ఆధునికంగానే కనిపిస్తారు.

60 ఏళ్లు దాటిన దర్శన్‌ దాస్‌ నల్ల కళ్లద్దాలు,తెల్ల గడ్డం, తలకి టోపీతో అందరినీ ఆకర్షిస్తుంటారు. ఆయనపై నమ్మకంతో ఆ అడవిలో వెళ్లేవారికి ఆధ్యాత్మిక బోధనలు చేస్తారు. పౌర సమాజానికి దూరంగా విసిరేసి ఉన్నప్పటికీ ఆయనకు ఓటు విలువ గురించి బాగా తెలుసు. ‘‘నా ఓటు ఎంత ముఖ్యమో నాకు బాగా తెలుసు. వాజపేయి సర్కార్‌ కేవలం ఒక్క ఓటు తేడాతో కుప్పకూలిపోయింది. ఎన్నో కష్టనష్టాలకు ఓర్చుకొని ఎన్నికల సిబ్బంది ఇంత దూరం వస్తున్నందుకు వారిని ఎంతో గౌరవిస్తాను.  నా ఓటు ఎంత విలువైనదో తెలుసుకొని గర్విస్తాను‘‘ అని అంటారు. ఒక్క వ్యక్తి కోసం పోలింగ్‌ బూల్‌ ఏర్పాటు చేస్తున్న సంగతి వెలుగులోకి వచ్చాక ఎందరో జర్నలిస్టులు గిర్‌ అడవుల్లోకి వెళ్లి భరత్‌దాస్‌తో మాట్లాడారు. అతని ప్రత్యేకతను ప్రపంచ దేశాలకు పరిచయం చేశారు.

శభాష్‌ శరణ్‌.. ఆయనకు ఓటంటే బాధ్యత
శ్యామ్‌ శరణ్‌ నేగి. ఆయన వయసు 102 సంవత్సరాలు. మన దేశంలో అతి పెద్ద వయసున్న ఓటరు ఆయనే.  స్వాతంత్య్ర సమర సంగ్రామంలో పాల్గొన్న నేగికు ఓటు అంటే హక్కు మాత్రమే కాదు బాధ్యత కూడా. అందుకే ఇప్పటివరకు అన్ని ఎన్నికల్లోనూ ఓటు హక్కు వినియోగించుకున్న ఏకైక ఓటరుగా ఆయన రికార్డులకెక్కారు. హిమాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్రంలోని కల్పా అనే చిన్న గ్రామంలో ఉంటారు. కిన్నెర కైలాస్‌ పర్వత శ్రేణుల్లో ఉండే ఆ గ్రామంలో నిత్యం మంచు కురుస్తూనే ఉంటుంది. ఎముకలు కొరికే చలిని సైతం లెక్కచేయరు.

మొదటి ఓటు తనే వేయాలనుకుంటారు. దీనికి గ్రామస్తులు కూడా సహకరిస్తారు. పొద్దున్నే ఇంకా ఎన్నికల సిబ్బంది పోలింగ్‌ బూత్‌ తెరవక ముందే ఉన్ని కోటు వేసుకొని ఆయన వస్తారు. గ్రామస్తులందరూ కూడా ఆయనకు గౌరవాన్ని ఇచ్చి దారి విడిచిపెడతారు. 1951–52లో జరిగే మొదటి ఎన్నికల్లో కూడా నేగి తొలి ఓటును వేసి ప్రజాస్వామ్య భారతంలో తొలిసారిగా ఓటు హక్కు వినియోగించుకున్న వ్యక్తిగా చరిత్రపుటల్లో నిలిచిపోయారు. అప్పట్నుంచి వేగి ప్రతీసారి ఎన్నికల్లో తన ఓటు హక్కుని వినియోగించుకుంటూనే ఉన్నారు. స్వాతంత్య్ర సమరంలో పాల్గొన్న వ్యక్తిగా మహాత్మగాంధీ సిద్ధాంతాలను ఆయన బాగా ఒంట బట్టించుకున్నారు.


నూలు ఒడికి ఖాదీ వస్త్రాలు ధరించేవారు. ఒకప్పుడు ఆయనకు కాంగ్రెస్‌ పార్టీ అంటే చెప్పలేనంత ఇష్టం ఉండేది. దేశానికి స్వాతంత్య్రం సాధించిన పార్టీగా ఆయనకు కాంగ్రెస్‌ పట్ల దేశభక్తి పొంగిపొర్లేది. కానీ కాలంతోపాటు ఆయన అభిప్రాయాలూ మారిపోయాయి. ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు అత్యంత ఇష్టమైన నాయకుడు. ‘‘ఇప్పుడున్నది ఒకప్పటి కాంగ్రెస్‌ కాదు. ఎన్నో కుంభకోణాలకు పాల్పడింది. ఇప్పుడున్న నేతల్లో మోదీనే అభిమానిస్తాను. అవినీతిని అంతమొందించడానికి ఆయన తనకు చేతనైంది చేస్తున్నారు‘‘ అంటూ ప్రశంసిస్తారు. 17వ లోక్‌సభ ఎన్నికల్లో మరోసారి ఓటేసేందుకు ఆయన అత్యంత ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు.

తొలి అడుగు.. సుకుమార్‌ సేన్‌
చుట్టూ చీకటి. ముందున్న దారి కనిపించదు. అడుగు ఎలా వెయ్యాలో తెలీదు. కానీ వెయ్యాలి.  ఎవరో ఒకరు ముందుగా నడవాలి. అలా నడిచి మన ఎన్నికల వ్యవస్థని ఒక గాడిలో పెట్టింది మొట్టమొదటి చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌ సుకుమార్‌సేన్‌. ఇండియన్‌ సివిల్‌ సర్వీసెస్‌ (ఐసీఎస్‌) అధికారిగా, న్యాయమూర్తిగా పనిచేసిన ఆయన దేశంలో ఎన్నికల ప్రక్రియకు తొలిసారిగా వేసిన బాట మరువలేనిది. ఎన్నికల నిర్వహణకు ముందు ఇంటింటికి తిరుగుతూ ఓటర్ల జాబితా రూపకల్పనలో సుకుమార్‌ సేన్‌ బృందానికి ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయి.

ఓటర్లలో 70 శాతం నిరక్షరాస్యులు కావడం, మహిళా ఓటర్లు పేరు వెల్లడించడానికి ఇష్టపడకపోవడంతో ఓటర్ల జాబితా రూపొందించడమే  కష్టసాధ్యమైంది. దీంతో చాలా మంది ఓటు హక్కు పొందలేకపోయారు. 17 కోట్ల మంది ఓట్లతో తొలి జాబితా రూపొందింది. ఎన్నికల్లో బూత్‌ల ఏర్పాటు, సిబ్బంది నియామకం, బ్యాలెట్‌ బ్యాక్స్‌లు రూపొందించడం వంటివన్నీ ఒక ప్రణాళికాబద్ధంగా చేసి సుకుమార్‌ సేన్‌ బృందం విజయవంతమైంది. తొలి ఎన్నికల ప్రక్రియ అక్టోబర్‌ 25, 1951 నుంచి 1952 మార్చి 27 వరకు మొత్తం నాలుగు నెలల పాటు జరిగింది.

ఒకసారి వేటు వేసిన వాళ్లు మళ్లీ ఓటు వెయ్యకుండా చూపుడు వేలి మీద ఇంకు గుర్తు వేయడం తొలి ఎన్నికల్లోనే ప్రవేశపెట్టారు. నేపాల్, ఇండోనేసియా, సూడాన్‌ వంటి దేశాలు భారత్‌ ఎన్నికల నిర్వహణను దగ్గరుండి పరిశీలించడానికి తమ ప్రతినిధుల్ని పంపించాయి. విదేశీ మీడియా కూడా భారత్‌లో తొలి ఎన్నికల నిర్వహణను శెభాష్‌ అంటూ ప్రశంసించింది. సూడాన్‌ దేశం కూడా తమ తొలి ఎన్నికల నిర్వహణ బాధ్యతను సుకుమార్‌ సేన్‌  చేతుల్లోనే పెట్టింది. కానీ ఆయనకు రావల్సిన గుర్తింపు రాలేదని రామచంద్రగుహ వంటి చరిత్రకారులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉంటారు. భారతరత్న పురస్కారం ఇవ్వదగిన వ్యక్తిని చరిత్ర మరచిపోయిందన్నది ఆయన అభిప్రాయం.

