‘ఆ రెండు పార్టీలే బీజేపీని ఓడిస్తాయి’

14 Jan, 2019 19:05 IST|Sakshi

లక్నో: ఉత్తర ప్రదేశ్‌లో బీజేపీని ఓడించేందుకు ఎస్పీ, బీఎస్పీ కూటమి ఒక్కటే సరిపోతుందని ఆర్జేడీ నేత, బిహార్‌ మాజీ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్‌ అన్నారు. సోమవారం యూపీ మాజీ సీఎం అఖిలేష్‌ యాదవ్‌తో తేజస్వీ  లక్నోలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎస్పీ, బీఎస్పీ కూటమిని స్వాగతిస్తున్నట్లు తెలిపారు. కూటమిలో కాంగ్రెస్‌ లేకపోవడంపై ఆయన స్పందిస్తూ.. బీజేపీని ఓడించడానికి ఎస్పీ, బీఎస్పీ పార్టీలే చాలని, వారి నిర్ణయాన్ని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ కూడా స్వాగతించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. కూటమిలో ఎవురున్నారన్నది ముఖ్యం కాదని, లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి ఓటమి మాత్రం తప్పదని జోస్యం చెప్పారు.

మాయావతి, అఖిలేష్‌ యాదవ్‌లు చేతులు కలపడంతోనే బీజేపీ ఓటమి ఖాయమైందని ఆయన వ్యాఖ్యానించారు. ప్రస్తుతం దేశంలో నెలకొన్న రాజకీయ అస్థిరతలో ఎస్పీ, బీఎస్పీ కూటమి అవసరం ఎంతో ఉందని తేజస్వీ అభిప్రాయపడ్డారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో యూపీ, జార్ఖండ్‌, బిహార్‌ రాష్ట్రాల్లో మహాకూటమి 100కు పైగా స్థానాల్లో విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కాగా ఎస్పీ, బీఎస్పీ కూటమి ప్రకటన అనంతరం బీఎస్పీ అధినేత్రి మాయావతితో తేజస్వీ భేటీ అయిన విషయం తెలిసిందే. మాయా, అఖిలేష్‌తో విడివిడిగా  సమావేశమైన ఆయన లోక్‌సభ ఎన్నికలపై అనుసరించాల్సిన వ్యూహాల గురించి చర్చించారు. 

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు