31 నుంచి బడ్జెట్‌ సమావేశాలు

10 Jan, 2019 03:26 IST|Sakshi

 ఫిబ్రవరి 1న మధ్యంతర బడ్జెట్‌

సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాలు 2019, జనవరి 31 నుంచి ఫిబ్రవరి 13 వరకూ జరగనున్నాయి. హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అధ్యక్షతన బుధవారం నాడిక్కడ సమావేశమైన పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్‌ కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ సమావేశాల్లో భాగంగా ఫిబ్రవరి 1న మధ్యంతర బడ్జెట్‌ను పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. ఈసారి పార్లమెంటు సమావేశాల సందర్భంగా సభలో ప్రవేశపెట్టాల్సిన బిల్లులు సహా పలు కీలక అంశాలను కేబినెట్‌ కమిటీ చర్చించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

లోక్‌సభ మంళవారం ఆమోదించిన పౌరసత్వ బిల్లు–2019ను బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా రాజ్యసభ ముందుకు తీసుకొచ్చే అవకాశముందని వెల్లడించాయి. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఈ నెల 31న ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. అనంతరం మధ్యంతర బడ్జెట్‌పై 2–3 రోజుల పాటు పార్లమెంటులో చర్చ సాగనుంది. అయితే కొన్ని కారణాల రీత్యా ఈసారి ఆర్థిక సర్వేను పార్లమెంటులో ప్రవేశపెట్టడం లేదు. కాగా, ఆర్డినెన్సుల జారీకి అనుకూలంగా రాష్ట్రపతి పార్లమెంటును స్వల్పకాలం మాత్రమే ప్రోరోగ్‌ చేసే అవకాశముందని తెలుస్తోంది. మరోవైపు ప్రస్తుతం పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ఆమోదం పొందని ట్రిపుల్‌ తలాక్, మెడికల్‌ కౌన్సిల్, కంపెనీ వ్యవహారాల ఆర్డినెన్సులను మరోసారి జారీచేస్తారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. 

మరిన్ని వార్తలు