ఎన్నికల సిత్రాలు
అనామకుడి చేతిలో ఓడిన అంబేడ్కర్‌...
రాజ్యాంగ నిర్మాత, భారత తొలి న్యాయశాఖా మంత్రి, తరతరాలుగా అణచివేతకు గురవుతోన్న అట్టడుగు వర్గాలైన దళిత, ఆదివాసీలకు ప్రత్యేక నియోజవకర్గాలకోసం అహరహం కృషిచేసి రిజర్వుడు నియోజకవర్గాలను తీసుకువచ్చిన డాక్టర్‌ బి.ఆర్‌ అంబేడ్కర్‌ అప్పటికే ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన రాజకీయవేత్త. అయినప్పటికీ ఒక అనామకుడి చేతిలో, అది కూడా రిజర్వుడు నియోజకవర్గంనుంచి ఓడిపోవాల్సిన పరిస్థితి వచ్చింది.


బీఆర్‌ అంబేడ్కర్‌ బొంబాయి(నార్త్‌ సెంట్రల్‌) రిజర్వుడు నియోజకవర్గం నుంచి ఆల్‌ఇండియా  షెడ్యూల్డ్‌ కాస్ట్‌ ఫెడరేషన్‌ తరఫున పోటీ చేసి ఓ అనామకుడి చేతిలో ఓడిపోయారు. కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఆ వ్యక్తి పేరు నారాయణ్‌ నడోబా కజ్రోల్కర్‌. నడోబా కజ్రోల్కర్‌కి 1,38,137 ఓట్లు వస్తే, డాక్టర్‌ బి.ఆర్‌ అంబేడ్కర్‌కి 1,23,576 ఓట్లు వచ్చాయి. ఆ తరువాత అంబేడ్కర్‌ రాజ్యసభ సభ్యుడిగా పార్లమెంటులోకి అడుగుపెట్టారు. మళ్ళీ 1954లో భన్‌దారా లోక్‌సభ ఉప ఎన్నికలో ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి బోర్కర్‌ చేతిలో మళ్ళీ ఓటమిపాలయ్యారు.

జేబీ కృపలానీ – సుచేతా కృపలానీ... అతను ఓడినా ఆమె గెలిచారు...
బ్రిటిష్‌ వారి నుంచి స్వాతంత్రాన్ని సాధించుకునే సమయానికి ఇండియన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా ఆచార్య జేబీ కృపలానీ ఉన్నారు. పూర్తి పేరు జీవత్రామ్‌ భగవాన్‌దాస్‌ కృపలానీ. స్వాతంత్య్రానికి పూర్వమూ, స్వాతంత్య్రానంతరమూ భారత రాజకీయాల్లో కీలకంగా పనిచేశారు. ఉత్తర ప్రదేశ్‌లోని ఫైజాబాద్‌ కిసాన్‌ మజ్దూర్‌ ప్రజాపార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. కానీ కాంగ్రెస్‌ తరఫున పోటీచేసిన మన్‌మోహినీ సెహెగల్‌ ని ఢిల్లీలో ఆచార్యకృపలానీ భార్య సుచేతా కృపలానీ ఓడించారు.

1957లోనే పోలింగ్‌ బూత్‌ల ఆక్రమణ....
పోలింగ్‌ బూత్‌లను ఆక్రమించుకొని పోలైన ఓట్లను «ధ్వంసం చేయడం, తాము గెలవమనుకున్న చోట్ల బ్యాలెట్‌ బాక్స్‌లను ఎత్తుకెళ్ళడం, లేదా బ్యాలెట్‌ బాక్సుల్లో ఇంకుపోసి ఓట్లు చెల్లకుండా చేయడం లాంటి దుశ్చర్యలు 1957 సార్వత్రిక ఎన్నికల నుంచి ప్రారంభం అయ్యాయి. బీహార్‌లోని బేగుసరాయ్‌ జిల్లాలోని రచియాహిలోని మటిహాని అసెంబ్లీ నియోజకవర్గంలో 1957లో జరిగిన ఎన్నికల్లో తొలి పోలింగ్‌ బూత్‌ల ఆక్రమణ జరిగింది.


