అసెంబ్లీలో రోడ్ల పంచాయితీ

23 Mar, 2018 02:38 IST|Sakshi
సోలిపేట రామలింగారెడ్డి

సర్కారు తీరుపై అధికార పార్టీ నేతల ధ్వజం 

గ్రామీణ రోడ్లను పట్టించుకోవడం లేదని ఫైర్‌

రోడ్లేసినట్లు నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తా: రామలింగారెడ్డి

కాంగ్రెస్‌ నుంచి వచ్చినందుకు వివక్ష: భాస్కర్‌రావు

మూడున్నరేళ్లలో రూ.2,240 కోట్లు ఖర్చు చేశాం: మంత్రి జూపల్లి

సాక్షి, హైదరాబాద్‌: పంచాయతీరాజ్‌ రోడ్ల అభివృద్ధి, మరమ్మతుల అంశం అసెంబ్లీని కుదిపేసింది. ప్రభుత్వ తీరుపై అధికార పార్టీ సభ్యులు మండిపడ్డారు. గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల అభివృద్ధిని పట్టించుకోవడం లేదని విమర్శించారు. గురువారం అసెంబ్లీలో పంచాయతీరాజ్, ఆర్‌అండ్‌బీ రోడ్లకు బీటీ పునరుద్ధరణపై దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి ప్రశ్న వేశారు. ఈ అంశంపై ఎక్కువ మంది ఎమ్మెల్యేలు మాట్లాడారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లోని రోడ్ల పరిస్థితిని వివరిస్తూ వాపోయారు.  

ప్రజలు తిట్టకుండా వెళ్లడం లేదు: రామలింగారెడ్డి  
అధికారుల తప్పుడు నివేదికల వల్ల దుబ్బాకలోని పలు గ్రామాల ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని ఎమ్మెల్యే రామలింగారెడ్డి అన్నారు. ‘సిరిసిల్ల నియోజకవర్గంలోని ముస్తాబాద్‌కు వెళ్లే రహదారి అధ్వానంగా ఉంది. ఆ రోడ్డు మీదుగా వెళ్లే వారు తిట్టకుండా వెళ్లడం లేదు. ఇదే రహదారిని ముస్తాబాద్‌ నుంచి అవతలి వరకు బాగా చేశారు. రోడ్లను మరమ్మతు చేయకుండానే చేసినట్లు నివేదికలు రూపొందించడం వల్ల ఈ పరిస్థితి తలెత్తింది.

కొన్ని రోడ్లలో నడుము లోతు గుంతలు ఏర్పడ్డాయి. ఆ రోడ్డుపైనే మంత్రి కేటీఆర్‌ సిరిసిల్లకు వెళ్లొస్తుంటారు. ఆయనకు పరిస్థితి తెలుసు. అధికారులకు ఎన్ని సార్లు చెప్పినా పరిస్థితి మారడం లేదు. పంచాయతీరాజ్‌ మంత్రికి వివరించినా ఫలితం లేదు. ముస్తాబాద్‌ రోడ్డును గత పదేళ్లలో ఒక్కసారి మరమ్మతు చేసినట్లు నిరూపించినా ముక్కు నేలకు రాస్తా’అన్నారు. వాస్తవాలను పట్టించుకుని ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.  

నిధుల్లేవంటున్నారు: భాస్కర్‌రావు
ఇదే అంశంపై మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్‌రావు మాట్లాడారు. తన నియోజకవర్గంలో రోడ్ల పరిస్థితి ఏమాత్రం బాలేదన్నారు. ‘పంచాయతీరాజ్, ఆర్‌అండ్‌బీ శాఖల మంత్రులను అడిగితే నిధుల్లేవంటున్నారు. కాంగ్రెస్‌ నుంచి టీఆర్‌ఎస్‌లోకి వచ్చినందుకో ఏమోగానీ మా నియోజకవర్గంలోని రోడ్ల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు’అని వాపోయారు. దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్రనాయక్, అందోల్‌ ఎమ్మెల్యే బాబూమోహన్‌ మాట్లాడుతూ.. ‘అధికారులు ఇచ్చిన ప్రతిపాదనలు సరిగా ఉండటం లేదు. అందుకే మరమ్మతు పనులు జరగడం లేదు’ అన్నారు.  

సగానికే ఆగిపోతున్నాయి: రమేశ్‌
అధికారులు నివేదికలు సరిగా రూపొందించకపోవడం వల్ల కొన్ని రోడ్లు అసంపూర్తిగా ఉన్నాయని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్‌ చెప్పారు. ‘వర్ధన్నపేట నియోజకవర్గంలోని సింగారం వంటి రోడ్ల పరిస్థితి ఇలాగే ఉంది. రెండు గ్రామాల మధ్య రోడ్డు దూరాన్ని సరిగా లెక్కగట్టక మధ్య వరకే బీటీ ఆగిపోతోంది. అక్కడ గుంతలు ఏర్పడి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు’అన్నారు.

అసెంబ్లీలో దాదాపు 15 మంది తమ నియోజకవర్గంలోని రోడ్ల పరిస్థితిని చెప్పుకునేందుకు అవకాశం ఇవ్వాలంటూ చేతులు ఎత్తారు. దీంతో స్పీకర్‌ మధుసూదనాచారి జోక్యం చేసుకుని.. ‘ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఇదే సమస్యను ప్రస్తావిస్తున్నారు. దీనిపై చర్చ జరిగితే మంచిది. అందరి పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని మంత్రి సమాధానం ఇవ్వాలి’ అన్నారు.

358 గ్రామాలకు రోడ్లు లేవు: జూపల్లి
తెలంగాణ ఏర్పడిన తర్వాత రోడ్ల అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపిస్తోందని పంచాయతీరాజ్‌ మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్పారు. కాంగ్రెస్‌ హయాంలో రోడ్ల అభివృద్ధి నిధుల కోసం ఎమ్మెల్యేలు పడిగాపులు కాయాల్సి వచ్చేదని పేర్కొన్నారు. 2004–2014 మధ్య బీటీ రోడ్ల మరమ్మతులకు రూ.416 కోట్లు ఖర్చు చేస్తే.. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మూడున్నరేళ్లలో రూ.2,240 కోట్లు ఖర్చు చేసిందని చెప్పారు.

14 వేల కిలోమీటర్ల రోడ్ల మరమ్మతు చేశామని.. 2,925 కిలోమీటర్ల రోడ్లను విస్తరించామన్నారు. మరో 4,695 కిలోమీటర్ల రోడ్లను మరమ్మతు చేయాల్సి ఉందని తెలిపారు. రాష్ట్రంలోని 358 పంచాయతీలకు బీటీ రోడ్లు లేవని మంత్రి చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా అవసరాలకు తగినట్లు రోడ్లను అభివృద్ధి చేస్తున్నామని, దుబ్బాక నియోజకవర్గంలోని రోడ్ల పరిస్థితి తెలుసుకుని నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.   

మరిన్ని వార్తలు