కాంగ్రెస్‌కు మద్దతుపై మాయావతి గ్రీన్‌సిగ్నల్‌

12 Dec, 2018 11:36 IST|Sakshi

భోపాల్‌ : మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌ ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమమైంది. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజారిటీకి రెండు స్ధానాలు తగ్గిన కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చేందుకు బీఎస్పీ అధినేత్రి మాయావతి అంగీకరించారు. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కమల్‌ నాథ్‌ సహా ఆ పార్టీ అగ్ర నాయకత్వం మాయావతితో జరిపిన సంప్రదింపులు ఫలప్రదమయ్యాయి. మధ్యప్రదేశ్‌లో మొత్తం 230 స్ధానాలుండగా, ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మేజిక్‌ ఫిగర్‌ 116 స్ధానాలు కాగా కాంగ్రెస్‌ 114 స్ధానాల వద్దే నిలిచింది. దీంతో బీఎస్పీ నుంచి గెలుపొందిన ఇద్దరు ఎమ్మెల్యేల తోడ్పాటు కాంగ్రెస్‌కు లభించనుంది. రాజస్ధాన్‌లోనూ కాంగ్రెస్‌కు ప్రభుత్వ ఏర్పాటుకు తోడ్పాటు అందిస్తామని మాయావతి వెల్లడించారు. బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలతో విసిగిన ప్రజలు మరో ప్రత్యామ్నాయం లేకపోవడంతో కాంగ్రెస్‌ వైపు మొగ్గుచూపారని పేర్కొన్నారు.

మరోవైపు గెలుపొందిన స్వతంత్రులతో కూడా కాంగ్రెస్‌ మంతనాలు ప్రారంభించింది. మాయావతి మద్దతుతో ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకొచ్చిన కాంగ్రెస్‌ బుధవారం మధ్నాహ్నం గవర్నర్‌తో భేటీ అయింది. ఇక మధ్యప్రదేశ్‌లో బీజేపీ సైతం 109 స్ధానాలు దక్కించుకోవడంతో కాంగ్రెస్‌ తమ ఎమ్మెల్యేలు చేజారకుండా ప్రయత్నిస్తోంది. గత అనుభవాల దృష్ట్యా బీజేపీకి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కాంగ్రెస్‌ వేగంగా పావులు కదుపుతోంది

మరిన్ని వార్తలు