పోటీ చేసే అభ్యర్థులూ, పార్టీల సంఖ్య ఎన్నో రెట్లు పెరిగి, పోటీ పెరిగిపోవడంతో 1970–80 వ దశకం చివర్లో బూత్‌ల ఆక్రమణ అనే పదం ప్రాచుర్యంలోకి వచ్చింది. దీని వల్ల దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో కొన్ని పార్టీలు బూత్‌లను ఆక్రమించుకోవడంతో పాటు చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడటం మొదలయ్యింది. పోలింగ్‌ బూత్‌ల ఆక్రమణని సైతం శిక్షార్హమైన నేరంగా పరిగణించి, బూత్‌ల ఆక్రమణ జరిగిన ప్రాంతాల్లో ఎన్నికలు రద్దు చేయడం, లేదా అక్కడ ఎన్నికలు వాయిదా వేసేలా ప్రజాప్రాతినిధ్య(1951) చట్టానికి 1989లో మార్పులు చేసారు.

13 రోజుల ప్రధాని...
గుల్జారీలాల్‌ నందా మొత్తం రెండు సార్లు ప్రధాని అయ్యారు. అయితే రెండు సందర్భాల్లోనూ 13 రోజులు, 13 రోజులే ప్రధాని పదవిలో ఉండడం ఒక విశేషం అయితే, రెండు సార్లూ పదవిలో ఉన్న ప్రధానమంత్రులు మరణించడంతో ఈయనకు ఆ అవకాశం లభించింది. ఒకటి జవహర్‌ లాల్‌ నెహ్రూ మరణం అయితే, మరొకరు లాల్‌బహదూర్‌ శాస్త్రి మరణంతో గుల్జారీలాల్‌కి ఈ అవకాశం దక్కింది. రెండుసార్లూ కలుపుకొని మొత్తం 26 రోజులు పాటు గుల్జారీలాల్‌ నందా ప్రధానిగా పనిచేశారు. రెండవ లోక్‌సభ(ఏప్రిల్‌ 2, 1962 – మార్చి 3 1967)నుంచి 1964, మే 27  జవహర్‌లాల్‌ నెహ్రూ ప్రధానిగా ఉన్నారు.


మే 27, 1964 జవహర్‌ లాల్‌ నెహ్రూ మరణం తరువాత తొలిసారి గుల్జారీలాల్‌ తాత్కాలిక ప్రధాని అయ్యారు. మే 27 నుంచి జూన్‌ 9, 1964న లాల్‌ బహదూర్‌ శాస్త్రి ప్రధాని బాధ్యతలు చేపట్టే వరకూ గుల్జారీలాల్‌ ప్రధానిగా ఉన్నారు. రెండవసారి 1966 జనవరి 11న లాల్‌బహదూర్‌ శాస్త్రి మరణించిన తరువాత మళ్ళీ 13 రోజుల పాటు గుల్జారీలాల్‌ ప్రధాని బాధ్యతలు చేపట్టారు. శాస్త్రి మరణానంతరం ఉత్తర ప్రదేశ్‌ నుంచి రాజ్యసభ సభ్యురాలిగా ఉన్న ఇందిరాగాంధీ 1966 జనవరి 24న ప్రధాని బాధ్యతలు చేపట్టే వరకూ గుల్జారీలాల్‌ ప్రధానిగా కొనసాగారు.

ఆపరేషన్‌ దుర్యోధన...
2005, డిసెంబర్‌ 12 న స్టార్‌ టీవీ న్యూస్‌ ఛానల్‌ ప్రసారం చేసిన స్టింగ్‌ ఆపరేషన్, ఆపరేషన్‌ దుర్యోధనతో 11 మంది పార్లమెంటు సభ్యులు స్వయంగా డబ్బులు తీసుకుంటున్న విజువల్స్‌ బయటపెట్టారు. దీనిపై పార్లమెంటులో దుమారం రేగడంతో రాజ్యసభలోని ఎథిక్స్‌ కమిటీ, లోక్‌ సభ ప్రత్యేక కమిటీ విచారణలో వీరిని దోషులుగా నిర్ధారించడంతో 10 మంది లోక్‌ సభ సభ్యులూ, ఒక రాజ్య సభ సభ్యుడిని ఆయా సభల నుంచి తొలగించారు.


 

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు