కనిపించని అభ్యర్థికి ప్రచారం!

17 May, 2019 04:31 IST|Sakshi

ఉత్తరప్రదేశ్‌లోని ఘోసి లోక్‌సభ నియోజకవర్గంలో మే 19వ తేదీన పోలింగ్‌ జరగనుండటంతో ప్రచారం పతాక స్థాయికి చేరుకుంది. ఇక్కడ బీఎస్పీ అభ్యర్థి  అతుల్‌ రాయ్‌ తరఫున బహుజన్‌ సమాజ్‌ వాదీ పార్టీ అధినేత మాయావతి, సమాజ్‌వాదీ పార్టీ నేత అఖిలేశ్‌ యాదవ్‌లు స్వయంగా ప్రచారం చేస్తున్నారు. అంతే కాకుండా అతుల్‌ కోసం విస్తృతంగా ప్రచారం చేయాల్సిందిగా వారు పార్టీ శ్రేణులకు ఆదేశిస్తున్నారు. ఇందులో విశేషమేముంది...అనుకుంటున్నారా...వారు ఎవరికోసమైతే ప్రచారం చేస్తున్నారో ఆ అభ్యర్థి అతుల్‌ రాయ్‌ పదిహేను రోజుల నుంచి కనిపించడం లేదు. ఎక్కడికి వెళ్లాడో కూడా తెలియడం లేదు. అంటే ‘కనిపించని’ అభ్యర్థి కోసం భారీ ఎత్తున ప్రచారం జరుగుతోందన్నమాట.

ఇంతకీ అతుల్‌ అదృశ్యానికి కారణం, ఆయనపై అత్యాచారం కేసు నమోదు కావడం. అతుల్‌ రాయ్‌ తనపై అత్యాచారం చేశారని ఒక విద్యార్థిని వారణాసి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దాంతో పోలీసులు మే 1న అతుల్‌పై కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి ఆయన కనిపించడం లేదు. పోలీసులకు దొరక్కుండా ఉండేందుకు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారని కొందరు, మలేసియా పారిపోయారని ఇంకొందరు చెబుతున్నారు.ఆయన లేకపోయినా ఆయన తరఫున ప్రచారం మాత్రం సాగిపోతోంది. బీజేపీ వాళ్లు కుట్రతో తమ అభ్యర్థిపై  బూటకపు కేసు పెట్టించారని మాయావతి, అఖిలేశ్‌లు చెబుతున్నారు. అతుల్‌ రాయ్‌ని తప్పనిసరిగా గెలిపించి బీజేపీ కుట్రను భగ్నం చేయాలని కూడా వారు ఓటర్లను కోరుతున్నారు. మరోవైపు మే 23 వరకు అతుల్‌ను అరెస్టు చేయకుండా చూడాలని ఆయన లాయరు సుప్రీం కోర్టులో పిటిషన్‌ వేశారు. దానిపై ఈ రోజు విచారణ జరగనుంది.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు