పోలింగ్‌ కేం‍ద్రం వద్ద గాల్లోకి కాల్పులు

11 Apr, 2019 20:14 IST|Sakshi

లక్నో: పోలింగ్‌ కేంద్రంలో చెలరేగిన ఘర్షణను తగ్గించడానికి సరిహద్దు భద్రతా సిబ్బంది గాలిలోకి కాల్పులు జరపాల్సి వచ్చింది. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్‌లోని షమ్లీ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మొదటి దశ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా షమ్లీ జిల్లా గుర్జాన్‌ గ్రామంలోని గురువారం పోలింగ్‌ జరిగింది. పోలింగ్‌ జరుగుతుండగా.. మధ్యాహ్నం 12 గంటల సమయంలో కొందరు వ్యక్తులు పోలింగ్‌ కేంద్రంలోకి చొచ్చుకుని వచ్చారు. ఓటరు ఐడీ లేకపోయినప్పటికీ వారు ఓటు వేసేందుకు ప్రయత్నించడంతో అధికారులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో ఆందోళనకారులకు, అధికారుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. కొద్దిసేపటికే ఈ గొడవ తీవ్రస్థాయికి చేరింది. దీంతో పరిస్థితులను అదుపులోకి తీసుకురావడానికి బీఎస్‌ఎఫ్‌ జవాన్లు గాలిలో 5 రౌండ్లపాటు కాల్పులు జరిపారు. ఆందోళనకారులను చెదరగొట్టిన అనంతరం అక్కడ పోలింగ్‌ తిరిగి ప్రారంభమైంది. పోలింగ్‌ అధికార్లకు, ఆందోళనకారుల మధ్య వివాదం చాలసేపటి నుంచి ఉద్రిక్తత కొనసాగుతుండటంతోనే బీఎస్‌ఎఫ్‌ జవాన్లు గాల్లోకి కాల్పులు జరపాల్సి వచ్చిందని జిల్లా ఎస్పీ అజయ్‌ కుమార్‌ తెలిపారు. 

మరిన్ని వార్తలు