-

దేవెగౌడని విమర్శించిన యడ్యూరప్ప

20 Apr, 2019 14:01 IST|Sakshi

బెంగళూరు : అద్వానీలా తాను రాజకీయాల నుంచి రిటైర్‌ కాబోనని మాజీ ప్రధాని దేవెగౌడ చేసిన వ్యాఖ్యలను బీజేపీ కర్ణాటక రాష్ట్ర అధ్యక్షుడు యడ్యూరప్ప తిప్పికొట్టారు. దేవెగౌడ ప్రధాని కావాలని ఆశపడుతున్నారని ఆయన విమర్శించారు. ఓ జాతీయ మీడియాకిచ్చిన ఇంటర్వ్యూలో యడ్యూరప్ప మాట్లాడుతూ.. ‘కర్ణాటకలో జేడీఎస్‌ కేవలం ఏడు లోక్‌సభ స్థానాల్లో మాత్రమే పోటీ చేస్తోంది. ఐనా కూడా ఆ పార్టీ నేత(దేవెగౌడను ఉద్దేశిస్తూ) ప్రధానమంత్రి లేదా ప్రధాని సలహాదారు కావాలని ఆశపడుతున్నారు’ అని విమర్శించారు.

ఎన్నికల్లో పోటీ చేయబోనని కొన్ని సంవత్సరాల కిందట ప్రకటించిన మాజీ ప్రధానమంత్రి దేవెగౌడ మళ్లీ ఎన్నికల బరిలో నిలిచిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై స్పందించారు దేవెగౌడ. గతంలోనే ఎన్నికల నుంచి తప్పుకొంటానని ప్రకటించినా.. మళ్లీ పరిస్థితులు తనను పోటీ చేసేలా పురికొల్పాయన్నారు. ప్రస్తుతానికి తనకు ఎలాంటి రాజకీయ ఆశయాలు, ఆశలు లేవన్నారు.

బీజేపీ అగ్రనేత ఎల్‌కే అద్వానీలా క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకునే ఉద్దేశం కూడా తనకు లేదని ఆయన చెప్పారు. తన పార్టీని కాపాడుకోవడమే తన ప్రధాన ఉద్దేశమని, అధికారమనేది ఆ తర్వాతి విషయమని తెలిపారు. రాహుల్‌ గాంధీ ప్రధానమంత్రి అయితే.. ఆయనకు అండగా నిలబడతానని, ప్రధాని కావాలని తనకు లేదని చెప్పుకొచ్చారు. చిన్న పార్టీ అయినప్పటికీ, తమకు సోనియాగాంధీ కర్ణాటకలో మద్దతుగా నిలిచారని.. అందుకే కాంగ్రెస్‌ పార్టీతో కలిసి సాగాల్సిన బాధ్యత తమపై ఉందని దేవెడౌడ స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు