కుదిపేసిన బ్యాంకింగ్‌ స్కాంలు

6 Mar, 2018 02:32 IST|Sakshi
ఢిల్లీలో పార్లమెంటు ప్రాంగణంలో విజయసంకేతం చూపిస్తున్న ప్రధాని మోదీ, అమిత్, రాజ్‌నాథ్, గడ్కారీ తదితరులు

ఎలాంటి చర్చ లేకుండానే ఉభయసభలు నేటికి వాయిదా

నీరవ్‌ ఆచూకీపై ప్రధాని సమాధానానికి ప్రతిపక్షాల పట్టు

రాజ్యసభలో స్వల్పకాలిక చర్చకు మొగ్గుచూపని విపక్షాలు

తెలంగాణలో ఎస్టీ, మైనార్టీల రిజర్వేషన్లు పెంచాలని టీఆర్‌ఎస్‌ డిమాండ్‌

న్యూఢిల్లీ: ప్రతిపక్షాల ఆందోళనల మధ్య మలిదశ బడ్జెట్‌ సమావేశాలు వాడీవేడిగా ప్రారంభమయ్యాయి. ఊహించినట్లే బ్యాంకింగ్‌ కుంభకోణాలపై విపక్షాలు ఉభయ సభల్ని స్తంభింపచేశాయి. పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు కుంభకోణంపై ప్రత్యేక చర్చ చేపట్టాలని, ప్రధాని మోదీ సమాధానం చెప్పాలని కాంగ్రెస్, తృణమూల్‌ సహా పలు ప్రతిపక్ష పార్టీలు లోక్‌సభ, రాజ్యసభల్లో పోడియంను చుట్టుముట్టి నినాదాలతో హోరెత్తించాయి. రిజర్వేషన్ల అంశంపై లోక్‌సభలో టీఆర్‌ఎస్, కావేరీ నదీ జలాల బోర్డు ఏర్పాటుపై సమాధానం చెప్పాలని పట్టుబడుతూ ఉభయ సభల్లో అన్నాడీఎంకే, డీఎంకేలు ఆందోళన కొనసాగించాయి.

ప్రశ్నోత్తరాల్లేకుండానే...
పీఎన్‌బీ కుంభకోణంపై విపక్షాల ఆందోళనలతో లోక్‌సభలో వాయిదాల పర్వం కొనసాగింది. దీంతో ప్రశ్నోత్తరాల సమయాన్ని చేపట్టకుండానే స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ సభను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదావేశారు. సభ తిరిగి ప్రారంభమయ్యాక.. కాంగ్రెస్‌ సభ్యులు వెల్‌లోకి దూసుకెళ్లి పీఎన్‌బీ కుంభకోణం సూత్రధారి నీరవ్‌ మోదీ ఎక్కడున్నారో ప్రధాని మోదీ సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. తృణమూల్‌ కాంగ్రెస్‌ కూడా అదే అంశంపై నినాదాలు చేస్తూ కాంగ్రెస్‌కు జతకలిసింది.

తెలంగాణలో ఎస్టీలు, మైనార్టీలకు రిజర్వేషన్లు పెంచాలని కోరుతూ టీఆర్‌ఎస్‌ ఎంపీలు స్పీకర్‌ పోడియాన్ని చుట్టుముట్టారు. రిజర్వేషన్ల అంశాన్ని రాష్ట్రానికే విడిచిపెట్టేలా ఆర్టికల్‌ 16ను సవరించాలని ఆ పార్టీ ఎంపీలు డిమాండ్‌ చేశారు.  అనంతరం సభను మంగళవారానికి వాయిదా వేశారు. ఉదయం లోక్‌సభ ప్రారంభానికి ముందు ప్రధాని మోదీ సభలోకి రాగానే బీజేపీ సభ్యులు చప్పట్లతో స్వాగతం పలికారు. అనంతరం అధికార, ప్రతిపక్ష సభ్యులకు మోదీ అభివాదం చేశారు. మూడు ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీ, దాని మిత్రపక్షాల విజయానికి సంకేతంగా బీజేపీ ఎంపీలు అస్సామీ గమోసా(కండువా)లతో దర్శనమిచ్చారు.

నిబంధన మేరకు చర్చకు అనుమతిస్తా
అటు పీఎన్‌బీ కుంభకోణంపై రాజ్యసభలోను ప్రతిపక్షాలు ఆందోళన కొనసాగించాయి. ఉదయం సభ ప్రారంభం కాగానే తృణమూల్‌ కాంగ్రెస్‌ బ్యాంకింగ్‌ కుంభకోణాల్ని ప్రస్తావించగా.. కావేరీ నదీ జలాల నిర్వహణ బోర్డు ఏర్పాటుపై సుప్రీం ఆదేశాల్ని అమలుచేయాలని అన్నాడీఎంకే, డీఎంకేలు పట్టుబట్టాయి. దీంతో చైర్మన్‌ వెంకయ్య నాయుడు సభను పదినిమిషాలు వాయిదా వేశారు.

అనంతరం సమావేశమయ్యాక వెంకయ్య మాట్లాడుతూ.. పీఎన్‌బీ అంశంపై చర్చించాలని 267 నిబంధన కింద పలువురు సభ్యుల నుంచి నోటీసులు అందాయని తెలిపారు. పీఎన్‌బీ కుంభకోణం అంశం చాలా ముఖ్యమైందని.. అయితే 267 కింద కాకుండా 176 నిబంధన మేరకు చర్చకు అనుమతి స్తానని చెప్పారు. నీరవ్‌ మోదీని భారత్‌కు తీసుకురావాలంటూ తృణమూల్‌ సభ్యులు నినాదాలతో హోరెత్తించారు. దీంతో చైర్మన్‌ సభను మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేశారు. సభ మరోసారి సమావేశమైనా ప్రతిపక్షాలు ఆందోళన కొనసాగించడంతో మంగళవారానికి వాయిదా వేశారు.

ప్రశ్నోత్తరాల అనంతరం చర్చ చేపట్టాలి: ప్రతిపక్షాలు
బ్యాంకింగ్‌ స్కాంలపై మంగళవారం 4 గంటలపాటు చర్చించా లని లోక్‌సభ బిజినెస్‌ అడ్వయిజరీ కమిటీ (బీఏసీ) సమావేశంలో ప్రతిపక్షాలు డిమాండ్‌ చేశాయి. స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ అధ్యక్షతన జరిగిన భేటీలో తృణమూల్‌ కాంగ్రెస్, బీజేడీ సభ్యులు మాట్లాడుతూ.. మధ్యాహ్నం 12 గంటలకు చర్చను చేపట్టాలని కోరారు. అన్ని అంశాలపై చర్చకు ప్రభుత్వం సిద్ధమని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి అనంత్‌ కుమార్‌ ఈ భేటీలో స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. 

మరిన్ని వార్తలు