కన్నడ విషయంలో రాజీపడబోం

17 Sep, 2019 04:23 IST|Sakshi

అమిత్‌ షా ‘హిందీ’ వ్యాఖ్యలపై సీఎం యడియూరప్ప

హిందీని బలవంతంగా రుద్దితే వ్యతిరేకిస్తామన్న కమల్‌  

బెంగళూరు/ చెన్నై: భారత్‌కు ఒకే జాతీయ భాష ఉండాలనీ, ఆ లోటును హిందీ భర్తీ చేయగలదన్న హోంమంత్రి అమిత్‌ షా వ్యాఖ్యలపై కర్ణాటక సీఎం, బీజేపీ నేత యడియూరప్ప స్పందించారు. తమ రాష్ట్రంలో కన్నడే ప్రధాన భాష అని, కన్నడ ప్రాధాన్యత విషయంలో తాము రాజీపడబోమని స్పష్టం చేశారు. ‘మన దేశంలోని అన్ని అధికార భాషలు సమానమే. ఇక కన్నడ విషయానికొస్తే అది రాష్ట్ర ప్రధాన భాష. కన్నడ భాషను ప్రోత్సహించడంతో పాటు రాష్ట్ర సంస్కృతి విషయంలో మేం రాజీ పడబోం’ అని తెలిపారు.  

షా, సుల్తాన్‌లు మార్చలేరు: కమల్‌ హాసన్‌
హిందీని తమపై బలవంతంగా రుద్దే ప్రయత్నాలను వ్యతిరేకిస్తామని మక్కల్‌ నీది మయ్యం పార్టీ అధినేత కమల్‌ హాసన్‌ ప్రకటించారు. ‘భారత్‌ గణతంత్ర దేశంగా అవతరించగానే మనదేశంలో భిన్నత్వంలో ఏకత్వం కొనసాగుతుందని హామీ లభించింది. దీన్ని ఏ షా(అమిత్‌ షా), సుల్తాన్, సామ్రాట్‌లు కూడా మార్చలేరు. మేం అన్ని భాషలను గౌరవిస్తాం. కానీ మా మాతృభాష మాత్రం ఎప్పటికీ తమిళమే’ అని అన్నారు.

మరిన్ని వార్తలు